దిగ్గజాల ‘పాటల’ పల్లకి | Online listeners and viewers online are growing significantly | Sakshi
Sakshi News home page

దిగ్గజాల ‘పాటల’ పల్లకి

Published Sat, May 4 2019 12:37 AM | Last Updated on Sat, May 4 2019 12:37 AM

Online listeners and viewers online are growing significantly - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా చౌక డేటా ప్యాక్‌లు అందుబాటులోకి రావటంతో ఆన్‌లైన్‌లో పాటల శ్రోతలు, వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో బడా విదేశీ సంస్థలూ భారత మార్కెట్‌పై దృష్టి పెడుతున్నాయి. కొత్త కొత్త కంపెనీల రాకతో ఆన్‌లైన్‌ పాటల మార్కెట్లో గట్టి పోటీ నెలకొంది. యాపిల్‌ మ్యూజిక్, యూట్యూబ్‌ మ్యూజిక్, అమెజాన్‌ ప్రైమ్‌ మ్యూజిక్, స్పాటిఫై, గానా, జియోసావన్‌ వంటి సంస్థలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ మ్యూజిక్‌ మార్కెట్‌ 2020 నాటికి 273 మిలియన్‌ డాలర్లకు చేరవచ్చని మార్కెట్‌ కన్సల్టింగ్‌ సంస్థ డెలాయిట్‌ అంచనా వేసింది. 

డిజిటల్‌ కంటెంట్‌లో మ్యూజిక్‌ హవా.. 
దేశీ యూజర్లు అత్యధికంగా వినియోగిస్తున్న డిజిటల్‌ కంటెంట్‌పై స్టాటిస్టా అనే డేటాబేస్‌ ప్లాట్‌ఫామ్‌ గతేడాది నిర్వహించిన సర్వే ప్రకారం పాటల కేటగిరీ అగ్రస్థానంలో ఉంది. 0–4 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్కోరులో మ్యూజిక్‌కు అత్యధికంగా 3.13 పాయింట్లు దక్కాయి. యాప్స్, టీవీ షోలు, సినిమాలు, వార్తాపత్రికలు, వీడియో గేమ్స్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సైబర్‌ మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం భారత్‌లో సుమారు 55 శాతం జనాభా.. మ్యూజిక్‌ వినడంపై దాదాపు 30 శాతం సమయాన్ని వెచ్చిస్తున్నారు.    

టాప్‌లో గానా.. 
పాటలంటే చెవి కోసుకునే దేశీవాసులు.. వినూత్న మ్యూజిక్‌ యాప్స్‌ వైపు మళ్లుతున్నారు. భారత్‌లో లాంచ్‌ చేసిన వారం రోజుల్లోనే యూట్యూబ్‌ మ్యూజిక్‌ను ముప్ఫై లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం దీనికి నిదర్శనం. ఇక ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించిన స్వీడన్‌కు చెందిన మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ స్పాటిఫై విషయానికొస్తే వారం రోజుల వ్యవధిలో పది లక్షల మంది యూజర్లు దీనికి నమోదయ్యారు. సీఎంఆర్‌ గణాంకాల ప్రకారం దేశీయంగా యూజర్లు అత్యధికంగా ఇష్టపడుతున్న ఆన్‌–డిమాండ్‌ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌లో గానా (25 శాతం) అగ్రస్థానంలో ఉంది. యాపిల్‌ (20 శాతం), యూట్యూబ్‌ (20 శాతం), వింక్‌ (14 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మొబైల్‌ ఫోన్‌ మాధ్యమం ద్వారా చౌకగా, సులభతరంగా లభ్యమవుతుండటంతో దేశీయంగా ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ శ్రోతల సంఖ్య పెరుగుతోందని సీఎంఆర్‌లో భాగమైన ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ (ఐఐజీ) హెడ్‌ ప్రభు రామ్‌ పేర్కొన్నారు. 

ఆకర్షణీయ ప్యాకేజీలు..
యూజర్లను ఆకర్షించేందుకు ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) సంస్థలు ఫీజులు తగ్గిస్తున్నాయి. నెలవారీ ప్యాకేజీలతో పాటు వారం వారీ, రోజువారీ ప్లాన్స్‌ను కూడా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. జియోసావన్‌ తమ వార్షిక ఫీజును రూ.999 నుంచి రూ.299కి తగ్గించింది. గానా కూడా రూ. 1,098 నుంచి రూ.299కి తగ్గించింది. యాపిల్‌ మ్యూజిక్‌ కూడా భారత్‌లో నెలవారీ రేట్లను రూ.99కి తగ్గించింది. అటు యూట్యూబ్‌ మ్యూజిక్‌ ప్రీమియం సైతం రూ. 99కే నెలవారీ ప్లాన్‌ అందిస్తోంది. అమెజాన్‌ మరికాస్త ఎక్కువగా ఆఫర్‌ చేస్తోంది. నెలకు రూ.129 ఫీజుకి అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు అమెజాన్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తోంది. ఈ విషయంలో స్పాటిఫై కాస్త వెనుకబడినప్పటికీ కొంత ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. భారత్‌లో రూ.119 సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తోంది. సింగిల్‌ డే పాస్‌ నుంచి ఆరు నెలల దాకా గడువుండే ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను అందిస్తోంది. అయితే, యూజర్ల నుంచి సబ్‌స్క్రిప్షన్‌పరంగా ఓటీటీ సంస్థలకు సమీపకాలంలో ఆదాయాలు పెద్దగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. మిగతా సంపన్న దేశాలతో పోలిస్తే కంటెంట్‌ను కొనుక్కునేందుకు దేశీ వినియోగదారులు అంతగా ఇష్టపడకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement