
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కాస్త కష్టమేనని బిగ్ బుల్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా వ్యాఖ్యానించారు. తగిన నైపుణ్యం లేకుండా కొత్తవాళ్లు నేరుగా పెట్టుబడులు పెట్టొద్దని సలహా ఇచ్చారు. ఇలాంటివాళ్లు మార్కెట్‌పై మంచి అవగాహన వచ్చేవరకు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందేందుకు నిపుణుల సలహా, పర్యవేక్షణ అవసరమన్నారు.
మ్యూచువల్ ఫండ్స్ కాదనుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)మరో మంచి మార్గమన్నారు. మరోవైపు దేశీయ బుల్ మార్కెట్ పరుగులు కొనసాగుతాయని, కాకపోతే ఈ పరుగు ఎన్నాళ్లో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. త్వరలో భారత్ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే ఈక్విటీలు మంచి ఫలితాలిస్తాయని చెప్పారు.
బ్యాంక్ మోసాలు ఇప్పుడు వెలుగులోకి రావడం మంచిదేనని, అయితే బ్యాంక్‌లకు మూలధన నిధులు అందించడం దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారాయన. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేముందు చూడాల్సిన ముఖ్యాంశాలు, ఏ షేర్‌ను ఎప్పుడు అమ్మాలి, మార్కెట్‌పై ఎల్‌టీసీజీ పన్ను పోటు, వడ్డీ రేట్లు, ప్రైవేట్ పెట్టుబడులు ఇలా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వివరించారు. ఆ వివరాలు..
నాణ్యమైన చిన్న షేర్లు ఎంచుకోండి....
షేర్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు పరిశీలించాల్సినవాటిలో ముఖ్యమైనవి ఆ షేరు ధర, విలువ. ఏం కొన్నామన్నది కాదు, ఎంతకు కొన్నామన్నదే ముఖ్యం. లార్జ్‌క్యాప్స్ కన్నా, నాణ్యమైన స్మాల్‌క్యాప్స్‌లో పెట్టుబడే మంచిది. అవి లార్జ్‌క్యాప్స్‌గా ఎదిగే క్రమంలో భారీ లాభాలిస్తాయి. కంపెనీ షేరులో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం కీలకం. పెట్టుబడి పెట్టేముందు సరైన విశ్లేషణ ఎంత అవసరమో, పెట్టుబడి పెట్టాక ఓపికగా ఎదురు చూడడం కూడా అంతే అవసరం.
ఎప్పుడు అమ్మాలంటే...
మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్ల కన్నా మంచి షేర్లు కనిపిస్తే ఉన్నవాటిని అమ్మి కొత్తవాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే. అలాగే ఒకస్థాయికి మించి భారం పెరుగుతుందనుకున్నప్పుడు కొన్ని షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకొని భారం తగ్గించుకోవాలి. చాలామంది పొజిషన్లపై మమకారం పెంచుకుంటారు. అది మంచిది కాదు. ఒకస్థాయి వద్ద లాభాలు స్వీకరించి కొత్తవాటిలోకి ఎంటర్ కావడం ఉత్తమం. ఇతరులు మాకెందుకులే అని వదిలేసిన రంగాల్లో అవకాశాలను వెతికి లాభాలు సంపాదించేవాడే నిజమైన ఎంటర్‌ప్రెన్యూర్.
ఎమోషన్స్ మీద, ఒకటిరెండు ఐడియాల మీద ఆధారపడి వ్యాపారంలోకి వస్తే ఏమీ మిగలదు. బీ2బీ మోడల్‌కు చెందిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఆరంభించడం ఉత్తమం. దీంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్లు కొత్త టెక్నాలజీలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి.
ఈ ర్యాలీ ‘బఫే’ విందు లాంటిది..: దేశీయ మార్కెట్లో ర్యాలీని బఫే భోజనంతో పోల్చవచ్చు. బఫేలో మనకు కావాలిసినవి అందుబాటులో ఉంటాయి, నచ్చినవి తీసుకొని తినొచ్చు. మార్కెట్లో కూడా పలు రంగాల స్టాకులు అందుబాటులో ఉన్నాయి, వీటిలో అనువైనవి ఎంచుకోవడమే మన పని.
‘పన్ను’ పోటు తక్కువే...
ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఈ పన్నుతో మార్కెట్లు వెనకంజ వేస్తాయనుకోవడంలేదు. ఈక్విటీలతో పోల్చితే ఇతర పెట్టుబడి సాధనాలపైననే ఎక్కువ పన్ను ఉంది. ఎల్‌టీసీజీ విధించినా ఈక్విటీలే తక్కువ పన్ను భారం ఉంది. దీంతో ఇవి ఆకర్షణీయంగా ఉన్నాయి. దేశీయ పెట్టుబడులను ఈ పన్ను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. అయితే విదేశీ పెట్టుబడిదారులు ఇంతవరకు పన్నులు లేకుండా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. కాబట్టి ఈ పన్ను ప్రభావం వారిపై ఉండొచ్చు.
వడ్డీరేట్లు ప్రస్తుత స్థాయిల్లోనే..
మన దేశంలో వడ్డీరేట్లు మరికొంత కాలం ప్రస్తుత స్థాయిల్లోనే ఉండే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఇక అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మూడు దఫాలుగా రేట్లను పెంచవచ్చు. దీనివల్ల ద్రవ్యోల్బణం పెద్దగా పెరుగుతుందని భావించడంలేదు. ప్రైవేట్ పెట్టుబడులు వృద్ధి చెందడం ఒక నిరంతర ప్రక్రియ. 2002లో ప్రైవేట్ పెట్టుబడుల వాటా జీడీపీలో 27 శాతం కాగా 2008కి 35 శాతానికి చేరింది. ప్రస్తుతం 28 శాతానికి తగ్గింది. వచ్చే నాలుగేళ్లలో తిరిగి 35 శాతం వరకు పెరగవచ్చు. స్టీల్, వాణిజ్యవాహనాలు, కెమికల్ యూనిట్లలో ప్రస్తుతం పెట్టుబడులు వస్తున్నాయి. డిమాండ్ ఊపందుకునే కొద్దీ ఇవి మరింత పుంజుకుంటాయి.
బ్యాంక్ మోసాలు మంచికే..
ఇందిరా గాంధీ కారణంగా దేశంలో అవినీతి వ్యవస్థీకృతమైంది. పలు ప్రభుత్వ రంగాల్లో పెరిగిన అవినీతి, వైఫల్యాల కారణంగా ప్రైవేటీకరణపై ప్రజల్లో మోజు పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇందుకు ఎయిర్‌ఇండియాను ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను విలీనం చేయాలి. కేవలం 3– 4 పీఎస్‌యూ బ్యాంకులనే ఉంచాలి.
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూలధన నిధులు ఇవ్వడం దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా పీఎస్‌బీలకు నిధులు ఇచ్చుకుంటూ పోతే ఐదారేళ్లలో ఇన్‌ఫ్రా తదితర ప్రాజెక్టులకు వెచ్చంచడానికి ప్రభుత్వం దగ్గర దమ్మిడీ మిగలదు. నిజానికి బ్యాంక్ కుంభకోణాలు బయటకు రావడం ఒకందుకు మంచిదే. ఇవిప్పుడు వెలుగులోకి రాకపోతే, ఈ తరహా స్కామ్‌లు మరింతగా పెరుగుతూ ఉండేవి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) యంత్రాంగం కూడా బాగుంది. మొత్తం మీద త్వరలో బ్యాంకుల భవితవ్యం బాగుపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment