వాలెట్‌ వార్‌ : వాట్సాప్‌ (VS) పేటీఎం | WhatsApp Pay may end Paytm hegemony in India | Sakshi
Sakshi News home page

వాలెట్‌ వార్‌ : వాట్సాప్‌ (VS) పేటీఎం

Published Wed, May 8 2019 12:39 AM | Last Updated on Wed, May 8 2019 12:39 AM

WhatsApp Pay may end Paytm hegemony in India - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా–చైనా సంస్థల మధ్య వాణిజ్య పోరు ఆయా దేశాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. తాజాగా ఆ కంపెనీలు భారత మార్కెట్లోనూ ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత డిజిటల్‌ చెల్లింపుల రంగంలో ఆధిపత్యం కోసం రెండు దేశాల కంపెనీలు హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఒకవైపు అత్యధిక యూజర్లు ఉపయోగించే అమెరికన్‌ మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్, మరోవైపు చైనా ఇన్వెస్టర్ల అండ ఉన్న దేశీ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం మధ్య గట్టి పోటీ ఉండబోతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  డీమోనిటైజేషన్‌ అనంతరం భారత్‌లో డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఇటువైపు దృష్టి సారిస్తున్నాయి. టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రత్యేకంగా పేమెంట్‌ యాప్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. రిటైల్‌ సంస్థ అమెజాన్‌ సొంత వాలెట్‌ను ప్రవేశపెట్టింది. పరిశ్రమవర్గాల సమాఖ్య అసోచాం, ఆర్‌ఎన్‌సీవోఎస్‌ సంస్థ అంచనాల ప్రకారం.. దేశీ మొబైల్‌ వాలెట్‌ లావాదేవీల విలువ 2016లో రూ.154 కోట్లు. ఇది 2022 నాటికి రూ.275 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో ఈ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దిగ్గజాలు పోటీపడుతున్నాయి. మిగతా వాటన్నింటికంటే ముందుగా రంగంలోకి దిగిన పేటీఎం సంస్థ  ప్రస్తుతం ఈ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 30 కోట్ల మందికి పైగా యూజర్లు, 33% మార్కెట్‌ వాటాతో దేశీయంగా పేటీఎం అతి పెద్ద మొబైల్‌ పేమెంట్‌ కంపెనీగా నిలుస్తోంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌ నెమ్మదిగా ఈ విభాగంలో ముందుకెళుతోంది. 2017  సెప్టెంబర్‌లో ఈ సంస్థ గూగుల్‌ పే పేరుతో పేమెంట్స్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు దీన్ని ప్రారంభించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. నెలవారీ క్రియాశీలకంగా ఉండే యూజర్ల సంఖ్య  ఏడాది క్రితం 1.4 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి ఇది 4.5 కోట్లకు చేరింది.  

‘వాట్సాప్‌’కు అంత ఈజీ కాదు.. 
అమెరికన్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌లో భాగమైన మెసేజింగ్‌ యాప్‌.. వాట్సాప్‌ కూడా భారత్‌లో భారీగా పేమెంట్‌ సేవలను విస్తరించాలని భావిస్తోంది. విస్తృతంగా యూజర్లు ఉండటం వాట్సాప్‌కు సానుకూలాంశం. దీనికి భారత్‌లో ప్రస్తుతం సుమారు 30 కోట్ల మంది పైగా యూజర్లున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లకు చేరువయ్యేందుకు దీన్ని ఉపయోగిస్తున్నాయి. ఇవి వాట్సాప్‌కు సానుకూలాంశాలే అయినప్పటికీ చెల్లింపుల మార్కెట్లో.. అయితే, చైనాకి చెందిన ఆలీబాబా గ్రూప్‌ అండ ఉన్న దేశీ పేమెంట్‌ సర్వీసుల సంస్థ పేటీఎం నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి రానుంది. అంతేకాక ఇతరత్రా సవాళ్లూ తక్కువేమీ కాదు. కేంద్రం నిర్దేశించినట్లుగా డేటా లోకలైజేషన్, డేటా భద్రత నిబంధనలను వాట్సాప్‌ అమలు చేయడం లేదంటూ సుప్రీం కోర్టులో ఇటీవలే పిటిషన్‌ దాఖలైంది. అటు రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా చెల్లింపుల డేటాను (ట్రయల్‌ దశలోనైనా సరే) భారత్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి వాట్సాప్‌ కూడా అంగీకరించింది. ఈ రకంగా చూస్తే  భారత్‌లో వాట్సాప్‌ పే ఆరంగేట్రం చాలా ఖరీదైన వ్యవహారంగా మారే అవకాశం ఉంది.  

పోటాపోటీ...  
ఈ మార్కెట్లో దూసుకుపోవడం వాట్సాప్‌కు అంత ఆషామాషీగా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గూగుల్‌ పే, అమెజాన్‌ పే, వాల్‌మార్ట్‌– ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన ఫోన్‌పే లాంటి ఇతర దిగ్గజాలతోనూ పోటీపడాలి. అదీ గాకుండా టెక్‌ సంస్థ యాపిల్‌ త్వరలోనే తమ యాపిల్‌ పే మొబైల్‌ వాలెట్‌ను కూడా భారత్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అమెజాన్, వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థల పరిస్థితి కాస్త వేరుగా ఉంటుంది. ఈ పేమెంట్స్‌ వాలెట్స్‌ను వాటి సొంత కస్టమర్లే .. అదీ ఎక్కువగా క్యాష్‌బ్యాక్‌ కోసమే ఉపయోగించుకుంటూ ఉంటారు. టెలికం కంపెనీల వాలెట్స్‌ కూడా దాదాపు ఇలాంటివే. ఆ రకంగా చూస్తే ఇలాంటి సంస్థల నుంచి పోటీ కాస్త సాధారణ స్థాయిలోనే ఉన్నా.. పేటీఎంతో చిక్కు తప్పకపోవచ్చన్నది పరిశ్రమవర్గాల అంచనా. డీమోనిటైజేషన్‌ సమయంలో మొబైల్‌ వాలెట్‌ సంస్థలు కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చాయి. కానీ చాలా మటుకు సంస్థలు ఆ తర్వాత క్రమంగా కనుమరుగవుతున్నాయి. 2017 ఆఖరు నాటికి దేశీయంగా 60 పైగా మొబైల్‌ వాలెట్లు ఉండేవి. కానీ నెమ్మదిగా వ్యవస్థలో నగదు చెలామణీ మళ్లీ పెరగడం మొదలయ్యాక.. వీటి సంఖ్య క్రమంగా తగ్గి.. ప్రస్తుతం 50 లోపునకు పడిపోయింది. వాట్సాప్‌ ఇలాంటివాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement