పేటీఎం నుంచి మెసేజింగ్ సేవలు!!
న్యూఢిల్లీ: వాట్సాప్‌కు పేటీఎం పోటీగా రాబోతోందా? ఇది మెసేజింగ్ సర్వీసులను ప్రారంభించటానికి సర్వం సిద్ధం చేసుకుంటోందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. పేటీఎం ఈ నెలాఖరు నాటికి మెసేజింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. పేటీఎం తన ప్లాట్‌ఫామ్‌కు కొత్త ఫీచర్‌ను జోడించనుందని, దీని ద్వారా యూజర్లు చాట్ చేసుకోవచ్చని, అలాగే ఆడియో, వీడియో, ఫోటోలను షేర్ చేసుకోవచ్చని ఈ వ్యవహారంతో సంబంధమున్న కొందరు తెలియజేశారు.
అయితే దీనిపై స్పందించడానికి పేటీఎం అధికార ప్రతినిధి నిరాకరించారు. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తే పేటీఎం యూజర్ల సంఖ్య మరింత పెరుగుతుందని వీరు ధీమా వ్యక్తంచేశారు. వాట్సాప్ డిజిటల్ పేమెంట్స్ విభాగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోన్న తరుణంలో పేటీఎం మెసేజింగ్ సేవలను అందించడానికి ప్రయత్నించడం ఆసక్తికరమైన పరిణామం. కాగా భారత్‌లో వాట్సాప్‌కు 2017 ఫిబ్రవరి నాటికి 20 కోట్లకుపైగా మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉంటే.. పేటీఎంకు 23 కోట్లకుపైగా యూజర్లున్నారు.