ఉత్పాదకతతోనే ఎగుమతుల వృద్ధి
భారత్‌కు ప్రపంచ బ్యాంక్ సూచన
న్యూఢిల్లీ: దక్షిణాసియా ప్రాంతంలో ప్రధాన ఎగుమతుల దేశంగా అవతరించాలంటే.. భారత్ తప్పనిసరిగా తన ఉత్పాదకతను పెంపొందించుకోవాల్సి ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. దీనికి అనువుగా తగిన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం భారతీయ కంపెనీలు ఎగుమతుల పరంగా చాలా అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. దీంతోపాటు వీటికి ప్రపంచ దేశాల పోటీ కూడా ఒక సమస్యగా మరిందని తెలిపింది. ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.
‘ఉత్పాదకతను పెంచుకుంటేనే పోటీలో నిలువగలం. ప్రపంచపు ఎగుమతుల హబ్‌గా దక్షిణాసియా ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలంటే భారత్ వంటి దేశాలు వాటి ఉత్పాదకతను ప్రతి ఏడాది రెండు శాతం పారుుంట్ల మేర పెంచుకుంటూ రావాలి’ అని వివరించింది.దక్షిణాసియా ప్రాంతంలోని ఆయా దేశాలు వ్యాపారానుకూల పరిస్థితులఏర్పాటుకు, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, నూతన పాలసీ అమలుకు కృషి చేయాలని సూచించింది. దేశంలో ఉత్పాదకతను పెంచాలంటే వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ వారిని తయారీ, సేవల రంగం వైపు మరల్చాలని భారత్‌కు సూచించింది.
టెక్నాలజీని పూర్తిస్థారుులో ఉపయోగించుకోవడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం వంటి వాటి ద్వారా భారతీయ కంపెనీలు వాటి ఉత్పాదకతను పెంచుకోవచ్చని తెలిపింది. కార్మికులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం, పట్టణాల అభివృద్ధి అంశాలపై దృష్టిసారిస్తే భారత్‌లో ఉత్పాదకత కచ్చితంగా పెరుగుతుందని పేర్కొంది.