
బీజింగ్: చైనా మొబైల్ సంస్థ వన్‌ప్లస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఇతర సమాచారం లీక్ అయిందంటూ బాంబు పేల్చింది. "అనధికార పార్టీ" ద్వారా కస్టమర్ల డేటా లీకైందని వెల్లడించింది. ఈ మేరకు తన వినియోగదారులకు సమాచారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే, డేటా ఉల్లంఘనతో ఎంతమంది ప్రభావితమయ్యారనేది కంపెనీ స్పష్టంగా ప్రకటించలేదు.
వన్‌ప్లస్ కస్టమర్ల ఆర్డర్ల ద్వారా హ్యాకర్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేశారని తెలిపింది. ముఖ్యంగా కస్టమర్ పేర్లు, కాంటాక్ట్ నంబర్లు, ఇమెయిల్, చిరునామా వంటి వివరాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక వివరాలు భద్రంగా ఉన్నాయని హామీ ఇచ్చింది. దీనిపై తమ వినియోగదారులను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందిస్తున్నామని వెల్లడించింది. ఈ డేటా బ్రీచ్ మూలంగా కొంతమందికి స్పామ్ మెసేజ్‌లు, నకిలీ ఈమెయిల్స్ రావచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత వారమే డేటా లీక్ విషయాన్ని గ్రహించామని, వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అంతేకాదు సంస్థనుంచి అధికారిక ఇమెయిల్ రాకపోతే, సంబంధిత వినియోగదారుని ఆర్డర్ సమాచారం సురక్షితమనే విషయాన్ని గమనించాలని వన్‌ప్లస్ వివరించింది. దీనిపై మరింత దర్యాప్తు కోసం సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వన్‌ప్లస్ సెక్యూరిటీ టీం ప్రతినిధి జీవ్ సీ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment