
మహిళలకే ముఖ్యం.. ప్లానింగ్
సామాజికంగా... ఆరోగ్యపరంగా... కుటుంబ బాధ్యతలపరంగా... ఏ రంగానైనా సరే! మహిళలకు ప్రత్యేకమైన రిస్కులుంటాయి. పరిస్థితులతో పాటు మహిళల ఆర్థిక అవసరాలూ మారుతున్నాయి. అయితే, వారు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నప్పటికీ.. ఆర్థిక ప్రణాళికల్లో ఇంకా వెనుకబడే ఉన్నారు.
బ్యాంకు ఖాతాలు చూసుకోవడం, బిల్లులు కట్టుకోవడం కాకుండా మహిళలు తమ ఆర్థిక పరిస్థితుల గురించి, డబ్బు గురించి అర్థం చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా డబ్బు పొదుపు చేయడం, పెట్టుబడులు పెంచుకోవడం, వాటిని కాపాడుకోవడం, వీలైతే తర్వాత తరానికి అందించగలగటం వంటి ప్రయత్నాలు చేయాలి. ఆదాయంతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఖర్చుల గురించి అంచనా వేయాలి. అలాగే రిస్కు సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, దానికి అనుగుణమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకూ తొలిసారి ఉద్యోగంలో చేరినప్పటి నుంచే రిటైర్మెంట్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడులపై చక్రవడ్డీ ప్రయోజనాలు పొందవచ్చు. అర్థం కాని పెట్టుబడి సాధనాలకు దూరంగా ఉండటంతో పాటు అన్ని వేళలా తమ ఆర్థిక పరిస్థితులపై నియంత్రణ ఉండేలా చూసుకోవాలి. పెళ్లయిన తర్వాత కుటుంబ ఆర్థిక బాధ్యతలను పంచుకోవాలి కూడా.
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక వేసుకోవటం...
తొలుత వాస్తవికంగా సాధించగలిగే ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అది ఇల్లైనా, రిటైర్మెంట్‌నిధి, కారు కొనుగోలు వంటి ఏ లక్ష్యమైనా కావచ్చు. ఒక్కో దానికి ఎంత డబ్బు కావాలి? ఎన్నాళ్లలో కావాలి? అన్నది లెక్కలు వేసుకోవాలి. ఎన్నాళ్లలో కావాలన్నదానిపైనే దేన్లో పెట్టుబడి పెట్టాలన్నది ఆధారపడి ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే దానికి కావల్సిన నిధిని ఏర్పాటు చేసుకోవాలి. వీటికి సరైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనం ఎంచుకోవడం ముఖ్యమే. దీనికి అడ్వైజర్ల సలహా తీసుకోవచ్చు.
పెట్టుబడులు పెట్టడం..
ఏ ఆర్థిక ప్రణాళికైనా విజయవంతం కావాలంటే.. పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో ఉండటం కీలకం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే ఇన్వెస్ట్ చేసే విధానం ప్రాచుర్యం పొందుతోంది. అయితే, ఎందులో ఇన్వెస్ట్ చేసినా.. ఆయా సాధనాల్లో ఉండే రాబడులు, రిస్కుల గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాకే చేయాలి.
సమీక్షించుకోవడం..
పెట్టుబడులు మొదలెట్టాక... లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెడుతున్నామా లేదా అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఆదాయ వ్యయాలు పెరిగినా, కొత్తగా ఆస్తులు కొన్నా, అప్పుల భారం పడినా, మార్కెట్ పరిస్థితులు మారిపోయినా... మీ ఇన్వెస్ట్‌మెంట్ విధానాలను తదనుగుణంగా సవరించుకోవాలి. మీరు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువవుతున్న కొద్దీ.. అందుకోసం చేపట్టిన పెట్టుబడులను నగదు కింద మార్చుకోవడం మొదలుపెట్టాలి. బీమా విషయం తీసుకుంటే.. మెచ్యూరిటీ డబ్బు పొందాలంటే ఏయే పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందో ఆరా తీయడం మొదలైనవి చేయాలి. అలాగే, మీ పెట్టుబడుల డబ్బును తిరిగి పొందేటప్పుడు పన్నులేవైనా కట్టాల్సి ఉంటుందేమో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌తో మాట్లాడాలి.
సరైన దుస్తులు, గృహోపకరణాలు, హాలిడే ప్యాకేజెస్ గురించి తెలుసుకునేందుకు గంటల తరబడి ఎలాగైతే కూర్చుంటామో.. జీవితంలో వివిధ దశల్లో పాటించాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలను గురించి కూడా అంతే శ్రద్ధ చూపాలి. ఆర్థికపరమైన అంశాల్లో అవగాహన పెంచుకునేందుకు పర్సనల్ ఫైనాన్స్ ఆర్టికల్స్ లాంటివి చదవడం అలవాటు చేసుకోవాలి. ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆయా సాధనాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఏదైతేనేం..మీ ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలో మీరే నిర్దేశించుకోవాలి. జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా ఎదుర్కొనేందుకు కావాల్సిన ఆత్మ విశ్వాసాన్ని ఇది అందిస్తుంది.