
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నియామకాన్ని చేపట్టింది. తన మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌వో) సుధ బాలకృష్ణన్‌ను నియమించింది. మే 15 న సెంట్రల్ బ్యాంకులో చేరగా, ఆమె పదవీ మూడు సంవత్సరాలు ఉండనుందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. కేంద్ర బ్యాంకులో అత్యంత కీలకమైన పదవికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) మాజీ అధికారి సుధా బాలకృష్ణన్ ఆర్‌బీఐ తొలి సీఎఫ్‌వోగా ఎంపిక కావడం విశేషం.
అకౌంటింగ్ విధానాలు, నిబంధనలకు లోబడి కేంద్ర బ్యాంకు బ్యాలెన్స్ షీట్ ఇన్ ఛార్జ్ గా సుధా బాలకృష్ణన్ వ్యవహరిస్తారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంటింగ్ విధానాన్ని రూపొందించడం, అంతర్గత ఖాతాలను నిర్వహించడం, ఆర్ధిక ఫలితాల గురించి నివేదించటం, వివిధ ఖాతాల ఖాతాల ద్వారా, బ్యాలెన్స్ షీట్ , లాభ, నష్టాల ఖాతాల పరిశీలన లాంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తారు. రాబడి వసూళ్లు లాంటి ప్రభుత్వ లావాదేవీలతోపాటు విదేశాలలోనూ అత్యున్నత బ్యాంకు పెట్టుబడులను కూడా పర్యవేక్షించే బాధ్యత కూడా నిర్వహించనున్నారు.
కాగా 2016, సెప్టెంబరులో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇది అతిపెద్ద సంస్థాగత మార్పుగా చెప్పవచ్చు. గతంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పీవోవో) పదవిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు, కానీ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదని ఎకనామిక్స్ టైమ్స్ తన నివేదిక పేర్కొంది. మరోవైపు గత ఏడాది జులై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముద్రా పదవీవిరమణతో ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి డిప్యూటీ గవర్నర్ పదవికి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment