క్యూ1 ఫలితాలే కీలకం!
♦ ఈ వారంలోనే ఆర్‌ఐఎల్, విప్రో క్యూ1 ఫలితాలు
♦ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపైనా దృష్టి
♦ ఫలితాలను బట్టి షేర్ల కదలికలు
♦ ఈ వారంస్టాక్ మార్కెట్‌పై నిపుణుల అంచనాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హిందుస్తాన్ యునిలివర్ వంటి బ్లూచిప్ కంపెనీలు వెల్లడించే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఈ వారం స్టాక్‌మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులంటున్నారు. వీటితో పాటు నేటి (సోమవారం)నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని వారంటున్నారు. ఈ వర్షాకాల సమావేశాలు రాష్ట్రపతి ఎన్నికతో ఆరంభమవుతాయి. ఇక రుతుపవనాల విస్తరణ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం.. ఈ అంశాలు కూడా స్టాక్‌మార్కెట్‌పై తగినంతగా ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
ఫలితాలను బట్టి సూచీల కదలికలు...
కంపెనీల క్యూ1 ఫలితాలను బట్టి స్టాక్ సూచీల కదలికలు ఉంటాయని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్ కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఈ వారం ఎలాంటి ఆర్థిక పరమైన గణాంకాలు వెల్లడి కావని, అందుకని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరును ఇన్వెస్టర్లు గమనిస్తారని వివరించారు. ఫలితాల సీజన్ ప్రారంభమైనందున షేర్ల వారీ కదలికలు ప్రధానంగా ఉంటాయని పేర్కొన్నారు.
క్యూ1 ఫలితాల వెల్లడికి ముందు, ఫలితాలు వెల్లడైన తర్వాత కంపెనీ షేర్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి చెప్పారు. ఇప్పటివరకైతే వర్షాలు సంతృప్తికరంగానే కురిశాయని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన వ్యాపారాలకు శుభసూచకమని కోటక్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐఓ–ఈక్విటీ) హర్ష ఉపాధ్యాయ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల వడ్డీరేట్ల తగ్గింపుకు అవకాశమేర్పడిందని, మార్కెట్ మరింత ముందుకు పోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు.
నేడు ఏసీసీ క్యూ1 ఫలితాలు
నేడు (ఈ నెల 17న–సోమవారం) ఏసీసీ, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం(ఈ నెల 18న) హిందుస్తాన్ యునిలివర్, క్రిసిల్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు, గురువారం(ఈ నెల 19న) విప్రో, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్‌లు, శుక్రవారం (ఈ నెల 20న) రిలయన్స్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్ కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి.
ఇక అంతర్జాతీయ అంశాల్లో... సోమవారం యూరోజోన్ రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. గురువారం యూరప్ కేంద్ర బ్యాం క్, జపాన్ కేంద్ర బ్యాంక్‌లు వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటాయి.
కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల జోరు
విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెల మొదటి రెండు వారాల్లో ఎఫ్‌పీఐలు మన క్యాపిటల్ మార్కెట్లో రూ.11,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐలు మన ఈక్విటీ మార్కెట్లో రూ.498 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.10,405 కోట్లు, వెరశి రూ.10,903 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి–జూన్ కాలానికి వచ్చిన రూ.1.62 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులకు ఇది కొనసాగింపు. జీఎస్‌టీ అమలు సాఫీగా సాగుతుండడం, భారత ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలే విదేశీ పెట్టుబడుల జోరుకు కారణాలని నిపుణులంటున్నారు.