కార్డు లేకుండానే నగదు తీసుకోవచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎటువంటి కార్డు, బ్యాంకు ఖాతా లేకుండానే నగదును తీసుకునే సౌకర్యాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు దగ్గర్లో ఉన్న ఏటీఎంకి వెళ్ళి నగదును తీసుకోవచ్చు. ఐఎంటీగా పిలుచుకునే ఈ తక్షణ నగదు బదిలీ (ఇనిస్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ) సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డులకు ఎక్కింది.
మా బ్యాంకు ఖాతాదారులు ఎదుటవారికి ఎటువంటి కార్డులు, బ్యాంకు అకౌంట్ లేకపోయినా నగదును పంపించుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అండ్ ఎండీ వి.ఆర్.అయ్యర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐఎంటీ సేవలను లాంఛనంగా ప్రారంభిస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగదు తీసుకునే వారి మొబైల్‌కి రహస్య నెంబర్లు వస్తాయని, వీటిని దగ్గర్లోని ఐఎంటీ ఆథారిత ఏటీఎంలోకి వెళ్ళి ఆ నంబరును ఎంటర్‌చేయడం ద్వారా నగదు తీసుకోవచ్చన్నారు. రోజు కు గరిష్టంగా రూ.10,000, మించకుండా, నెలలో రూ.25,000 వరకు ఈ ఐఎంటీ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సేవలను అందుకున్నందుకు గాను రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.