దిగ్గజాల ఫలితాలే దిక్సూచి! | Q2 results of many companies this week | Sakshi
Sakshi News home page

దిగ్గజాల ఫలితాలే దిక్సూచి!

Published Mon, Oct 30 2017 3:27 AM | Last Updated on Mon, Oct 30 2017 3:27 AM

Q2 results of many companies this week

ఇది ఫలితాల సీజన్‌ కావటంతో ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ2 ఫలితాలు ఈ వారం స్టాక్‌మార్కెట్‌కు కీలకం కానున్నాయనేది నిపుణుల మాట. ఫలితాలతో పాటు దేశీయంగా, అంతర్జాతీయంగా వెలువడే కొన్ని గణాంకాలు, వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తీసుకునే నిర్ణయం కూడా తగిన ప్రభావం చూపవచ్చనేది వీరి విశ్లేషణ.

ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల, దేశీయ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు కూడా స్టాక్‌ సూచీల గమనాన్ని నిర్దేశించనున్నాయి. గత వారంలో సెన్సెక్స్‌ 767 పాయింట్లు. నిఫ్టీ 112 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.  

స్టాక్‌వారీ కదలికలు
క్యూ2 ఫలితాల సీజన్‌ కావడంతో సమీప కాలంలో స్టాక్‌వారీ కదలికలు ఉంటాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ కార్యక్రమం, తదుపరి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం వివరాలపై మార్కెట్ల దృష్టి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రేడ్‌బుల్స్‌ సీఈవో ధృవ్‌ దేశాయ్‌ సైతం స్టాక్‌ వారీ కదలికలకే ఎక్కువ ఉంటాయన్నారు.

‘‘సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ ప్రకటన, లిక్విడిటీ మద్దతుతో అక్టోబర్‌లో మార్కెట్లు బలంగా ముందుకు కదిలాయి. అధిక వ్యాల్యూషన్ల నేపథ్యంలో మార్కెట్లు నవంబర్‌లో ఈ స్థాయిలో íస్థిరీకరణ చెందుతాయని అంచనా వేస్తున్నాం. క్యూ2లో మంచి ఫలితాలు ప్రకటించిన కంపెనీలకు కొనుగోలు మద్దతు కొనసాగుతుంది’’అని కోటక్‌ సెక్యూరిటీస్‌కు చెందిన సంజీవ్‌ జర్బేడ్‌ పేర్కొన్నారు. అంతకుముందు వారాల్లో వారు నికర విక్రయదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గతవారం నికరంగా రూ.912 కోట్ల షేర్లను కొనుగోలు చేయడం విశేషం.  

కీలక కంపెనీల క్యూ2 ఫలితాలు..
ఈ వారంలో పలు కీలక కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. సోమవారం టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, లుపిన్, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బుధవారం హీరో మోటొకార్ప్, గోద్రెజ్‌ కన్సూమర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీల క్యూ2 ఫలితాలు వస్తాయి.

గురువారం వేదాంత, పవర్‌ గ్రిడ్, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, శుక్రవారం హిందాల్కో, టాటా పవర్, పీఎఫ్‌సీ, టైటాన్‌ కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. ఇక బుధవారం అక్టోబర్‌ నెల తాలూకు వాహన విక్రయ గణాంకాలను కంపెనీలు వెల్లడిస్తాయి. విక్రయాలు బాగా ఉండే అవకాశాల నేపథ్యంలో మారుతీ సుజుకీ తదితర వాహన కంపెనీల షేర్లు వెలుగులోకి రావచ్చు.  

మౌలిక రంగ గణాంకాలు కూడా..
సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన మౌలిక రంగ గణాంకాలు మంగళవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడతాయి. అక్టోబర్‌ నెలకు సంబంధించి తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలను మార్కెట్‌ఎకనామిక్స్‌ సంస్థ శుక్రవారం (వచ్చే నెల 3న) వెల్లడిస్తుంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే, అక్టోబర్‌ నెల యూరోజోన్‌ బిజినెస్‌ క్లైమేట్‌ గణాంకాలు సోమవారమే వస్తాయి

. అదే రోజు జపాన్‌ దేశ సెప్టెంబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెలువడతాయి. మంగళవారం జపాన్‌ కేంద్ర బ్యాంక్‌ ద్రవ్య పాలసీని ప్రకటిస్తుంది. బుధవారం  చైనా తయారీ రంగ అక్టోబర్‌ పీఎంఐ గణాంకాలు వస్తాయి. అదే రోజు కీలకమైన అంతర్జాతీయ పరిణామం... అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల నిర్ణయం ఉంటుంది. అలాగే, అమెరికా జీడీపీ గణాంకాలు కూడా వెలువడనున్నాయి. ఇక శుక్రవారం చైనా సేవల రంగం పీఎంఐ గణాంకాలు, అమెరికా వ్యవసాయేతర రంగాల ఉద్యోగ గణాంకాలు వెలువడుతాయి. ఇవన్నీ మదుపరులు గమనించాల్సిన అంశాలే.

రూ.18,000 కోట్ల ఎఫ్‌పీఐల పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) అక్టోబర్‌ నెలలో 2వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య రూ.17,938 కోట్ల మేర దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేశారు. ఇందులో రూ.2,806 కోట్ల మేర ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయగా, రూ.15,132 కోట్లు డెట్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఎక్కువ శాతం ఫండ్స్‌ డెట్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడం ఆసక్తికరం.

ఆగస్ట్‌ నెలలో వారు నికరంగా రూ.10,000 కోట్ల మేర నిధుల్ని దేశీయ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి తరలించుకుపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆరు నెలల కాలంలో ఫిబ్రవరి – ఆగస్ట్‌ మధ్య రూ.1.78 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వానికి తోడు అధిక రాబడుల కారణంగా దేశీయ బాండ్లు విదేశీయ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా ఉన్నాయని క్వాంటమ్‌ అడ్వైజర్స్‌ హెడ్‌ అరవింద్‌చారి పేర్కొన్నారు. దేశీయ బాండ్లలో పెట్టుబడుల పరిమితిని ఆర్‌బీఐ పెంచడం కూడా ఒక కారణమన్నారు.


ఈ వారం మూడు ఐపీఓలు
ఈ వారంలో మూడు కంపెనీలు– మహీంద్రా లాజిస్టిక్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఖదిమ్‌ ఇండియాలు ఐపీఓకు వస్తున్నాయి. మహీంద్రా లాజిస్టిక్స్‌ ఐపీఓ మంగళవారం ప్రారంభమై వచ్చే నెల 2న ముగుస్తుంది. రూ.425–429 ధరల శ్రేణిలో ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.829 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 34 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

వచ్చే నెల 10న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి. ప్రభుత్వరంగ సాధారణ బీమా దిగ్గజం న్యూ ఇండియా అష్యూరెన్స్‌ భారీ ఐపీవో వచ్చే నెల 1న (బుధవారం) మొదలై 3వ తేదీతో ముగియనుంది. ఒక్కో షేరుకు ఐపీవో ధరల శ్రేణి రూ.770–800. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ గరిష్టంగా రూ.9,600 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. కనీసం 18 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాలి.

ఫుట్‌వేర్‌ కంపెనీ అయిన ఖదిమ్‌ ఇండియా ఐపీఓ గురువారం మొదలై వచ్చే నెల 6న ముగుస్తుంది. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.745–750. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.543 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 20 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ షేర్లు శుక్రవారం మార్కెట్లో లిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది.

– (సాక్షి, బిజినెస్‌ విభాగం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement