
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ వర్క్‌స్పేసెస్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఐస్ప్రౌట్... కొత్త నగరాలకు విస్తరిస్తోంది. 2019 మార్చిలో చెన్నైలో 210 సీట్ల సామర్థ్యం ఉన్న కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. పుణే, బెంగళూరు, గుర్గావ్‌లోనూ ఆరు నెలల్లో బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ కో–ఫౌండర్ సుందరి పాటిబండ్ల ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి తెలిపారు. ఇటీవలే విజయవాడలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 సీట్ల సామర్థ్యం గల కార్యాలయాన్ని ప్రారంభించామని, 2019 డిసెంబరుకల్లా 10 సెంటర్లతో మొత్తం 7,000 సీట్ల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యమని వెల్లడించారు.
‘హైదరాబాద్‌లో ఐస్ప్రౌట్‌కు 1.3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 2,400 సీట్ల సామర్థ్యం గల బిజినెస్ సెంటర్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్ సామర్థ్యం పరంగా భారీ, ప్రీమియం బిజినెస్ సెంటర్ ఇది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు వెచ్చించాం. భవిష్యత్ విస్తరణలో భాగంగా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలన్నది మా ఆలోచన’ అని ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment