జత్రోపా ప్లాంట్ పెట్టుబడులపై సెబీ నిషేధం
ముంబై: జత్రోపా మొక్కల పెంపకం ద్వారా భారీ స్థాయిలో లాభాలు ఆర్జించవచ్చంటూ పెట్టుబడులను సమీకరించే పథకాలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చెక్ పెట్టింది. మేకలు, ఆవులు, ఈమూ పక్షులు తదితరాల పెంపకం ద్వారా లాభాలు ఆర్జించే పథకాలను ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. జత్రోపా మొక్కల పెంపకం ద్వారా పెట్టుబడులు ఏడేళ్లలో రెట్టింపునకుపైగా పెరుగుతాయంటూ ఇటీవల కొన్ని సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు సెబీ పేర్కొంది. ఇలాంటి పథకం ద్వారా ఢిల్లీకి చెందిన సన్‌షైన్ గ్లోబల్ ఆగ్రో లిమిటెడ్(గతంలో సన్‌షైన్ ఫారెస్ట్రీ ప్రయివేట్) దాదాపు 40,000 మంది ఇన్వెస్టర్ల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు తెలిపింది. ఒక్కో జత్రోపా మొక్కపైనా రూ. 1,000 ఇన్వెస్ట్‌చేస్తే ఏడేళ్ల పెంపకం తరువాత మొక్క ఖరీదు రూ. 3,000కు చేరుతుందంటూ ఆశ చూపినట్లు వివరించింది.
2007 నుంచి వెలుగులోకి
ఈజిప్ట్, ఇండియా, మడగాస్కర్ వంటి ఉష్ణ దేశాలలో పెరిగే జత్రోపా మొక్కలు బయోడీజిల్ ఇంధనానికి భవిష్యత్‌లో భారీగా ఉపయోగపడతాయని గోల్డ్‌మన్ శాక్స్ 2007లో అంచనా వేసింది. ఈ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం వేసిన అంచనాతో జత్రోపా మొక్కలపై పెట్టుబడుల పరమైన ఆసక్తి ఏర్పడింది.