![Petrol diesel sales drop over 60 percent in April due to lockdown - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/18/petrol.jpg.webp?itok=iC5MRaJb)
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా పెట్రోలు వినియోగం భారీగా పడిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు స్థంభించిపోయాయి. దీంతో వంటగ్యాస్ మినహా అన్ని పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ భారీగా క్షీణించింది. ఏప్రిల్‌లో భారతదేశ ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో 50 శాతం పడిపోయింది.
పరిశ్రమ గణాంకాల ప్రకారం ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఇంధన వినియోగానికి సంబంధించిన పెట్రోల్ అమ్మకాలు 64 శాతం తగ్గాయి, డీజిల్ అమ్మకాలు 61 శాతం కీణించాయి. అంతేకాదు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు కావడంతో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) వినియోగం 94 శాతం పడిపోయింది. అయితే వంటగ్యాస్ వినియోగం మాత్రం 21శాతం పుంజుకుంది. ప్రధానంగా ప్రభుత్వం పేదప్రజలకు ఏప్రిల్ 1 నుండి 15 వరకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ప్రకటించిన కారణంగా ఈ వృద్ది నమోదైంది. మొత్తం మీద పెట్రోలియం ఉత్పత్తి అమ్మకాలు 50 శాతం తగ్గాయి. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద క్షీణత అని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు.
కాగా 2019 ఏప్రిల్‌లో భారతదేశంలో 2.4 మిలియన్ టన్నుల పెట్రోల్ విక్రయం నమోదైనాయి. డీజిల్ వినియోగం 7.3 మిలియన్ టన్నులు. 6,45,000 టన్నుల ఏటీఎఫ్ విక్రయాలు నమోదయ్యాయి. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునే క్రమంలో దేశంలో మార్చి 25 నుంచి 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. అనంతరం దీన్ని మే 3వ తేదీ వరకు పొడిగించారు. అయితే ఏప్రిల్ 20వ తేదీనుంచి ఇ-కామర్స్ కంపెనీలపై ఆంక్షలను ఎత్తివేయనుంది. అలాగే పోర్ట్, ఎయిర్ కార్గోలాంటి ఇతర కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment