పెట్రోల్ గుండె గుభేల్
► పెట్రోల్‌పై కేంద్రం ఎడాపెడా బాదుడు
మార్కెట్లో లీటరు పెట్రోల్ ధర ఎంత? అటూఇటుగా రూ.74.5.అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇది రోజూ మారుతుంటుంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని నిజంగా అంతర్జాతీయ చమురు ధరలే ప్రభావితం చేస్తున్నాయా? అక్కడికి అనుగుణంగా ఇక్కడా పెరుగుతూ, తగ్గుతున్నాయా? సమాధానం కావాలంటే ఓ రెండంకెలు చూడాలి.
2014 మే నెలలో..
♦ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అత్యంత గరిష్టంగా బ్యారెల్ 109 డాలర్లకు చేరింది. అప్పుడు దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.81.
2017 సెప్టెంబర్లో...
♦ అంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్ 48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ.74.5
పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ల ప్రకారమే మారుతున్నాయనడం అబద్ధమనేందుకు పై రెండు ఉదాహరణలు చాలవూ...!! అసలు పెట్రోల్, డీజిల్ ధరల వెనక ఎవరి లాభమెంత? ప్రభుత్వ పన్నులెంత? దీనికి ఎవరి లాజిక్కేంటి? మొత్తంగా వినియోగదారుడు నష్టపోతున్నాడా, లేదా?
(సాక్షి, బిజినెస్ విభాగం) : అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు పెరగటమే కాదు!! తగ్గటమూ తెలుసు. కానీ దేశీ ధరలకు మాత్రం పెరగటం మాత్రమే తెలుసు!! ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరల్ని మార్కెట్‌కు అనుసంధానించడం ద్వారా ధర తగ్గితే...ఆ ప్రయోజానాన్ని ప్రజలకు మళ్లిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం.. అలా మిగిలే డబ్బుల్ని తన పన్నుల ఖాతాలో వేసేసుకుంటోంది. ఖజానాకు మళ్లిస్తోంది. పెరిగినప్పుడు మాత్రం ఆ భారం జనంపై వడ్డిస్తోంది. ఫలితమే తాజా పెట్రోల్, డీజిల్ ధరలు. ఇక జూన్ నెల్లో రోజువారీ ధరల్ని సవరించే విధానాన్ని ప్రవేశపెట్టాక ఇప్పటిదాకా పెట్రోల్ ధర ఏకంగా లీటరుకు తెలుగు రాష్ట్రాల్లో 8 రూపాయల వరకూ పెరిగిపోయింది.
ఈ విధానం అమల్లోకి వచ్చాక ధర తగ్గిన రోజులు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ప్రపంచ మార్కెట్లో మాత్రం ముడి చమురు ధర గత ఆరు వారాల నుంచి 46–50 డాలర్ల మధ్య మాత్రమే హెచ్చుతగ్గులకు లోనవుతోంది. కేవలం 2–3 రోజులు మాత్రమే 50 డాలర్ల స్థాయిని దాటి మళ్లీ పడిపోయిన క్రూడ్ ప్రస్తుతం 48 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. కానీ మంగళవారంనాటి ధరల సవరణతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.74.51 వద్దకు, విజయవాడలో రూ.76.35 వద్దకు చేరింది. మూడేళ్ల తర్వాత పెట్రోల్ ధర ఈ స్థాయికి చేరటం ఇదే ప్రథమం.
పన్నుల బాదుడే అసలు కారణం...
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు పెట్రోల్‌పై లీటరుకు ఎక్సయిజు సుంకం రూ.9.40. ఆ తరవాతి సంవత్సరాల్లో పదేపదే ఈ సుంకాన్ని పెంచేశారు. ఇపుడది ఏకంగా రూ.21.48కి చేరింది. డీజిల్‌పై సుంకం సైతం రూ.3.46 నుంచి రూ. 17.33కి చేరుకుంది. 2014 మేలో ప్రపంచ మార్కెట్లో 110 డాలర్లకు చేరిన ముడిచమురు బ్యారెల్ ధర... ఆ తరవాత నుంచి పతనమైంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించి దాన్ని తన ఘనతగా చెప్పుకుంది అప్పటి కొత్త సర్కారు. 2015 మొదట్లోనూ క్రూడ్ పతనం కొనసాగడంతో ఆ ఏడాది మధ్య నుంచి ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా తన జేబులో వేసుకుంది. దీనికి తగ్గట్టుగా ఎక్సయిజు సుంకం పెంపును మొదలెట్టింది. అప్పటి నుంచి... ప్రపంచ ధరలతో సంబంధం లేకుండా ఇక్కడి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే.. తాము పెంచిన సుంకాల్ని వెనక్కితీసుకుంటామంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు సాక్షిగా హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ నెరవేరిన రోజులు ఇప్పటివరకూ లేవు.
అక్కడ సగానికిపైగా తగ్గినా...: 2014 మే నెలలో ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధర బ్యారెల్‌కు 109 డాలర్లు పలకగా... భారతీయ రిఫైనరీలు దిగుమతి చేసుకునే ‘ఇండియన్ క్రూడ్ బాస్కెట్’ ధర రూ. 6,600 వరకూ వుండేది. అప్పట్లో లీటరు పెట్రోల్ రూ.81కి లభ్యమయ్యేది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో లైట్ స్వీట్ క్రూడ్ ధర 48 డాలర్లు. మనం దిగుమతి చేసుకునే ఇండియన్ బాస్కెట్ క్రూడ్ రూ.3,200. అంటే 2014 మేతో పోలిస్తే సగానికిపైగా తగ్గింది. కానీ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర 10 శాతమే తగ్గింది. ఎందుకంటే మిగిలిన మొత్తాన్ని పన్నులు పెంచేసి ప్రభుత్వం లాగేసుకుంది మరి!!.
కేంద్రమే కాదు...రాష్ట్రాలు కూడా...
అంతర్జాతీయంగా తగ్గిన పెట్రో, డీజిల్ ధరలను వినియోగదారులకు అందించకుండా పన్నుల పేరిట జేబులో వేసుకుంటున్నది కేంద్రం మాత్రమే కాదు. రాష్ట్రాలూ తమ చేతివాటం చూపిస్తూనే ఉన్నాయి. దేశంలో ఇంధనాలపై అత్యధిక వ్యాట్ విధిస్తున్న జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశంలో వీటి ధరలు తగ్గుతున్న సమయంలో ఈ రెండు రాష్ట్రాలూ వ్యాట్‌ను పెంచేశాయి. దీంతో పెట్రోల్‌పై వ్యాట్ 26% నుంచి 31%కి పెరిగింది. తెలంగాణలోకంటే ఆం«ధ్రప్రదేశ్ రెండాకులు ఎక్కువే చదివింది. అందుకే అక్కడ వ్యాట్ రెండు రూపాయిలు ఎక్కువ. ప్రస్తుతం పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎక్సయిజు సుంకాలు తగ్గించకపోగా, రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బహిరంగ వేదికల్లో కోరుతుండటం గమనార్హం. ఇక రాష్ట్రాలు సైతం కేంద్రం పన్నులు తగ్గిస్తే పెట్రో ధరలు తగ్గుతాయని అప్పుడప్పుడు చెబుతుంటాయి. అంటే! ఇద్దరూ ఇద్దరేనన్న మాట!!.
కంపెనీలూ తక్కువ తినలేదు..
రోజువారీ ధరల సవరణ విధానం అమల్లోకి వచ్చాక 10 శాతం వరకూ పెట్రో ధర పెరగడానికి ప్రభుత్వ పన్ను పోటుతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు వాస్తవానికి ఈ మధ్య పన్నులు, సుంకాల్ని పెంచనప్పటికీ, అవి శాతం రూపంలో ఉన్నందున ధర పెరిగితే ఆ పన్నులు, సుంకాలు ఆటోమేటిగ్గా పెరిగిపోతుంటాయి. ఇక ప్రభుత్వాలకు తోడు పెట్రో మార్కెటింగ్ కంపెనీలు, రిఫైనరీలు కలిపి లీటరుకు ఒక రూపాయి లాభాన్ని ఎక్కువగా తీసుకుని... కలిసి పంచుకుంటున్నాయి. మెరుగైన ధరల విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా రూపాయి లాభాన్ని అదనంగా ప్రభుత్వ అనుమతితోనే అవి తీసుకుంటున్నాయి. మరోవైపు పెట్రో డీలర్ల కమిషన్ లీటరుకు 50 పైసల చొప్పున పెరిగింది.
ముడి చమురు ధర మూడేళ్లుగా
దిగివచ్చినా, బంకుల్లో మాత్రం మనకు
ధరలు తగ్గకపోవటానికి...
తిలా లాభం–తలా పిడికెడు అన్న మాట.
మార్కెట్లో పెట్రోల్ ధర లీటరు రూ.74. కాకపోతే అంతర్జాతీయ మార్కెట్లో దీనికోసం పెడుతున్న ధర, ఇక్కడ రిఫైనింగ్, రవాణా ఖర్చులు... డీలర్ల కమీషన్, కంపెనీల లాభం... అంతా కలిపితే అయ్యేది రూ.29 మాత్రమే. మిగిలిన 45 రూపాయలేంటో తెలుసా? కేంద్ర రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు. అందుకే అంతర్జాతీయంగా ఎంత తగ్గినా... మన బంకుల్లో మాత్రం ధర అదిరిపోతోంది.