పీవోఎస్ మెషీన్ల దిగుమతికి నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించే దిశగా వ్యాపార సంస్థలు మరిన్ని పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను సమకూర్చునేందుకు ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దిగుమతి చేసుకునే పీవోఎస్ మెషీన్లకు మార్చి 31 దాకా భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) లేబులింగ్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతిపాదనకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆమోదముద్ర వేసింది. నిర్దిష్ట మోడల్ పీవోఎస్ దిగుమతికి సంబంధించి బీఐఎస్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ నంబరును ఎక్సైజ్, కస్టమ్స్ విభాగానికి సదరు వర్తకులు చూపించిన పక్షంలో క్లియరెన్స్ లభిస్తుంది.
దేశీయంగా నగదు రహిత, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పీవోఎస్ మెషీన్లను దిగుమతి చేసుకుంటున్నందున ప్రత్యేక మినహాయింపు కల్పించాలంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖను కేంద్ర ఆర్థిక శాఖ కోరిన నేపథ్యంలో తాజా సడలింపు ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా దిగుమతి చేసుకున్న పీవోఎస్ మెషీన్లకు బీఐఎస్ సర్టిఫికేషన్, లోగో తప్పనిసరి. ఇవి ఉంటేనే దేశీయంగా వాటి విక్రయాలకు కస్టమ్స్ విభాగం అనుమతినిస్తుంది. ఎస్‌బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో 15.1 లక్షల పీవోఎస్ మెషీన్లు ఉన్నాయి. అయితే, డిజిటైజేషన్ పెరిగే పక్షంలో అదనంగా 20 లక్షల పైచిలుకు అవసరం కావొచ్చని అంచనా.