న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్ తాజాగా వంద కోట్ల డాలర్లు(రూ.7,000 కోట్లు) సమీకరించింది. అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ టీ రోవె ప్రైస్‌తో పాటు పేటీఎమ్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబా, డిస్కవరీ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి ఈ నిధులను సమీకరించినట్లు పేటీఎమ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్(ఓసీఎల్) పేర్కొంది.
ఈ తాజా రౌండ్‌లో చైనా ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ నుంచి 40 కోట్ల డాలర్లు వచ్చాయని పేటీఎమ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అలాగే సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు. ఈ తాజా పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే పేటీఎమ్ కంపెనీ విలువ 1,600 కోట్ల డాలర్ల (రూ.1,12,000 కోట్లు)మేర ఉంటుందని వివరించారు. మూడేళ్లలో ఆర్థిక సేవల విస్తరణ కోసం రూ.10,000 కోట్లు (140 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని తెలిపారు.
2021లో లిస్టింగ్ !
భారత్ డిజిటల్ చెల్లింపుల రంగంలో గూగుల్ పే, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే, ఇతర సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో పేటీఎమ్ ఈ స్థాయిలో పెట్టుబడులు సమీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2012లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలని ఈ కంపెనీ యోచిస్తోంది.
రూ.3,960 కోట్ల నష్టాలు....
ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హతావే నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో 30 కోట్ల డాలర్లను పేటీఎమ్ సమీకరించింది. పేటీఎమ్‌కు చెందిన మాతృసంస్థ ఏసీఎల్‌కు 2017–18లో రూ.1,490 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,960 కోట్ల మేర నష్టాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment