
న్యూఢిల్లీ: ప్రేక్షకాదరణ కోసమంటూ మహిళల క్రికెట్‌కు పనికిరాని మార్పులు చేయొద్దని భారత సీనియర్ పేసర్ శిఖా పాండే సూచించింది. మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ దక్కేందుకు బంతి బరువు తగ్గించడం, పిచ్ పొడవును 20 గజాలకే పరిమితం చేయాలంటూ వస్తోన్న ప్రతిపాదనలపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పురుషుల ఆటలతో మహిళల ఆటల్ని పోల్చవద్దన్న ఆమె అనవసర మార్పులతో మహిళా క్రికెట్ సామర్థ్యాన్ని తక్కువ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ‘మహిళా క్రికెట్‌ను ఆకర్షణీయం చేసేందుకు వినిపిస్తోన్న మార్పులన్నీ నిరుపయోగమైనవని నా అభిప్రాయం.
ఆటకు ఆదరణ కల్పించాలంటే మంచి మార్కెటింగ్ అవసరం అంతేగానీ పిచ్ పొడవు తగ్గించకూడదు. మేం బంతిని బలంగా బాదలేమనే ఉద్దేశంతో బంతి బరువు తగ్గించాలనుకోవడం సరికాదు. ఇటీవల మహిళా క్రికెట్‌లో పవర్‌హిట్టింగ్ పెరగడం అందరూ చూస్తున్నారు. పురుష అథ్లెట్లకు సమానమని అనిపించుకునేందుకు ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం మహిళా స్ప్రింటర్ 100 మీటర్ల పరుగును 80 మీటర్లే పరుగెత్తాలనుకోదు. ఇది అంతే. మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం అన్ని మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయాలి. మా మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మాలో సత్తా ఉందని వారు నమ్ముతున్నారు. మీరు కూడా మమ్మల్ని నమ్మండి’ అని శిఖా కోరింది.
Comments
Please login to add a commentAdd a comment