
న్యూఢిల్లీ: లోహ, మైనింగ్ దిగ్గజం వేదాంత నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 34 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.2,045 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,343 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.22,509 కోట్ల నుంచి రూ.23,297 కోట్లకు పెరిగిందని వేదాంత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసన్ చెప్పారు. అల్యూమినియమ్ అమ్మకాలు అధికంగా ఉండటం, తల్వాండి సాబో పవర్ ప్లాంట్ విద్యుదుత్పత్తి పెరగడం దీనికి కారణాలన్నారు.
జింక్ ఇండియా, జింక్ ఇంటర్నేషనల్ సంస్థల అమ్మకాలు తక్కువగా ఉండటం, ట్యుటికోరన్ స్మెల్టర్ మూసివేత వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రోస్టీల్ స్టీల్ కంపెనీ కొనుగోలు, కరెన్సీ పతనం, కమోడిటీల ధరలు పెరగడం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపించాయన్నారు. కాగా వ్యయాలు రూ.18,854 కోట్ల నుంచి రూ.20,999 కోట్లకు పెరిగాయి, ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.17 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనుంది. మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.6,320 కోట్లు. ఈ డివిడెండ్‌కు రికార్డ్ డేట్‌గా ఈ నెల 10ని కంపెనీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment