న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థలో మరో భారతీయుడు కీలక పదవిని అలంకరించారు. భారతీయ అమెరికన్ అయిన ప్రభాకర్ రాఘవన్ గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్టుల హెడ్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న బెన్‌గోమ్ నూతన బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. ప్రభాకర్ ఐఐటీ మద్రాస్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేయగా, యూసీ బెర్క్‌లే నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ అందుకున్నారు.
ప్రభాకర్ రాఘవన్ గూగుల్‌లో 2012లో చేరగా, 2018లో గూగుల్ అడ్వర్టయిజింగ్ అండ్ కామర్స్ విభాగ హెడ్‌గా ఎంపికయ్యారు. అంతకుముందు గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్‌కు వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వృద్ధిలో ప్రభాకర్ పాత్ర కూడా ఉంది. ‘మన ఉత్పత్తుల విభాగాల్లో చాలా వాటిల్లో ఆయన పనిచేయడం వల్ల వాటి మధ్య అంతరాలను కచ్చితంగా గుర్తించగలరు. గూగుల్‌తో ఆయన అనుబంధం గూగుల్‌ను ముందుంచుతుంది’ అంటూ ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో గూగుల్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment