సంస్కరణల జోరు పెంచుతాం
* సింగపూర్ పర్యటనలో విదేశీ ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ హామీ
* వచ్చే ఏడాది జీఎస్‌టీ అమలుపై ఆశాభావం
సింగపూర్: విదేశీ పెట్టుబడులకు భారత్‌ను మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మలిచేందుకు సంస్కరణల జోరు పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింగపూర్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారమిక్కడ ఇండియా-సింగపూర్ ఆర్థిక సదస్సులో విదేశీ ఇన్వెస్టర్లకు ఈ మేరకు భరోసానిచ్చారు. వారికి అన్నివిధాలా చేయూతనందిస్తామని చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వ్యవస్థ అమలవుతుందన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. భారత్‌లో రెండు ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేసేందుకు సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా తమ ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్‌సిటీల నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిందిగా అక్కడి కంపెనీలకు ఆహ్వానం పలికారు.
తమ సర్కారు కొలువుదీరిన తర్వాత గడిచిన 18 నెలల్లో సాధించిన పురోగతిని మోదీ ఇన్వెస్టర్లకు వివరించారు. ‘తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను మేం తిరిగి పట్టాలెక్కించగలిగాం. భారీస్థాయిలో సంస్కరణలను అమలు చేస్తున్నాం. వీటి ఫలితాలు త్వరలోనే అందరూ గుర్తిస్తారు. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత పటిష్టం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు సంబంధించి పరిమితులను సడలించే ప్రక్రియను మొదలుపెట్టాం. తాజాగా ప్రకటించిన సంస్కరణలతో ఎఫ్‌డీఐలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత సరళతరమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలబెట్టాం’ అని మోదీ తెలిపారు. వ్యాపారాలకు అత్యంత సానుకూల, పోటీతత్వ దేశాల జాబితాలో భారత్ ర్యాంకింగ్ చాలా మెరుగుపడిందని.. దేశంలోకి ఎఫ్‌డీఐలు 40 శాతం పుంజుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇంకా నియంత్రణపరమైన, పన్ను ఆందోళనలకు సంబంధించి 14 నిర్ణయాత్మక చర్యలను తాము తీసుకున్నామన్నారు. స్మార్ట్‌సిటీలు, రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం, చౌక గృహాలు ఇలా అనేక రంగాల్లో భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లకు మోదీ వివరించారు.
సింగపూర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం...
ఈ పర్యటనలో సింగపూర్ ప్రభుత్వాధినేతలతో చర్చలు చాలా ఫలప్రదంగా జరిగాయని.. భారత్‌తో బంధాన్ని మరింత ఉన్నత స్థాయిలకు చేర్చేవిధంగా ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఖరారు చేసుకున్నట్లు మోదీ తెలిపారు.
ప్రపంచంలోనే సింగపూర్ తమకు పదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలుస్తోందని.. ఆసియాన్ దేశాల కూటమిలో రెండో స్థానంలో ఉందన్నారు. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా సింగపూర్ రెండో స్థానంలో ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అనేక భారతీయ కంపెనీలు సైతం ఇటీవల కాలంలో ఇక్కడ భారీగానే పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యాన్ని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జవహర్‌లాల్ నెహ్రూ పోర్టులో కంటెయినర్ టెర్మినల్ నిర్మాణంలోనూ సింగపూర్ పాలుపంచుకుంటోందని మోదీ చెప్పారు.
నవరత్న పీఎస్‌యూల్లో పెట్టుబడి పెట్టండి...
సింగపూర్ కంపెనీలకు ఆహ్వానం
నవరత్న హోదా ఉన్న ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా(డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా) ప్రధాని మోదీ సింగపూర్ కంపెనీలను ఆహ్వానించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తాము అభివృద్ధి చేస్తున్న 100 స్మార్ట్ సిటీల్లో కనీసం 20 స్మార్ట్‌సిటీల నిర్మాణానికి సహకారం అందించాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు.
సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, ప్రెసిడెంట్ టోనీ టాన్ కెంగ్‌లతో పాటు అక్కడి ప్రధాన నేతలతో మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌లో అనేక సింగపూర్‌లను సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. అంతేకాకుండా సింగపూర్‌లో రూపీ, ఇన్‌ఫ్రా బాండ్‌ల జారీలో పాలుపంచుకోవాల్సిందిగా కూడా పిలుపునిచ్చారు. ఆసియాలో సరికొత్త ఆర్థిక కూటమిని నెలకొల్పేందుకు ఉద్దేశించిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్‌సీఈపీ) ఒప్పందం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కూడా ప్రధాని పేర్కొన్నారు.
ప్రధానంగా 14-15 కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించినట్లు సమావేశం అనంతరం విదేశీ వ్యవహారాల కార్యదర్శి(తూర్పు దేశాలు) అనిల్ వాధ్వా విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇందులో నైపుణ్యాల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, టూరిజం, పౌర విమానయానం, ఫైనాన్షియల్ సేవలు తదితర రంగాలు ఉన్నాయని తెలిపారు.