క్యూ2 ఫలితాలే కీలకం
న్యూఢిల్లీ: మార్కెట్ గమనాన్ని అక్టోబర్ నెల నిర్దేశించనుంది. కార్పొరేట్ కంపెనీల ద్వితీయ త్రైమాసిక ఫలితాలకు తోడు అనేక కీలకమైన గణాంకాలు, ఆర్‌బీఐ, ఫెడరల్ బ్యాంక్‌ల సమీక్షలు స్టాక్ మార్కెట్ల మధ్య కాలిక గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఇదే సమయంలో అమెరికా షట్‌డౌన్ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటుందన్న దానిపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ శుక్రవారం (అక్టోబర్ 11) విడుదల చేయనున్న ఆర్థిక ఫలితాలతో క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి ప్రారంభం కానుండటంతో స్టాక్ మార్కెట్ కదలికలు అప్రమత్తంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్ధిరేటు నెమ్మదించడంతో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. దీనికితోడు దేశీయ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా శుక్రవారం విడుదల కానున్నాయి.
కేవలం దేశీయ పరిణామాలే కాకుండా ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్‌పై బాగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా బడ్జెట్ ఆమోదం పొందక, అక్కడి ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించడంతో అక్టోబర్ 17లోగా అమెరికా బడ్జెట్‌ను ఎలా ఆమోదించుకొని డెట్ ఆబ్లిగేషన్ నుంచి ఎలా గట్టెక్కుతుందన్న ఆందోళన మార్కెట్ వర్గాలను కలవరానికి గురి చేస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపధ్యంలో ఈ వారం మార్కెట్లు బాగా హెచ్చు తగ్గులకు లోను కావొచ్చని కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లెయింట్ గ్రూపు రీసెర్చ్ హెడ్ డిపెన్ షా అంచనా వేస్తున్నారు. ‘‘మనం త్రైమాసిక ఫలితాల సీజన్‌లోకి ప్రవేశించామని, దేశీయంగా చాలా కంపెనీల ఫలితాలు నిరాశపర్చే విధంగా ఉండొచ్చు’’ అని డిపెన్ షా పేర్కొన్నారు. మధ్య దీర్ఘకాలిక కదలికలను వడ్డీరేట్లు, సంస్కరణలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రభావితం చూపుతాయంటున్నారు.
5,900 కీలకం
సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 5,900 స్థాయి చాలా కీలకమైనదని బొనంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ నిధి సారస్వత్ పేర్కొన్నారు. నిఫ్టీ ఈ స్థాయిపైన స్థిరపడితే మరింత కొనుగోళ్ళ మద్దతు లభిస్తుందన్నారు. గడచిన వారంలో నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 5,907 వద్ద ముగిసింది.
డెట్‌లో ఎఫ్‌ఐఐల అమ్మకాలు
అమెరికా షట్‌డౌన్ ప్రభావంతో విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్‌ఐఐలు) దేశీయ డెట్ మార్కెట్ నుంచి భారీగా వైదొలగుతున్నారు. కానీ ఇదే సమయంలో ఈక్విటీల్లో నికర కొనుగోళ్ళు జరుపుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఎఫ్‌ఐఐలు డెట్ మార్కెట్లో రూ. 5,340 కోట్ల అమ్మకాలు జరపగా, ఇదే సమయంలో ఈక్విటీల్లో రూ.1,942 కోట్ల కొనుగోళ్ళు జరిపారు. మొత్తం మీద చూస్తే గడచిన వారంలో ఎఫ్‌ఐఐలు రూ.3,400 కోట్లు నికర అమ్మకాలు జరిపారు.
మార్కెట్‌ను నిర్దేశించేవి ఇవే...
తేది- అంశం
అక్టోబర్ 11- ఇన్ఫోసిస్‌తో క్యూ2 రిజల్ట్స్ ప్రారంభం
అక్టోబర్ 11- పారిశ్రామికోత్పత్తి గణాంకాలు
అక్టోబర్ 14- సెప్టెంబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు
అక్టోబర్ 17- అమెరికా బడ్జెట్ ఆమోదానికి చివరి తేది
అక్టోబర్ 29- ఆర్‌బీఐ త్రైమాసిక సమీక్ష
అక్టోబర్ 29-30 - అమెరికా ఫెడరల్ సమీక్ష