సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం : పెళ్లి ఎలా చెయ్యాలి? తల్లిదండ్రులందరికీ... ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకిది పెద్ద సవాలే. నిజానికి పెళ్లి ఎలా అయినా చెయ్యొచ్చు. దానికి ఎంతయినా ఖర్చు పెట్టొచ్చు. తక్కువలో తక్కువగా వేలల్లో ముగించేయొచ్చు. అట్టహాసంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనూ వచ్చు. ఇవన్నీ పక్కనబెడితే... మధ్య తరగతి కుటుంబాల్లో... పెళ్లనేది చాలావరకూ వరుడి కుటుంబీకుల ఇష్టప్రకారం చేయాల్సి ఉంటుంది.
సదరు సంబంధం కావాలనుకుంటే దానికి తగ్గట్టు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కూడా. నిజానికి పెళ్లికి ముందు నుంచే సన్నద్ధం అయ్యేవారు మనలో చాలా తక్కువ. మునుపటికన్నా ఇపుడు వివాహానికి ప్రాధాన్యం పెరిగింది. దాంతోనే ఖర్చులూ పెరిగాయి. అందుకని ముందు నుంచే ప్రణాళిక వేసుకుని... ఆ మేరకు పిల్లల వివాహ అవసరాల కోసం కొంత నిధిని సమకూర్చుకోవడం తప్పనిసరి.
ఉదాహరణకు రాజమండ్రికి చెందిన సుకుమార్‌నే తీసుకుంటే... తనకు 17 ఏళ్ల ఇంటర్ చదివే కుమార్తె ఉంది. ఉన్నత విద్య పూర్తయ్యాక ఆమెకు పెళ్లి చేయాలన్నది సుకుమార్ ఆలోచన. ఆమె పెళ్లికి సుమారు 8–10 ఏళ్ల వ్యవధి ఉంది. అలాగే, తన రిటైర్మెంట్ జీవితం కోసం కూడా కొంత నిధిని సమకూర్చుకోవాలని భావించాడు. ఇందుకు మరో పదేళ్ల వ్యవధి ఉంది. దీనికి ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నది నిపుణుల సూచనల ఆధారంగా ఒకసారి చూద్దాం...
వివాహం కోసం ఏం చేయొచ్చంటే...
హరిత వివాహ అవసరాల కోసం రూ.25 లక్షలను సమకూర్చుకోవాలన్నది సుకుమార్ లక్ష్యం. అది కూడా ఇప్పటి ఖర్చుల ఆధారంగా అతడు వేసుకున్న అంచనా. 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా చూస్తే మరో ఎనిమిదేళ్ల తర్వాత హరిత వివాహ సమయానికి రూ.46 లక్షలు అవసరం అవుతాయి. సుకుమార్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ప్రతీ నెలా కనీసం రూ.25,000 పింఛను రూపంలో వస్తుందని అతడి అంచనా. అయినా సరే... రిటైర్మెంట్ తర్వాత అనూహ్యంగా వచ్చే అవసరాల కోసం అతను రూ.1.5 కోట్లు సమకూర్చుకోవాలనుకుంటున్నాడు.
ప్రణాళిక ఇలా ఉండాలి
సుకుమార్ ప్రతి నెలా తీసుకునే వేతనం రూ.60,000. అదృష్టవశాత్తూ సుకుమార్ అర్ధాంగి జ్యోతి కూడా ఉద్యోగే. ఆమె నెలసరి వేతనం రూ.40,000. వీరి నెలసరి కుటుంబ ఖర్చు రూ.50,000. దీంతో ప్రతి నెలా వారి మిగులు నిధులు రూ.50,000. ఇందులో రూ.45,000ను బ్యాంక్ రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తుండగా, మిగిలిన రూ.5,000ను ఈక్విటీ బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి కుమార్తె హరిత ఇంటర్ చదువుతోంది.
తరవాత ఇంజనీరింగ్ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇక సుకుమార్‌కు రూ.కోటి మేర టర్మ్ బీమా పాలసీ ఉంది. దీన్ని ఆయన పనిచేస్తున్న సంస్థే సమకూర్చింది. వైద్య బీమా పాలసీ కూడా సంస్థ అందిస్తున్నదే ఉంది. మరో పదేళ్లలో సుకుమార్ రిటైర్ అవుతారు. కనుక తర్వాత అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విడిగా ఓ వైద్య బీమా పాలసీ ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఆ వయసులో వైద్య బీమా పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది.
పెట్టుబడులు, మార్పులు...
సుకుమార్‌కు ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ ఖాతాలో రూ.25 లక్షలున్నాయి. బ్యాంకు ఎఫ్‌డీల రూపంలో రూ.40 లక్షలున్నాయి. సొంత ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. దీని విలువ రూ.1.15 కోట్లు. సుకుమార్ పెట్టుబడుల్లో సింహభాగం రికరింగ్ డిపాజిట్లకే వెళుతోంది. అతని కుమార్తె వివాహానికి ఇంకా కనీసం ఎనిమిదేళ్ల వ్యవధి ఉంది. కనుక పెట్టుబడుల్లో కొంత మేర అధిక రాబడులకు కేటాయించుకోవచ్చు. రూ.50,000 పెట్టుబడుల్లో కనీసం రూ.30,000ను ఈక్విటీ బ్యాలన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్, లార్జ్‌క్యాప్ ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవాలి. మిగిలిన రూ.20,000ను ఆర్డీకి మళ్లించొచ్చు.
బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉన్న వాటినే ఎంచుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్ ఫండ్, ఎల్‌అండ్‌టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలన్స్‌డ్ ఫండ్ పథకాలు బ్యాలన్స్‌డ్ ఫండ్స్‌కు పనితీరు పరంగా మంచి చరిత్ర ఉంది. లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, మిరే అస్సెట్ ఇండియా ఈక్విటీ, ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఫండ్ పథకాలను పరిశీలించొచ్చు.
ఈ విధంగా పెట్టుబడులు పెడితే వార్షికంగా 12 శాతం రాబడి అంచనాల మేరకు 2026 నాటికి రూ.48.5 లక్షలు సమకూరుతుంది. దీంతో సుకుమార్ కుమార్తె హరిత వివాహ అవసరాలకు సరిపడా నిధి చేతికి అందుతుంది. ఇక రికరింగ్ డిపాజిట్‌లో ప్రతీ నెలా చేసే రూ.20,000 పెట్టుబడి సైతం 2028 నాటికి రూ.34 లక్షలు అవుతుంది. వార్షికంగా 7 శాతం రాబడుల ఆధారంగా వేసిన అంచనా ఇది.
ఇక బ్యాంకు ఎఫ్‌డీల్లో ఉన్న రూ.40 లక్షలను కదపకుండా అలానే కొనసాగిస్తే 7 శాతం రాబడి ఆధారంగా 2028 నాటికి (సుకుమార్ రిటైర్మెంట్ అయ్యే సంవత్సరం) రూ.78.7 లక్షలు అవుతాయి. అలాగే, ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్ ఖాతాల్లో ఉన్న రూ.25 లక్షలను కూడా లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీంతో పదేళ్ల కాలంలో వార్షికంగా 12 శాతం రాబడుల అంచనా ఆధారంగా రూ.77.6 లక్షలు అవుతాయి. దీంతో ఈ మొత్తం కలిపి సుకుమార్ రిటైర్మెంట్ నాటికి రూ.1.9 కోట్లు అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment