హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేంద్రీకృత పోర్టల్ ‘ఈ–ప్రగతి’కి సాంకేతిక సేవలందించే ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఈ–ప్రగతి పోర్టల్ ద్వారా 33 ప్రభుత్వ విభాగాలు, 315 ఏజెన్సీలు, 745 పౌర సేవల్ని ఒకే గొడుగు కిందికి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,398 కోట్లు. ఒకే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో పౌర సేవల్ని అందించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఈ–ప్రగతి సీఈవో ఎన్.బాలసుబ్రమణ్యం చెప్పారు.
కేంద్రీకృత వ్యవస్థ కావడంతో ఏపీలో డిజిటైజేషన్‌కు ఇది ఊతమిస్తుందని, అన్ని విభాగాలపై నియంత్రణ ఉంటుందని తెలియజేశారు. కాగా, భారత్‌లో పెగాసిస్టమ్స్‌కు ఇదే తొలి ప్రాజెక్టు కావడం విశేషం. భారత మార్కెట్‌పై ఇప్పుడు ఫోకస్ చేశామని, ఇటీవలే ముంబైలో సేల్స్ కార్యాలయాన్ని ప్రారంభించామని పెగాసిస్టమ్స్ ఇండియా ఎండీ సుమన్‌రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3,000 పైగా కంపెనీలకు సాఫ్ట్‌వేర్ సర్వీసులందిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు కార్యాలయాల్లో 1,500 మంది పనిచేస్తున్నారు. నియామకాలు నిరంతర ప్రక్రియ అని ఆయన తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment