
డిపాజిట్ రూ.50వేలు మించితే పాన్ కార్డు ఉండాల్సిందే
బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.50 వేలకు మించి చేసే డిపాజిట్లకు పాన్ కార్డు జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ తాజాగా సూచించింది.
బ్యాంకులకు ఆర్‌బీఐ సూచన
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.50 వేలకు మించి చేసే డిపాజిట్లకు పాన్ కార్డు జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ తాజాగా సూచించింది. వాస్తవానికి ఈ నిబంధన గతంలోనూ అమల్లో ఉంది. తమ ఖాతాలకు పాన్‌కార్డ్ నంబర్ సమర్పించని ఖాతాదారులు రూ.50 వేలకు మించి డిపాజిట్ చేస్తుంటే... ఆదాయపన్ను చట్టంలోని 114బీ నిబంధనకు అనుగుణంగా తప్పనిసరిగా పాన్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకోవాలని ఆర్‌బీఐ కోరింది. ఈ నిబంధన కింద అమల్లోకి వచ్చే అన్ని రకాల లావాదేవీలకు పాన్ నంబర్ సమర్పించాలంటూ ఖాతాదారులను కోరాలని సూచించింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతవారం నిర్ణయం తీసుకున్న తర్వాత పాత నోట్లను ప్రజలు తమ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో జమ చేసుకుంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ బ్యాంకులకు తాజా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
పాన్ ఏఏ సందర్భాల్లో సమర్పించాలి...?
ఆదాయపన్ను చట్టంలోని 114బీ నిబంధన ప్రకారం బ్యాంకులు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో రూ.50 వేలకు మించి చేసే టైమ్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి. అదే విధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు రూ.5 లక్షలకు మించినా పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, మోటారు వాహనాల విక్రయం, అమ్మకం, బ్యాంకు ఖాతా ప్రారంభం, క్రెడిట్, డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్న సమయాల్లో, డీమ్యాట్ ఖాతా ప్రారంభ సమయంలోనూ పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, హోటళ్ల బిల్లులు, ప్రయాణ చార్జీల రూపేణా రూ.50 వేలకు మించి చేసే చెల్లింపులకు... రూ.50 వేలకు మించి విలువైన మ్యూచువల్ ఫండ్‌స, బాండ్లు, బ్యాంకు డ్రాఫ్ట్‌లు లేదా పే ఆర్డర్లు తదితర లావాదేవీల సమయాల్లోనూ పాన్ తప్పనిసరి.