ఇటీవల పెట్రోల్, డీజిల్ ధర మంట తెలిసిందే. గత వారం క్రితం రికార్డు స్థాయిల్లో ఈ ధరలు పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమేనని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ గత ఆరు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగుస్తున్న, దేశీయంగా మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. విడ్డూరమని అనిపించినా ఇది నిజం. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల సవరణ వద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరగా, ప్రభుత్వ ఆదేశాలను అవి పాటిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 24 నుంచి ఈ ధరల్లో మార్పు లేదు. అప్పటి నుంచి లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.74.63, కోల్‌కత్తాలో రూ.77.32, ముంబైలో రూ.82.48, చెన్నైలో రూ.77.43గా ఉన్నాయి. బెంగళూరులో ఒక్క లీటరు పెట్రోల్ ధర రూ.75.82గా ఉంది. బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మొత్తంగా 224 సెగ్మెంట్లలో మే 12న పోలింగ్ జరుగబోతోంది. ఈ సమయంలో ధరల పెంపు అంత మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోంది.
గత వారం క్రితం వరకు భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపును ప్రధానమైన అంశంగా తీసుకున్న విపక్షాలు, కర్నాటక ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా కూడా మలుచుకున్నాయి. దీంతో గత ఆరు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ప్రభుత్వం చేపట్టడం లేదు. పెట్రోలు ధరల్లో మార్పు ఎందుకు లేదన్న విషయమై అటు ప్రభుత్వ రంగ చమురు సంస్థల నుంచి గానీ, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఇక ఎన్నికలు ముగియగానే, ఒక్కసారే ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తోంది. గత సంవత్సరం జూలై నుంచి పరిశీలిస్తే పెట్రోలు ధర రూ. 11కు పైగా, డీజిల్ ధర రూ. 12కు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచవద్దని చమురు కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లడం సర్వసాధారణమే. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా పెట్రోలు, డీజిల్ ధరలను కొంతకాలం సవరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment