
పీఎన్‌బీ - నీరవ్ మోదీ స్కాం (ఫైల్ ఫోటో)
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు-నీరవ్ మోదీ కుంభకోణం కేసులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ఆదేశాలు జారీచేశారు. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు నరేంద్రమోదీ ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ కేసును పరిష్కరించడం కోసం ప్రధానమంత్రి కార్యాలయంతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా చెప్పారు. ఈ మోసంలో ప్రధాన సూత్రదారుడైన నీరవ్ మోదీని కచ్చితంగా శిక్షించనున్నామని, ఆయనను భారత్ తిరిగి రప్పించడంపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుందని పేర్కొన్నారు.
''ప్రధానమంత్రి ఆఫీసుతో ఆర్థికమంత్రిత్వ శాఖ చర్చిస్తుంది. పీఎంఓ ఏం నిర్ణయిస్తే, అదే ఆర్థిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది'' అని శుక్లా తెలిపారు. రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన్ను తిరిగి వెనక్కి రప్పించడానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అంతేకాక ఆయనకు చెందిన పలు ఆస్తులను, షోరూంలను, వజ్రాలను, బంగారాన్ని కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. నేడు కుంభకోణం జరిగిన పీఎన్‌బీ ముంబై బ్రాంచును సైతం సీబీఐ సీజ్ చేసింది. నీరవ్ మోదీ ఫైర్‌స్టార్ డైమాండ్ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ విపుల్ అంబానీని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు, నాలుగేళ్ల నుంచి విపుల్ అంబానీ ఈ స్థానంలో ఉన్నట్టు తెలిసింది. కుంభకోణంలో భాగమైన బ్యాంకు అధికారులు గోకుల్‌నాథ్ శెట్టి, మనోజ్ ఖాతర్, నీరవ్ మోదీ కంపెనీ సిగ్నేటర్‌ను కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గీతాంజలి గ్రూప్‌కు చెందిన 18 భారత్ ఆధారిత సబ్సిడరీల ఆర్థిక లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment