హైదరాబాద్ ప్లాస్టిక్ పార్కుకు గుజరాత్ కంపెనీలు!
ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి
* 500 కోట్ల పెట్టుబడులకు చాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ సమీపంలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగిరం చేసింది. ఇందుకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న ప్లాస్ట్ ఇండియా ప్రదర్శన, అంతర్జాతీయ సదస్సును వేదికగా చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) వైస్ చైర్మన్ జయేష్ రంజన్‌లు పలువురు పారిశ్రామికవేత్తలతో గాంధీనగర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా వారికి వివరించారు. ప్లాస్టిక్ పార్కులో పెట్టుబడి పెట్టేందుకు గుజరాత్‌కు చెందిన నాలుగైదు కంపెనీలు ఆసక్తి కనబర్చాయని, ఇవి ఎంతకాదన్నా రూ.500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశముందని రాష్ట్రానికి చెందిన పరిశ్రమ ప్రతినిధులు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వారు గాంధీనగర్ నుంచి టెలిఫోన్‌లో ప్రదర్శన విశేషాలను వివరించారు.
రిలయన్స్ ప్రతినిధులతో..
తెలంగాణ అధికారులు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.కె.రేతో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్లాస్టిక్ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తోడ్పాటు అందించాల్సిందిగా ఆయనను కోరారు. ప్లాస్టిక్ తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఉత్పత్తిలో అగ్రశ్రేణి కంపెనీల్లో రిలయన్స్ ఒకటి. అలాగే ప్లాస్టిక్ ఉత్పత్తులను రూపొందించేందుకు కావాల్సిన మెషినరీ తయారీ కంపెనీల సంఘం ప్రతినిధులతోనూ ప్రదీప్ చంద్ర, జయేష్ రంజన్‌ల బృందం సమావేశమైంది.
మెషినరీ తయారీ ప్లాంట్లను తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దక్షిణాది రాష్ట్రాల కు మెషినరీని సరఫరా చేసేందుకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటే వ్యాపారానికి అనువుగా ఉంటుందని వారికి వివరించారు. సంఘం ప్రతినిధులు ఇందుకు సానుకూలంగా స్పందిం చారు. ఈ నెలలోనే రిలయన్స్ అధికారులతోపాటు సంఘం ప్రతినిధులు, ఔత్సాహిక కంపెనీల యజమానులు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావుతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది.
దశలవారీగా రూ.1,000 కోట్లు..
హైదరాబాద్ సమీపంలోని మాకాల్ వద్ద 179 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు కానుంది. 100-150 కంపెనీలకు పార్కులో స్థలం ఇచ్చే అవకాశం ఉంది. మరిన్ని కంపెనీలు ముందుకు వస్తే స్థల కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. దశలవారీగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు రావొచ్చని నయాస్ట్రాప్ ఎండీ, ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ తయారీదారుల సంఘం మాజీ ప్రెసిడెంట్ వెన్నం అనిల్‌రెడ్డి తెలిపారు.