రాష్ట్రంలో ప్లాస్టిక్ కంపెనీల సమూహాన్ని(ప్లాస్టిక్స్ పార్కు) ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో ప్లాస్టిక్ కంపెనీల సమూహాన్ని(ప్లాస్టిక్స్ పార్కు) ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారు. పార్కులో ప్లాంట్లను నెలకొల్పేందుకు 2 వేల కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు వి.అనిల్‌రెడ్డి తెలిపారు. ఏడేళ్లుగా తాము శ్రమిస్తున్నా, పార్కు ఏర్పాటు కార్యరూపం దాల్చడం లేదన్నారు. హైదరాబాద్ సమీపంలో పార్కు ఉంటే సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. కనీసం 500 ఎకరాలు కావాలని, ఎకరాకు రూ.5-10 లక్షలు చెల్లించేందుకు సిద్ధమని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్లాస్టిక్ తయారీలో సుమారు 7 వేల కంపెనీలున్నాయి.
ఇందులో 5 వేల కంపెనీలు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నాయని వివరించారు. డిసెంబరు 12-16 తేదీల్లో ముంబైలో జరగనున్న 9వ ప్లాస్టివిజన్ ఇండియా ప్రదర్శన, సదస్సు వివరాలను బుధవారమిక్కడ ఆయన మీడియాకు వెల్లడించారు. విలువ రూ.50,000 కోట్లు: దేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ పరిమాణం 10 మిలియన్ టన్నులు. విలువపరంగా రూ.50 వేల కోట్లుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.6 వేల కోట్లు. పరిశ్రమ ఏటా 15 శాతం వృద్ధి కనబరుస్తోందని ప్లాస్టివిజన్ ఇండియా చైర్మన్ రాజు డి. దేశాయ్ తెలిపారు. రూపాయి పతనం కారణంగా ఈ రంగంలో సుమారు 5 లక్షల మందికిపైగా ఉపాధి కోల్పోయారని అరవింద్ మెహతా గ్రూపు సీఎండీ అరవింద్ మెహతా పేర్కొన్నారు.