న్యూఢిల్లీ: భారత్‌లో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకోవాలని నిపుణుల సంఘం సూచించింది. విదేశీ ఇన్వెస్టర్లకు సంబంధించిన నిబంధనలు సరళీకరించాలని, సెన్సెక్స్, నిఫ్టీలలాగా కార్పొరేట్ బాండ్ ఇండెక్స్‌ను ఏర్పాటు చేయాలని, ఈ మార్కెట్ ద్వారా కంపెనీలు నిధులు సమీకరించడాన్ని తప్పనిసరి చేయాలని... ఇలా ఈ సంఘం పలు సూచనలు చేసింది.
రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి, ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ తదితర సంస్థల నామినీలతో కూడిన ఈ సంఘం ఈ మేరకు తన నివేదికను ఫైనాన్షియల్ స్టెబిలిటి అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్(ఎఫ్‌ఎస్‌డీసీ) చైర్మన్ అయిన రఘురామ్ రాజన్‌కు సమర్పించింది. ఈ నివేదికను సెబి చైర్మన్ యు.కె. సిన్హా గురువారం విడుదల చేశారు. నిపుణుల సంఘం సూచనల్లో కొన్ని.,
♦ మోసాలు జరిగినప్పుడు సకాలంలో వాటిని వెల్లడించేలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నిబంధనలను సరళీకరించాలి.
♦ కంపెనీలు తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కావలసిన నిధుల్లో కొంత భాగాన్ని ఈ బాండ్ మార్కెట్ నుంచే సమీకరించేలా నిబంధనలు రూపాందించాలి.
♦ లిస్ట్ కాని డెట్ సెక్యూరిటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ఫెమా నిబంధలను సవరించాలి.
♦ కార్పొరేట్ బాండ్లలో నేరుగా ట్రేడింగ్ చేయడానికి విదేశీ ఇన్వెస్టర్లును అనుమతించేలా ఫెమా, సెబి నిబంధనలను సరళీకరించాలి.