
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో మొండి ఖాతాలపై రిజర్వ్ బ్యాంకే ఆచరణీయాత్మకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. విశిష్ట అధికారాలను ఉపయోగిస్తూ... ఈ అంశంపై ఆర్‌బీఐకి కేంద్రం ఎటువంటి సూచనలు చేయబోదని స్పష్టం చేశాయి. మొండిఖాతాలపై ఆగస్టు 27లోగా తగు పరిష్కారం లభించకపోతే దివాలా కోర్టుకు నివేదించాలన్న ఆర్‌బీఐ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించడం, న్యాయస్థానం వాటి పిటీషన్‌ను కొట్టివేయడం తెలిసిందే. అయితే, ఆర్‌బీఐ చట్టంలోని నిబంధనల కింద పదిహేను రోజుల్లోగా పిటీషనర్లకు కొంత ఊరటనిచ్చే చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐని ఆదేశించవచ్చంటూ కేంద్రానికి న్యాయస్థానం సూచించింది. దీనిపైనే స్పందించిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాలు తెలిపారు.
‘రిజర్వ్ బ్యాంక్‌కు కేంద్రం సూచనలు చేసేందుకు చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ విద్యుత్ రంగంలోని మొండిబాకీల అంశం చాలా చిన్నదే కావడం వల్ల ప్రస్తుతం ఆర్‌బీఐకి కేంద్రం ఎటువంటి సూచనలు చేసే అవకాశం లేదు. అలా కాకుండా ఆర్‌బీఐనే తగు ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం‘ అని ఆయన వివరించారు. ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం ఆర్‌బీఐ సర్క్యులర్ ప్రభావం పది కంపెనీల మాత్రమే ఉంటుందని చెప్పారు. వీటిల్లోనూ అయిదింటిని పునరుద్ధరించవచ్చని, దివాలా చట్టం కింద మరో అయిదింటిని పునర్‌వ్యవస్థీకరించవచ్చన్నారు.
ఎన్‌పీఏలపై సమావేశానికి ఆర్‌బీఐకి ఆహ్వానం
విద్యుత్ రంగ ఎన్‌పీఏల పరిష్కారానికి ఆగస్ట్ 31న జరిగే సాధికారిక కమిటీకి ఆర్‌బీఐని ఆహ్వానించినట్టు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ఈ అంశంలో ఆర్‌బీఐ పాత్ర కూడా ఉండడంతో ఆహ్వా నించినట్టు చెప్పారు. కాగా, విద్యుత్ రంగ ఎన్‌పీఏలకు సంబంధించి దివాలా చర్యలకు అదనపు గడువు విషయంలో ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ను వినియోగించుకోవాలన్న అంశాన్ని... కేబినెట్ సెక్రటరీ అధ్యక్షనత గల ఉన్నత స్థాయి కమిటీయే నిర్ణయిస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టుల ఎన్‌పీఏలపై అసాధారణ అధికారాలను వినియోగించుకునే అవకాశం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో గార్గ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. విద్యుత్ రంగానికి ఇచ్చిన రూ.1.74 లక్షల కోట్ల మేర ఎన్‌పీఏ ఖాతాలను ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీకి నివేదించాల్సిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment