పతనం దిశగా బంగారం ధర
అంతర్జాతీయంగా మార్కెట్ బలహీనంగా ఉండటం, బంగారు ఆభరణాల కొనుగోళ్లు తగ్గడం వంటి కారణాల వల్ల భారత్‌లో బంగారం ధర క్షీణించింది. గతవారం 10 గ్రాముల బంగారం ధర రూ.27,000ల దిగువకు పడిపోయి, చివరకు రూ.725 తగ్గి రూ.26,700 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం ధర 2.9 శాతం తగ్గుదలతో ఔన్స్ 1,127 డాలర్లుగా ఉంది.
దేశ రాజధానిలో గతవారం ప్రారంభంలో రూ. 27,575గా ఉన్న 99.9 స్వచ్ఛత బంగారం ధర వారాంతానికి రూ.26,700కు తగ్గింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.27,425 నుంచి రూ.26,550కు క్షీణించింది. గతవారం ముగింపు ఆగస్ట్ 29న రక్షా బంధన్ సందర్భంగా బులియన్ మార్కెట్ సెలవు. చైనా సంక్షోభం, కరెన్సీ ఒడిదుడుకులు, అమెరికా రిజర్వు ఫెడ్ రేట్ల పెంపు అంచనాలు వంటి అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేశాయని విశ్లేషకులు పేర్కొన్నారు.