టాటా టెలీ చైర్మన్‌గా మిస్త్రీ ఔట్!
ఈజీఎంలో ఏకగ్రీవంగా తీర్మానం
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి తాజాగా మరో టాటా గ్రూప్ కంపెనీ ఉద్వాసన పలికింది. డైరెక్టరు, చైర్మన్ హోదా నుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు టాటా టెలీసర్వీసెస్ తెలిపింది. బుధవారం నిర్వహించిన అసాధారణ వాటాదారుల సమావేశంలో(ఈజీఎం) టాటా సన్స్ ప్రతిపాదించిన తీర్మానానికి షేర్‌హోల్డర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వివరించింది. దీంతో టాటా గ్రూప్ సంస్థల్లో మిస్త్రీని బోర్డు నుంచి తొలగించిన మూడో కంపెనీగా టాటా టెలీ నిల్చింది.
ఇప్పటికే టాటా ఇండస్ట్రీస్, టీసీఎస్ ఆయనకు ఉద్వాసన పలకడం తెలిసిందే. మరోవైపు, టాటా గ్రూప్‌లో ప్రక్షాళనకు, గవర్నెన్స్ అమలుకు, వాటాదారుల హక్కుల పరిరక్షణ కోసం వివిధ వేదికల నుంచి పోరు కొనసాగిస్తానని మిస్త్రీ స్పష్టం చేశారు. టీసీఎస్ డైరెక్టరుగా తనను తొలగించడాన్ని ప్రస్తావిస్తూ.. దాదాపు 70% మంది నాన్ ప్రమోటర్ టీసీఎస్ షేర్‌హోల్డర్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడమో లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండటమో జరిగిందన్నారు. ’నన్ను తొలగించే తీర్మానానికి వ్యతిరేకంగా 78% మంది రిటైల్ ఇన్వెస్టర్లు, దాదాపు 48% మంది సంస్థాగత ఇన్వెస్టర్లు ఓటు వేశారు’ అని ఆయన చెప్పారు. ఈ ఓటింగ్ ద్వారా గ్రూప్‌లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను అమలు చేయాలన్న సూచన పెడచెవిన పెట్టరాదని మైనారిటీ షేర్‌హోల్డర్లు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు మిస్త్రీ పేర్కొన్నారు.
నానోపై రతన్ టాటాతో విభేదాలు: వాడియా
కంపెనీ ఆర్థిక వనరులకు పెను భారంగా మారిన నానో కారు ప్రాజెక్టుపై టాటా గ్రూప్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటాకు, తనకు మధ్య తీవ్ర విభేదాలు ఉండేవని టాటా మోటార్స్ స్వతంత్ర డైరెక్టర్ నుస్లీ వాడియా వెల్లడించారు. నానోపై పెట్టుబడులు, నష్టాలు వేల కోట్ల రూపాయల స్థాయిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. టాటా మోటార్స్ స్వతంత్ర డైరెక్టరుగా ఆయన తొలగింపునకు సంబంధించి ఈ నెల 26న ఈజీఎం జరగనున్న నేపథ్యంలో షేర్‌హోల్డర్లకు రాసిన లేఖలో వాడియా ఈ విషయాలు తెలిపారు.
’రూ. 1 లక్ష రేటుతో అమ్మే ఆలోచనతో 2008లో నానో కారు తెరపైకి వచ్చింది. కానీ ఇది టాటా మోటార్స్‌కు ఆర్థికంగా పెనుభారంగా మారింది. రూ. 2.25 లక్షల రేటు పెట్టినా కూడా కారు అమ్మకాలు లేవు. పోనీ అమ్ముడైనా కూడా కంపెనీకి గణనీయంగా నష్టమే మిగులుతోంది’ అని వాడియా చెప్పారు. వాణిజ్యపరంగా నానో విఫలం కావడంతో ఆ ప్రాజెక్టును కొనసాగించడాన్ని తాను గట్టిగా వ్యతిరేకించానని తెలిపారు.