పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ కొరడా! | RBI Clamps Down On PMC Bank Customers Cant Withdraw More Than Rs 1000 | Sakshi
Sakshi News home page

పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ కొరడా!

Published Wed, Sep 25 2019 4:23 AM | Last Updated on Wed, Sep 25 2019 5:08 AM

RBI Clamps Down On PMC Bank Customers Cant Withdraw More Than Rs 1000 - Sakshi

ముంబై: ముంబై కేంద్రంగా, పలు రాష్ట్రాల్లోని పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహించే.. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వసూలు కాని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) తక్కువగా చూపించడంతోపాటు పీఎంసీలో ఎన్నో నిబంధనల ఉల్లంఘనను ఆర్‌బీఐ గుర్తించి ఈ చర్యలకు దిగింది. వచ్చే ఆరు నెలల పాటు ఒక్కో కస్టమర్‌ కేవలం రూ.1,000 మాత్రమే తన ఖాతా నుంచి (సేవింగ్స్‌/కరెంటు/డిపాజిట్‌ ఖాతా) ఉపసంహరించుకోవడానికి(విత్‌డ్రా) అనుమతిం చింది.

తన అనుమతి లేకుండా కొత్తగా రుణాలను మంజూరు చేయడం కానీ, ప్రస్తుత రుణాలను పునరుద్ధరించడం కాని చేయరాదని ఆంక్షలు పెట్టింది. అలాగే, కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా, ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించకుండా, తన ఆస్తులను విక్రయించకుండా ఆర్‌బీఐ నిషేధించింది. ప్రస్తుత బోర్డును ఆర్‌బీఐ రద్దు చేయడంతోపాటు తన అధికారుల బృందంతో మంగళవారం నుంచి బ్యాంకు పుస్తకాల తనిఖీని కూడా చేపట్టింది. తన చర్యలను బ్యాంకు లైసెన్స్‌ రద్దు చేయడంగా పరిగణించొద్దని ఆర్‌బీఐ కోరింది. ఎన్‌పీఏలు డబుల్‌ డిజిట్‌ స్థాయిలో ఉన్నా కానీ, పీఎంసీ చాలా తక్కువగా వాటిని చూపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షిస్తుంటుంది.  

ఏపీ సహా పలు రాష్ట్రాల్లో...
పీఎంసీ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షల వెనుక ప్రధాన కారణం బ్యాంకు పుస్తకాల్లో ఎన్‌పీఏలు అధికంగా ఉండడం వల్లేనని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల ద్వారా తెలుస్తోంది. బ్యాంకు యాజమాన్యమే పుస్తకాల ప్రక్షాళనకు ముందుకు వచ్చిందని, దీంతో బ్యాంకు కార్యకలాపాలు సాఫీగా నడిచేందుకు ఆర్‌బీఐ ఆంక్షలను విధించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసిన ఆరి్థక సంవత్సరంలో పీఎంసీ నికర లాభం కేవలం 1.20 శాతమే తగ్గి రూ.99.69 కోట్లుగా ఉంది. నికర ఎన్‌పీఏలు మాత్రం మొత్తం రుణాల్లో 1.05 శాతం నుంచి 2.19 శాతానికి పెరిగాయి. స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో 3.76 శాతంగా ఉన్నాయి.

ఇది అధికారికంగా చూపించింది. కానీ, ఇంతకంటే ఎక్కువే ఎన్‌పీఏలు ఉన్నాయన్నది తాజా సమాచారం. పట్టణ కోఆపరేటివ్‌ బ్యాంకు అయిన పీఎంసీ వద్ద 2019 మార్చి నాటికి రూ.11,167 కోట్ల ప్రజల డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకు మంజూరు చేసిన రుణాలు రూ.8,383.33 కోట్లు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పట్టణాల్లో మొత్తం 137 శాఖలు ఈ బ్యాంకు పరిధిలో ఉన్నాయి. పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలను ఆరు నెలల తర్వాత ఆర్‌బీఐ తిరిగి సమీక్షిస్తుందని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.

నాది బాధ్యత...
పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్‌ థామస్‌ ఖాతాదారులు, డిపాజిట్‌దారులకు ఓ సందేశం పంపించారు. ‘‘బ్యాంకు ఎండీగా నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఈ అవకతవకలను ఆర్‌బీఐ ఆంక్షల గడువు ముగిసే ఆరు నెలల్లోపే చక్కదిద్దడం జరుగుతుందని డిపాజిట్‌ దారులకు భరోసా ఇస్తున్నాను. అక్రమాలను సరిదిద్దటం ద్వారా ఆంక్షలను తొలగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ ఇది కష్ట కాలమని నాకు తెలుసు. ఏ క్షమాపణ అయినా మీరు పడుతున్న ప్రస్తుత బాధను తొలగించలేకపోవచ్చు’’ అంటూ జాయ్‌ థామస్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

ఖాతాదారుల ఆందోళన
ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పీఎంసీ ఖాతాదారుల్లో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. పలు బ్యాంకు శాఖల వద్ద ఖాతాదారులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ముంబైలోని సియాన్, మరోల్‌ శాఖల వద్ద దర్శనమిచ్చాయి. ముంబైలోని బంధూప్‌లో బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్దకు వందలాది కస్టమర్లు చేరుకున్నారు. తమ డిపాజిట్లను వెనక్కి తీసుకునేందుకు ఎక్కువ మంది బ్యాంకు శాఖలకు తరలివచ్చారు. కానీ, రూ.1,000 మించి తీసుకునేందుకు అనుమతించకపోవడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్‌ ఖాతాదారులు, చిన్న వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, పెన్షనర్లు వీరిలో ఎక్కువగా ఉన్నారు. బ్యాంకు లాకర్లలో ఉన్న వాటిని మాత్రం తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది అనుమతించడం గమనార్హం. వివాహాల వంటి ప్రత్యేక అవసరాల కోసం డిపాజిట్‌ చేసిన వారి పరిస్థితి అయోమయంగా మారింది. ‘‘నా రూ.60 లక్షలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. రెండు రోజుల క్రితమే కొత్తగా రూ.2లక్షలను డిపాజిట్‌ చేశాను. నెల, రెండు నెలలు, ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెప్పారు.

నా డబ్బులను వెనక్కి తీసుకోగలిగితే అది అద్భుతమే’’ అని గత 20 ఏళ్లుగా పీఎంసీ బ్యాంకు ఖాతాదారునిగా ఉన్న 44 ఏళ్ల మారుతి పాటిక్‌ అనే ఖాతాదారుడు తెలిపారు. ఓ ఆటో డ్రైవర్‌ తన రూ.10,000 డిపాజిట్‌ గురించి ఆందోళన చెందితే, మరో చిన్న వ్యాపారస్తుడు బ్యాంకు నుంచి ప్రతీ నెలా జరగాల్సిన రూ.60,000 ఈఎంఐ గురించి ఆందోళన చెందా డు. ఖాతాదారుల ఆందోళన హింసాత్మకం దాల్చకుండా పోలీసులు రక్షణ కలి్పంచారు. మరో యువ మహిళ తన ఖాతా నుంచి రూ.1,000 వెనక్కి తీసుకోగా, మళ్లీ ఆరు నెలల తర్వాతే ఉపసంహరణకు అవకాశం ఉంటుందని చెప్పడం గమనార్హం.  పీఎంసీ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో బ్యాంకు డిపాజిట్‌ దారుల ప్రయోజనాల పరిరక్షణపై అఖిలభారత బ్యాంకు డిపాజిటర్ల అసోసియేషన్‌ ఆందో ళన వ్యక్తం చేసింది. అదే సమయంలో డిపాజిట్ల విలువ హరించుకుపోకుండా ఆర్‌బీఐ వెంటనే పరిరక్షణ చర్యలు చేపట్టడాన్ని స్వాగతించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement