దేశంలో వాహనాల వినియోగం పెరిగిపోతోంది. ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా ఎక్కువ వృద్ధి మనదేశంలోనే. దేశీయ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో 80 శాతం ద్విచక్ర వాహనాలదే ఆధిపత్యం. రవాణా పరంగా అత్యంత సౌకర్యమైనది కావడం వల్లే. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అధిక ఇంజన్ సామర్థ్యంతో కూడిన మోటారు సైకిళ్లకు డిమాండ్ పెరుగుతుండడం. ఈ విభాగంలో 300 నుంచి 500సీసీ ఇంజన్ సామర్థ్యాల బైకుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక 500సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన బైకుల మార్కెట్ కూడా వేడెక్కుతోంది. మెట్రోలు, టైర్–1 పట్టణాల్లో ఈ బైకులకు ఆదరణ పెరుగుతోంది. ఈ బైకుల ఖరీదు ఎక్కువే అయినప్పటికీ, రుణం లభించే వెసులుబాటు ఉండడం సానుకూలం. అయితే, దురదృష్టవశాత్తూ ఈ బైకులు ప్రమాదం బారిన పడితే విడిభాగాలకు జరిగే నష్టం పెద్దగానే ఉంటుంది. ఇది పాకెట్‌కు చిల్లు పెడుతుంది. కనుక కాంప్రెన్సివ్ కవరేజీతో కూడిన మోటారు ఇన్సూరెన్స్ ఒక్కటీ ఉండే సరిపోదు. తగిన యాడ్‌ఆన్ కవర్లను కూడా తీసుకోవడం అవసరం. అప్పుడే పూర్తి రక్షణ లభిస్తుంది.
జీరో లేదా నిల్ డిప్రిసియేషన్ కవర్, ఇంజన్ ప్రొటెక్టర్
సున్నా లేదా తరుగుదల లేని కవరేజీ అన్నది మీ బైక్‌కు తప్పనిసరి. ఎందుకంటే చిన్న విడిభాగం రిపేర్ చేయాల్సి వచ్చినా ఖర్చు ఎక్కువే అవుతుంది. మన దేశంలోకి దిగుమతి అయ్యే బైకుల్లో అధిక శాతం పూర్తిగా నిర్మించిన యూనిట్లే (సీబీయూ). వీటికి ఏదైనా నష్టం జరిగితే ఈ కవరేజీతో తగినంత పరిహారాన్ని ఏ మినహాయింపు లేకుండా పొందొచ్చు. ఇంజన్ ప్రొటెక్టర్ కూడా తప్పనిసరి. దీని కింద ఇంజన్‌లో చిన్న విడిభాగాలను మార్చాల్సి వచ్చినా లేదా రిపేర్ చేయాల్సి ఉన్నా కవరేజీ పొందొచ్చు. అలాగే, గేర్‌బాక్స్‌లో విడిభాగాలను మార్చాల్సి ఉన్నా కవరేజీ ఇస్తుంది. దెబ్బతిన్న ఇంజన్ ఓవర్‌హాల్, గేర్‌బాక్స్ ఓవర్‌హాల్, లేబర్ ఖర్చులను సైతం చెల్లిస్తుంది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో బైకుల ఇంజన్లలోకి నీరు వెళితే అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఈ కవరేజీ ఉపయోగపడుతుంది.
కన్జ్యూమబుల్ కవర్
చిన్నవి కూడా మొత్తం ఖర్చుల్లో చేరి పెద్దవవుతాయి. వాహనంలో కన్జ్యూమబుల్స్ అంటే ఇంజన్ ఆయిల్, గేర్‌బాక్స్ ఆయిల్, పవర్ స్టీరింగ్ ఆయిల్, బైక్ ఆయిల్, బ్యాటరీ ఎలక్ట్రోలైట్, ఫ్లూయిడ్, రేడియేటర్ కూలంట్, నట్లు, బోల్టులు ఈ తరహా విడిభాగాలు. కన్జ్యూమబుల్ కవర్ అన్నది కన్జ్యూమబుల్స్‌కు కవరేజీనిచ్చే యాడ్‌ఆన్. ఇది సాధారణ మోటార్ బీమాలో భాగంగా ఉండదు. కానీ, ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన యాడ్ ఆన్ కవర్. ఎందుకంటే ఒకవేళ ప్రమాదం జరిగితే ఆయిల్‌తోపాటు ఇతర కన్జ్యూమబుల్స్ మార్చాల్సి వస్తే ఖర్చులు ఎక్కువే అవుతాయి. జీరో డిప్రిసియేషన్, ఇంజన్ ప్రొటెక్టర్‌కు టాపప్‌గా దీన్ని తీసుకోవచ్చు.
పిలియన్ కవర్ లేదా ఎక్స్‌ట్రా యాక్సిడెంటల్ కవర్
సూపర్ బైకులన్నవి అధిక ఇంజన్ సామర్థ్యం, అధిక పవర్‌తో ఉంటాయి. వీటిని నడపడంలో, ముఖ్యంగా వెనుక ఎవరైనా కూర్చున్న సమయాల్లో నడపడంలో శిక్షణ, సాధన అవసరం. ఈ బైకులకు యాక్సిడెంట్ జరిగితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలా కేసుల్లో బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వారు కూడా మరణించే అవకాశాలు ఉంటాయి. బండిని నడిపే వ్యక్తి యజమాని కాకపోయినా, వెనుక కూర్చున్న వారికీ రూ.15 లక్షల కవరేజీ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment