‘పైసా పెట్టుబడి లేదు రూ.కోటి సంపాదన’ | Praneeth Group md narendra kumar kamaraju chit chat with sakshi reality | Sakshi
Sakshi News home page

‘పైసా పెట్టుబడి లేదు రూ.కోటి సంపాదన’

Published Sat, Dec 24 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

‘పైసా పెట్టుబడి లేదు రూ.కోటి సంపాదన’

‘పైసా పెట్టుబడి లేదు రూ.కోటి సంపాదన’

‘సాక్షి రియల్టీ’తో ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్ర కుమార్‌ కామరాజు
అందుబాటు ఇళ్లకు ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు
ఇప్పటికే 150 ఎకరాల్లో 16 ప్రాజెక్ట్‌లు పూర్తి
మరో వంద ఎకరాల్లో 4 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో..


సాక్షి, హైదరాబాద్‌:
సొంతింటి కోసం చెప్పులరిగేలా తిరిగిన శ్రమ.. ఏకంగా స్థిరాస్తి సంస్థనే పెట్టేలా చేసింది.
పైసా పెట్టుబడి లేకుండా ప్రారంభించిన తొలి ప్రాజెక్ట్‌ 20 రోజుల్లోనే హాట్‌కేక్‌లా పూర్తయి.. నెల రోజుల్లోనే కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకుంది.
2007 జులైలో ప్రారంభమైన ప్రణీత్‌ గ్రూప్‌.. ఇప్పటివరకు 16 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసుకొని 2 వేలకు పైగా హ్యాపీ కుటుంబాలకు నిలయమైందని చెప్పుకొచ్చారు సంస్థ ఎండీ నరేంద్ర కుమార్‌ కామరాజు. అందుబాటు ధరల్లో నాణ్యమైన, నమ్మకమైన ఇళ్లు కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు తగ్గవని ‘సాక్షి రియల్టీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో చెప్పారాయన.
మాది కడప జిల్లాలోని చాపాడు గ్రామం. ఆరు గురి సంతానంలో చిన్నవాణ్ని. ఏడు వరకు సొంతూళ్లోనే చదివా. ఆపైన చదువు కోసం పెద్దన్న ప్రోద్బలం, ప్రోత్సాహంతో 1983లో హైదరాబాద్‌కొచ్చా. ఆర్ధికంగా కుటుంబం బలహీనం కావటంతో చిన్నప్పుటి నుంచే కష్టాలు తప్పలేదు. బడిచౌడిలోని నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశా. ఇంజనీరింగ్‌ చేయాలనేది నా కోరిక. కానీ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిప్లొమాలో చేరాల్సి వచ్చింది. పంజగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం దొరికింది. జీతం రూ.500. ఇదే నా తొలి సంపాదన. ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్‌ చేస్తున్న స్నేహితుల రూముల్లో ఉండేవాణ్ని. కోచింగ్‌ తీసుకుంటున్న ఫ్రెండ్స్‌కు ట్యూషన్స్‌ చెబుతూ నేనూ ఇంజనీరింగ్‌ రాశా. ఎవరికీ మంచి ర్యాంక్‌ రాలేదు. నాకు మాత్రం 119 ర్యాంక్‌ వచ్చింది.

అయితే నాకొచ్చిన ర్యాంక్‌కు మంచి కాలేజీలోనే సీటొచ్చేది కానీ, నాన్‌ లోకల్‌ కావటంతో అనంతపురంలోని జేఎన్‌టీయూలో జాయిన్‌ కావాల్సి వచ్చింది. ఓవైపు ఇష్టం లేదు కానీ, ప్రకాశ్, మురళి ఇద్దరు ఫ్రెండ్స్‌ రెండో ఏడాది హైదరాబాద్‌ జేఎన్‌టీయూకు మార్చుకోవచ్చని సలహా ఇవ్వటంతో నేనూ సరేనని అనంతపురం వెళ్లా. అయితే తొలి ఏడాది టాప్‌ 5లో ఉన్న విద్యార్థులకు మాత్రమే వేరే చోటుకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశముంటుందనడంతో ఫస్ట్‌ ఇయర్‌ బాగా చదవా. రెండో ఏడాది మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టా. 78.5 ఉత్తీర్ణత శాతంతో ఇంజనీరింగ్‌ పూర్తి చేశా.

ఐటీలో పదేళ్లు: ప్రభుత్వ ఉద్యోగమైతే బిందాస్‌గా ఉండొచ్చనే ఉద్దేశంతో బాగా కష్టపడి చదివి ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరంలో ఉండగానే 1994లో దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్‌ ఇంజనీరింగ్‌ జాబ్‌ కొట్టేశా. వేతనం రూ.5 వేలే అయినా.. పైపైన మాత్రం బాగానే వచ్చేది. కానీ, ఏదో Ðð లితి. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్‌కు దూరంగా ఏంటిదా అని? అప్పటికే కొంత మంది ఫ్రెండ్స్‌ ఐటీ ఉద్యోగం పేరిట విదేశాల్లో ఉంటే.. నాకూ అమెరికా వెళ్లాలనిపించింది. ఇంకేముంది సీ ++ కోర్సు కోసం బెంగళూరుకెళ్లా. 2 నెలల్లో ఐటీ జాబ్‌ వచ్చేసింది. టాటాతో మొదలైన నా ఐటీ ఉద్యోగం టీసీఎస్, ఒరాకిల్, ఇన్ఫోసిస్‌ కంపెనీల్లో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేశా. భారీ వేతనం, విదేశీ ఆఫర్స్‌ ఉన్నా సరే ఐటీలో వెలితనిపించేది. నా జీవితం భాగ్యనగరంతోనే ముడిపడి ఉందనిపించింది. అందుకే జాబ్‌కు టాటా చెప్పేశా.

3 నెలల్లో 6 వేల కి.మీ...
చదువుకునే రోజుల్లో ఉన్న హైదరాబాద్‌కు ఇప్పుడున్న హైదరాబాద్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో అద్దె లేకుండా కేవలం కరెంట్, నీళ్ల బిల్లు కట్టి ఉండేవాన్ని. కానీ, ఇప్పుడేమో అద్దె కాదు కదా అసలు బతగ్గలనా అనిపించింత అభివృద్ధి చెందింది. అప్పటికే పెళ్లి కావటంతో అద్దెకుండటం కంటే సొంతిల్లు కొనుక్కోవటమే ఉత్తమమనిపించింది. ఇంకేముంది రోజూ పేపర్లలో యాడ్స్‌ చూసి భార్యతో కలిసి వెళ్లేవాణ్ని. ఎంతలా తిరిగానంటే బైక్‌ మీద 3 నెలల్లో 6 వేల కి.మీ. తిరిగేశాం. చివరికి నిజాంపేటలో ఇళ్లు ఫైనలైంది. రూ.10 లక్షలు రుణం, మిగిలిన దాంట్లో కొంత మా మామగారు సర్ది.. మొత్తం మీద గృహ ప్రవేశం పూర్తి చేశాం. అయితే ఇదే నా జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌. ఎందుకంటే.. ఇంటికోసం నేను పడిన శ్రమ, పరిశోధన ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చర్చించేవాణ్ని. ఎక్కడ స్థలాలు కొంటే లాభమొస్తుందో చెప్పేవాణ్ని. చాలామంది కొని లబ్ది పొందారు కూడా. దీంతో నాకు తెలియకుండానే 200–300 మంది ఫాలోవర్స్‌ తయారయ్యారు. ఇదే నా పెట్టుబడిగా మారింది. అదే 2007 జూలైలో ప్రణీత్‌ గ్రూప్‌కు బీజం వేసింది.

నెల రోజుల్లో కోటి సంపాదన..
తొలి ప్రాజెక్ట్‌ ప్రారంభం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. నిజాంపేటలో నేను కొన్న ఇళ్లు లీగల్‌ సమస్యల్లో ఉంటే ఆంజనేయులు గారు తీర్చారు. ఆయన స్థలంలోనే అంటే మల్లంపేటలో 3 ఎకరాల్లో 40 డూప్లెక్స్‌ హోమ్స్‌కు శ్రీకారం చుట్టా. ల్యాండ్‌ ఓనర్‌కు, నాకు సగం సగం. ఆశ్చర్యకరమైన విషయమేమీటంటే.. నా 20 ఇళ్లు కేవలం 2 వారాల్లో విక్రయించేశా. అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి దగ్గర రూ.5 లక్షలు తీసుకున్నా అలా నెల రోజుల్లో కోటి రూపాయలు సంపాదించా. అలా తొలి ఏడాది రూ.3 కోట్లకు చేరిన ప్రణీత్‌ గ్రూప్‌ టర్నోవర్‌ ప్రస్తుతం రూ.160 కోట్లకు చేరింది.

విల్లా, గేటెడ్‌ కమ్యూనిటీ అంటే కోట్ల రూపాయలు కావాలనుకుంటారు. కానీ, సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో అది కూడా నాణ్యమైన, నమ్మకమైన ఇళ్లను కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ అమ్మకాలు జోరుగా ఉంటాయనడానికి ప్రణీత్‌ గ్రూపే నిదర్శనం. ఇప్పటివరకు 150 ఎకరాల్లో వివిధ ప్రాంతాల్లో 16 ప్రాజెక్ట్‌లు పూర్తి చేశాం. 2 వేలకు పైగా కుటుంబాలకు ఇంటి తాళాలందించాం. ప్రస్తుతం 100 ఎకరాల్లో 4 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో సుమారు 1,500 కుటుంబాలు రానున్నాయి. మరో 20 ఎకరాల స్థలాలను సమీకరించాం.

సీఎస్‌ఆర్‌లోనూ ఉత్సాహంగానే..
ప్రస్తుతం ప్రణీత్‌ గ్రూప్‌లో 250 మంది ఉద్యోగులున్నారు. ప్రతి ఉద్యోగిని గౌరవిస్తాం. కంపెనీ వార్షికోత్సవం వచ్చిందంటే చాలు నెల రోజుల పాటు కంపెనీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మా కంపెనీ ఇన్వెస్టర్ల కంటే సీరియస్‌ హోం సీకర్స్‌కే ప్రాధాన్యమెక్కువ. అందుకే వాళ్లు ఉండేందుకే ఇళ్లు కొంటారు. అందులోనే ఉంటారు కూడా. ఇన్వెస్టర్లను కస్టమర్లుగా చేర్చుకున్న ప్రాజెక్ట్‌లు సక్సెస్‌ కాలేవు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమాలనూ ఉత్సాహంగా నిర్వహిస్తాం. బీరంగూడ, మల్లంపేటలో గుడి, బడి కట్టించాం. ప్రణీత్‌ ప్రాజెక్ట్‌లుండే చోట ఆయా పరిసరాల్లో సీఎస్‌ఆర్‌ కింద రోడ్లు, మురుగు నీటి శుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. కొంత నిధితో ఓ ట్రస్ట్‌నూ ఏర్పాటు చేయాలనే భావిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement