న్యూఢిల్లీ: టారిఫ్‌యేతర ఆంక్షలు విధిస్తూ, భారత్ నుంచి ఎగుమతులకు అవరోధాలు సృష్టిస్తున్న దేశాల పేర్లు చెప్పాలని వ్యాపారవేత్తలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. అలాంటి దేశాలపై కచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ ఈ విషయాలు తెలిపారు. ఏ ఒక్కరి విషయంలోనో కాకుండా అందరికీ ప్రయోజనాలు కలిగేలా సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలన్నది తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ‘ఏ దేశమైనా మీ ఎగుమతులపై టారిఫ్‌యేతర ఆంక్షలు విధించడం గానీ.. ఇతరత్రా అవరోధాలు గానీ సృష్టించడం గానీ చేస్తుంటే ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది. ఆయా దేశాలపై అదే తరహా వాణిజ్యపరమైన ఆంక్షలతో తగు చర్యలు తీసుకుంటుంది‘ అని గోయల్ తెలిపారు.
వాస్తవ పరిస్థితులు మీరే చెప్పండి ..
‘మా అధికారులు నాకు చెప్పేవన్నీ.. అంతా బాగానే ఉందనే అభిప్రాయం కలిగేలా ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తుంటే కచ్చితంగా అలా ఉన్నట్లు అనిపించడం లేదు. కాబట్టి వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా లేదా.. సమస్యలేమైనా ఉన్నాయా.. వాస్తవ పరిస్థితులను మీరే ప్రభుత్వానికి తెలియ జేయండి. నేను, మా అధికారులు మీకు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటాం‘ అని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ద్రవ్యలోటును
కట్టడి చేయాలి: ఐఎంఎఫ్
ఇదిలావుండగా, భారత్ ద్రవ్యలోటును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. వ్యయాల హేతుబద్ధీకరణ, ఆదాయం పెంపు మార్గాల ద్వారా ఇది సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఫిక్కీ న్యూఢిల్లీలో నిర్వహించిన 92వ వార్షిక సదస్సులో ఆమె మాట్లాడారు. గడచిన కొద్ది త్రైమాసికాలుగా చూస్తే, ప్రైవేటు రంగం డిమాండ్ మందగమనంలో ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే పెట్టుబడుల్లో బలహీనత కొనసాగితే, దీర్ఘకాలంలో అది వృద్ధితీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.
బజాజ్ వ్యాఖ్యలకు కౌంటర్!
ప్రభుత్వ విధానాలను విమర్శించే దమ్మెవరికీ లేకుండా పోయిందని, భయాందోళనలకు గురి చేసే వాతావరణం నెలకొందని పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలపై గోయల్ స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే, తమ ప్రభుత్వం ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తుందని, అందరి అభిప్రాయాలనూ వింటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో.. ప్రజలు, పరిశ్రమవర్గాల నుంచి మరింతగా తెలుసుకోవాలనుకుంటోందని అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు.
అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు
Published Sat, Dec 21 2019 5:14 AM | Last Updated on Sat, Dec 21 2019 5:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment