బేసిక్ ఫోన్లలో ఒక్క క్లిక్‌తో ఇంటర్నెట్..
- ఎయిర్‌టెల్.. ‘వన్ క్లిక్ ఇంటర్నెట్’ సిమ్
- భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేస్‌బుక్, వార్తలు, వినోదం ఇలా ఏది కావాలన్నా స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్లతో ఒక్క క్లిక్‌తో పొందవచ్చు. మరి బేసిక్ ఫోన్ వాడేవారి సంగతేంటి? ఇంటర్నెట్ వీరికి పెద్ద ప్రహసనమే. బేసిక్ ఫోన్లలో కూడా ఒక్క క్లిక్‌తో నెట్‌లో విహరించగలిగితే! ఇదిగో మీ కోసమే ‘వన్ క్లిక్ ఇంటర్నెట్’ పేరుతో ప్రత్యేక సిమ్‌ను టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ భారత్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టింది. బేసిక్ ఫోన్లలో నెట్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ కావాలంటే 30కిపైగా క్లిక్‌లు చేయాలి. అలా కాకుండా ఎయిర్‌టెల్ సిమ్‌తో మెనూలోకి వెళ్లి ఎయిర్‌టెల్ లైవ్ అనే ఆప్షన్ తెరిస్తే చాలు.
ఫేస్‌బుక్, గూగుల్, పాటలు, వినోదం, క్రికెట్, వార్తలు, సహాయం అనే లింకులు ప్రత్యక్షమవుతాయి. కావాల్సిన లింక్‌ను క్లిక్ చేస్తే చాలు. పల్లెల్లో ఉన్న కస్టమర్లకూ ఇంటర్నెట్‌ను సులభతరం చేయాలన్న లక్ష్యంతో సిమ్‌ను తీసుకొచ్చామని ఎయిర్‌టెల్ ఉన్నతాధికారి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. చవక ఫోన్లు కూడా స్మార్ట్‌ఫోన్లుగా మారిపోతాయని అన్నారు. నెట్‌ను సపోర్ట్ చేసే ఫోన్లలో మాత్రమే ఈ సిమ్ పనిచేస్తుంది.
తెలుగులోనూ నెట్..: దేశంలో మొత్తం సెల్‌ఫోన్ కనెక్షన్లలో 90% మంది మొబైల్ ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం వీరంతా బేసిక్ ఫోన్లను వాడుతుండడమే. భాష కూడా వీరికి అడ్డంకే. శాంసంగ్, నోకియా, సెల్‌కాన్ వంటి కంపెనీలు బేసిక్ ఫోన్లలో కూడా తెలుగుతోపాటు పలు భారతీయ భాషలను ప్రవేశపెడుతున్నాయి. ఇంగ్లిష్ రానివారు నెట్‌ను వినియోగించుకునేందుకు ఈ ఫోన్లు ఉపయుక్తంగా ఉంటాయి. ఇక ఎయిర్‌టెల్ కొత్త సిమ్‌తో స్థానిక భాషలో కూడా నెట్ వాడొచ్చు. కొత్త కనెక్షన్ తీసుకునేవారు సిమ్ కోసం రూ.31 చెల్లించాలి. రూ.25 టాక్‌టైంతోపాటు ఒక నెల పాటు 50 ఎంబీ డేటా ఉచితం. కాల్, డేటా చార్జీలు కస్టమర్ ఎంచుకునే ప్యాకేజీనిబట్టి ఉంటాయి. ప్రస్తుతానికి భారత్‌లో తెలంగాణ, సీమాంధ్రలోనే ఈ సిమ్ దొరుకుతుంది.