
ముంబై: రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటును క్రమబదీ్ధకరించినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ప్రకటించింది. అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), ఈకామ్, భారత్‌క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్ లావాదేవీలపై రేట్లను క్రమబదీ్ధకరించినట్టు వివరించింది. రూ.2,000కు పైన ఉండే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ చార్జీని 0.60 శాతానికి సవరించామని, గరిష్టంగా రూ.150గానే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రూ.2,000పైన లావాదేవీలపై 0.90 శాతం వరకు అంటే గరిష్టంగా రూ.1,000 వరకు ఉండేది. ఇక క్యూఆర్ లావాదేవీలపై చార్జీని 0.50 శాతానికి తగ్గించింది. గరిష్ట చార్జీ రూ.150.