బ్యాంకుల్లో అశోక చక్ర పసిడి నాణేలు
ఆర్‌బీఐ అనుమతి
ముంబై: అశోకచక్రతో కూడిన భారత పసిడి నాణేలను (ఐజీసీ) విక్రయించడానికి బ్యాంకులకు గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. ఎంఎంటీసీ తయారుచేసిన ఈ నాణేలను బ్యాంకులు తమ బ్రాంచీలలో విక్రయించవచ్చని ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఎంఎంటీసీ సంబంధిత బ్యాంక్ మధ్య కుదిరిన అవగాహన మేరకు విక్రయ విధివిధానాలు ఉండాలని సూచించింది. గోల్డ్ డిపాజిట్ స్కీమ్, గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద సమీకరించిన పసిడితో ఈ నాణేలు తయారుచేయడం జరుగుతుందని ఎంఎంటీసీ ఇప్పటికే వివరణ ఇచ్చింది. 5,10,20 గ్రాముల్లో ఈ నాణేలు లభ్యమవుతాయి.
పెన్షనర్ల లావాదేవీలపై సూచనలు...
పెన్షనర్ల అకౌంట్ల విషయంలో బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు చేసింది. వారి అకౌంట్లలోకి పెన్షన్లకు సంబంధించిన క్రెడిట్ లావాదేవీలు(ఏరియర్స్ సహా) ఏడాదికి 14 మించరాదని స్పష్టం చేసింది. ఏజెన్సీ బ్యాంక్‌కు ఆ లావాదేవీకి ప్రస్తుతం రూ.65 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి.
పసిడి పథకం నిబంధనలు సడలింపు ..
పసిడి డిపాజిట్ పథకం వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా ఆర్‌బీఐ నిబంధనలు సడలించింది. మధ్య కాలిక (5-7 ఏళ్లు), దీర్ఘకాలిక పసిడి డిపాజిట్లను (12-15 ఏళ్లు) కనీస లాకిన్ పీరియడ్ తర్వాత డిపాజిటర్లు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అయితే, వడ్డీ రేటును కొంత తగ్గించి చెల్లించడం రూపంలో దీనికి పెనాల్టీ ఉంటుంది. మధ్యకాలిక డిపాజిట్లకు మూడేళ్లు, దీర్ఘకాలికమైనవాటికి అయిదేళ్లు లాకిన్ వ్యవధి ఉంది. స్వల్పకాలిక డిపాజిట్లపై అసలు, వడ్డీని బంగారం రూపంలోనే చెల్లించడం జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. అదే మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లపై మాత్రం అసలును పసిడి రూపంలోనూ, వడ్డీని రూపాయిల్లోను చెల్లిస్తారు. వడ్డీ లెక్కించడానికి మాత్రం డిపాజిట్ చేసినప్పటి బంగారం విలువను ప్రాతిపదికగా తీసుకుంటారు.
మహిళా ఎస్‌హెచ్‌జీలకు 7 శాతానికే రుణం
మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) 7 శాతానికే రుణాలు అందించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు స్పష్టంచేసింది 2015-16లో నేషనల్ రూరల్ లైవ్‌లీవుడ్ మిషన్(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ఆజీవికా స్కీమ్ కింద మహిళా ఎస్‌హెచ్‌జీలకు ఈ తక్కువ స్థాయి రేటుకు రుణం అందించాలని పేర్కొంది. వార్షికంగా 7 శాతం వడ్డీకి రూ.3 లక్షల వరకూ రుణంపై వడ్డీ రాయితీకి(ఇన్‌ట్రస్ట్ సబ్‌వెన్షన్) ఎస్‌హెచ్‌జీ మహిళలు అందరూ అర్హులేనని వివరించింది.