యవ్వనం నుంచి వృద్ధాప్యం సమీపించే వరకు ఉండే 40 ఏళ్ల కాలం ఎంతో విలువైనది అవుతుంది. ఈ కాలంలో ఆర్థికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎన్నో లక్ష్యాలు తెరపైకి వస్తాయి... కనుక ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ సదా సన్నద్ధులు కావాలి. ఉదాహరణకు రూ.40 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల వ్యవధిపై తీసుకున్నారనుకోండి... ఇంకా 18 ఏళ్ల కాలం మిగిలి ఉంది. కానీ, వచ్చే పదేళ్లలోనే రుణాన్ని పరిపూర్ణంగా ముగించేయాలన్నది హైదరాబాద్‌కు చెందిన హర్షవర్ధన్ నిర్ణయం. ఇందుకోసం అతను ప్రతీ నెలా చెల్లించాల్సిన రూ.37,500 ఈఎంఐను పెంచుతూ వెళ్లాలనుకున్నాడు. లక్ష్యాన్ని చేరుకునే విషయంలో అతనికి సందేహం లేదు. ఎందుకంటే సొంతింటిని సమకూర్చుకోవాలనుకున్న వెంటనే అతడు పొదుపు ప్రారంభించి రూ.19 లక్షల డౌన్ పేమెంట్‌ను సిద్ధం చేసుకున్న చరిత్ర ఉంది. పొదుపు చేయడం ఎలాగో హర్షవర్ధన్‌కు తెలుసు. ‘‘విలువ తరిగిపోయే ఆస్తుల కొనుగోలుకు దూరంగా ఉంటాను. నా స్నేహితులు ఖరీదైన మొబైల్స్, డ్రెస్‌లు, కార్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ, కొంత కాలం తర్వాత అవి ఎందుకూ పనికిరావు’’ అని హర్షవర్ధన్ తెలిపారు. అంటే విలువను సృష్టించడం అన్నది హర్షవర్ధన్‌కు తెలిసిన విషయం. ఆర్థిక విషయాల్లో ఈ తరహా క్రమశిక్షణ ఉన్న వారే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు... సవాళ్లకు సై అంటారు. బడ్జెట్, పొదుపు, ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి తదితర అంశాలకు అందులో చోటు ఉండాలి. పన్ను ఆదా కోసం అయితే ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాలను పరిశీలించొచ్చు. మిలీనియల్ జనరేషన్‌కు (1981–1996 మధ్య జన్మించిన వారు/22–37 వయసు) ఈక్విటీ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు వారి వయసు అనుకూలమైనది. ఎందుకంటే రిటైర్మెంట్‌కు దీర్ఘకాలం మిగిలి ఉంటుంది. కనుక రిస్క్ తీసుకోవడం ద్వారా అధిక రాబడులు అందుకోవచ్చు.
ముప్పైల్లోనే పునాది
30 ఏళ్ల వయసుకొచ్చే సరికి ప్రతీ వ్యక్తికి బాధ్యతలు తెలిసివస్తాయి. వివాహం, పిల్లలు, ఇంటి కొనుగోలు ఇలా ఎన్నో లక్ష్యాలు, అవసరాలు ఎదురవుతాయి. కనుక కుటుంబం కోసం, మీపై ఆధారపడిన వారి పట్ల దృష్టి సారించాల్సిన వయసు ఇది. విశాఖపట్నానికి చెందిన రాధిక (27), పవన్‌కుమార్ (31) గతేడాదే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలసి వెడ్డింగ్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తమకు పుట్టబోయే పిల్లల గురించి వీరు ముందుగానే ఆలోచన కూడా చేశారు. పిల్లల విద్యావసరాల కోసం పెళ్లయిన మూడు నెలల్లోనే ప్రతీ నెలా రూ.6,000 చొప్పున రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. పదేళ్లలో రూ.10.36 లక్షల రూపాయలైనా సమకూర్చుకోవాలన్నది వారి లక్ష్యంగా ఉంది. లక్ష్యానికంటే ముందుగానే సన్నద్ధం కావడం ఓ మంచి ఆలోచన అవుతుంది. కాకపోతే అనుకున్నట్టు ప్రణాళికలను అమల్లో పెట్టడమే కష్టమైన టాస్క్. హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కూడా అంతే. బహుళజాతి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే క్రాంతి పదేళ్ల క్రితమే... వచ్చే పదేళ్లలో ఇంటి కోసం రూ.80లక్షలు సమకూర్చుకోవాలని నిర్ణయించుకుని అందుకు తగ్గట్టు ఇన్వెస్ట్ చేశాడు. లక్ష్యంలో సఫలం కూడా అయ్యాడు. ఈ మొత్తాన్ని ఇంటి కొనుగోలు కోసం వినియోగించుకోవాలన్నది అతడి ఆలోచన. పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం, తన రిటైర్మెంట్ అవసరాల కోసం సిప్ ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తున్నాడు.
40ల్లో మల్టీటాస్క్
40ల్లోకి ప్రవేశించిన వారు రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉంటారు. అందుకోసం తగినంత నిధిని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరో 15–20 ఏళ్లకు చెప్పుకోతగ్గ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ‘‘రిస్క్ తీసుకోలేని సంప్రదాయ ఇన్వెస్టర్లు పీపీఎఫ్‌ను ఎంచుకోవచ్చు. కాస్త రిస్క్‌ను తీసుకునేందుకు సిద్ధపడేవారు ఈక్విటీలను పరిశీలించాలి. రెండో ఇంటిని కొనుగోలు చేయడం కూడా మంచి ఆలోచనే అవుతుంది’’ అని ఇండియన్‌మనీ వ్యవస్థాపకుడు సుధీర్ తెలిపారు. ఇక 40ల్లో రుణ భారం లేకుండా ఉండడం అనేది పెద్ద సవాలే. 50కు దగ్గరపడితే అన్ని రకాల రుణాలను తీర్చివేసి, రిటైర్మెంట్ ప్రణాళికపై దృష్టి సారించడం మంచిదన్నది నిపుణుల సూచన. ఒకవేళ పిల్లల ఉన్నత విద్యకు నిధులు సర్దుబాటు అవకపోతే విద్యా రుణ మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అంతేకానీ, రిటైర్మెంట్ నిధిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దన్నది సూచన. ఎందుకంటే వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడకుండా, తమ జీవన అవసరాలను సాఫీగా సాగిపోవాలంటే అందుకు నిధి తప్పనిసరి. దీని అవసరాన్ని గుర్తించి ముందుగానే కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. లేకపోతే జీవన అవసరాల విషయంలో రాజీ పడాల్సి రావడంతోపాటు, పిల్లలపై ఆధారపడాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.
50–60ల్లోకి ప్రవేశించిన తర్వాత
విశ్రాంత జీవనానికి పదేళ్ల కాలమే మిగిలి ఉంటుంది. కనుక ఈ వయసులో రిస్క్ తీసుకోరాదు. సురక్షిత సాధనాలవైపు చూడాలి. రుణాలు తీసుకుని ఉంటే వాటిని చెల్లించే మార్గాలను అన్వేషించాలి. రిటైర్మెంట్ 55 లేదా 60 ఏళ్లు అనుకుంటే దానికి రెండు మూడేళ్ల ముందే బాధ్యతలన్నీ పూర్తయ్యేట్టు చర్యలు తీసుకోవాలి. రిటైర్మెంట్ సమయం తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ప్రధానమంత్రి వయవందన యోజన వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేసి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవాలి.
ఆర్థిక సవాళ్లకు సిద్ధమా?
Published Mon, Mar 11 2019 12:46 AM | Last Updated on Mon, Mar 11 2019 12:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment