గుడ్ న్యూస్: 4వేల ప్రత్యేక రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న పండుగ సీజన్‌లో భారీగా పెరగనున్న డిమాండ్ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ రైలు ప్రయాణీకులకు శుభవార్త అందించింది. ఈ పండుగ సీజన్లో భారతీయ రైల్వే 4,000 ప్రత్యేక రైళ్లను నడుపుతుందని రైల్వేశాఖ మంత్రి మనోజ్ సిన్హా మంగళవారం ప్రకటించారు. పండుగ సీజన్లో ప్రధాన స్టేషన్లలో క్లీన్ మరుగుదొడ్లు వంటి అనేక సౌకర్యాలను కల్పిస్తుందని మనోజ్ సిన్హా తెలిపారు.
రాబోయే 40 రోజుల్లో దుర్గా పూజ, దసరా, దీపావళి , చాత్ పర్వదినం సందర్భంగా అక్టోబర్ 15, అక్టోబర్ 30 మధ్యకాలంలో అదనపు రైళ్లను ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన గమ్యస్థానాలకు ప్రత్యేక రైల్వేలను నడుపుతామన్నారు. ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లను కూడా జోడిస్తామని తెలిపారు. ముఖ్యంగా చాత్ కోసం కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, అహ్మదాబాద్ నుంచి, తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్ లకు స్పెషల్ రైళ్లను కేటాయిస్తున్నట్టు ఆయన చెప్పారు.
అదనపు రిజర్వేషన్ కౌంటర్లను కూడా అందుబాటులో ఉంచడంతోపాటు ప్రధాన స్టేషన్లలో శుభ్రమైన మరుగుదొడ్లు తదితర సదుపాయాలను కల్పిస్తామన్నారు. అంతేకాదు భారీ రష్ ఉంటే ప్లాట్‌ఫాం టికెట్ల అమ్మకాన్ని కూడా నిలిపివేస్తామని వెల్లడించారు. అక్రమ ఏజెంట్ల నిరోధానికి, మరింత భద్రతకోసం అదనపు రక్షణ బృందాలనును కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రద్దీ దృష్ట్యా అవసరమైతే రైల్వే సిబ్బంది సెలవులను కూడా రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోందన్నారు. గత సంవత్సరం పండుగ సీజన్‌లో 3,800 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.