ఆ స్కాంకు వారందరూ బలయ్యారు! | PNB fraud: Not only PSBs hit, 18 businessmen, 24 firms go bankrupt | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాం : వారందరూ బలయ్యారు!

Published Mon, Feb 19 2018 3:19 PM | Last Updated on Mon, Feb 19 2018 3:40 PM

PNB fraud: Not only PSBs hit, 18 businessmen, 24 firms go bankrupt - Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం (ఫైల్‌ ఫోటో)

లక్నో : నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సికి చెందిన డైమాండ్‌ సంస్థల వల్ల నష్టపోయింది కేవలం బ్యాంకుల మాత్రమేనా అంటే ? కాదని తెలిసింది. వీరు చేసిన మోసానికి కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే కాక, 24 కంపెనీలు, 18 మంది వ్యాపారవేత్తలు బలైనట్టు వెల్లడైంది. వీరందరూ 2013 నుంచి 2017 మధ్యకాలంలో నీరవ్‌ మోదీ, చౌక్సి జువెల్లరీ బ్రాండులకు ఫ్రాంచైజీలు నిర్వహించారు. ఈ ఇద్దరు చేసిన మోసానికి తామందరం బలైనట్టు ఆర్థిక దివాలా కింద క్రిమినల్‌ ఫిర్యాదులు దాఖలు చేశారు. వీరందరూ ఢిల్లీ, ఆగ్రా, మీరుట్‌, బెంగళూరు, మైసూర్‌, కర్నల్‌, రాజస్తాన్‌, గుజరాత్‌ వంటి ప్రాంతాల్లో  చౌక్సికి చెందిన గీతాంజలి జువెల్లరీ, గిలీ పేరుతో ఫ్రాంచైజీ షోరూంలు ఏర్పాటుచేశారు. ఫ్రాంచైజీల నుంచి రూ.3 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్యలో సెక్యురిటీ డిపాజిట్లు తీసుకుని డైమాండ్‌ స్టాక్స్‌ను, విలువైన జెమ్స్‌ను చౌక్సి సంస్థలు వీరికి పంపేవి. 

వీటిలో చౌక్సి సంస్థలు క్రిమినల్‌ కుట్ర, మోసం, ఒప్పందాల ఉల్లంఘన వంటి వాటికి పాల్పడినట్టు వ్యాపారవేత్తలు, కంపెనీలు ఆరోపిస్తున్నాయి. నీరవ్‌ మోదీ, చౌక్సి సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేశాయి. కాగ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు దాదాపు రూ.11,400 కోట్లు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సి కన్నం వేసిన సంగతి తెలిసిందే. ఇన్ని కోట్ల మోసం చేసిన వీరు, పీఎన్‌బీ ఈ స్కాం బయటపెట్టే లోపలే దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం వీరి డైమాండ్‌ సంస్థలను, జువెల్లరీ షోరూంలను, ప్రాపర్టీలను, ఆస్తులను సీబీఐ, ఈడీ సీజ్‌చేస్తోంది. అంతేకాక వీరిని పట్టుకోవడానికి తీవ్ర ఎత్తున ప్రయత్నిస్తోంది. తొలిసారి ఈ స్కాంను ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌ కురానియా బయటపెట్టారు. 2013లో చౌక్సి సంస్థల్లో ఈ మోసాన్ని ఆయన గుర్తించారు. రాజోరి గార్డెన్‌లో వైభవ్‌ ఓ రిటైల్‌స్టోర్‌ను ఏర్పాటుచేశారు. చౌక్సి సంస్థ గీతాంజలి పేమెంట్‌ తీసుకున్నప్పటికీ రూ.3 కోట్ల స్టాక్స్‌ను అతనికి పంపించకపోయే సరికి వైభవ్‌ తన రిటైల్‌ స్టోర్‌ను క్లోజ్‌ చేశారు. మార్కెట్‌ ధర తక్కువగా ఉన్నప్పటికీ, ఈ షోరూంలో ధర దానికి 3 నుంచి 4 సార్లు ఎక్కువగా ఉంటుందని తాజా ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement