ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)పై తన ఆంక్షలను ఆర్‌బీఐ సడలించింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు లోగడ అవకాశం ఇవ్వగా, తాజాగా ఈ పరిమితిని రూ.10,000కు పెంచింది. దీంతో 60% మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్టయింది. ఎందుకంటే వీరి ఖాతాల్లో బ్యాలెన్స్ రూ. 10,000లోపే ఉంటుంది. వసూలు కాని మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) అధికంగా ఉండడం, నిబంధనల ఉల్లంఘనను గుర్తించడంతో ఆరు నెలల పాటు ఈ బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలను విధిస్తూ మూడు రోజుల క్రితం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రతీ సేవింగ్స్ బ్యాంకు ఖాతా లేదా కరెంటు ఖాతా లేదా మరే ఇతర డిపాజిట్ అకౌంట్ నుంచి రూ.10,000కు మించకుండా ఉపసంహరణకు అనుమతించాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గురువారం నాటి ఆదేశాల్లో పేర్కొంది.
బ్యాంకుపై పోలీసు కేసు
పీఎంసీ బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లకు వ్యతిరేకంగా కొందరు కస్టమర్లు గురువారం ముంబైలోని సియాన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులో ఆరోపించారు. పీఎంసీ బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు మొత్తం 14మంది పేర్లను వారు అందులో పేర్కొన్నారు. వీరిపై తగిన చర్య తీసుకోవాలని, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడం ద్వారా దేశం వీడిపోకుండా చూడాలని కోరారు. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు కొందరి నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని, పరిశీలన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు.
ప్రతీ రూపాయి భద్రమే: జాయ్ థామస్
డిపాజిట్, ఖాతాదారుల ఆందోళనను సస్పెన్షన్‌లో ఉన్న పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్ థామస్ తొలగించే ప్రయత్నం చేశారు. బ్యాంకు వద్ద తగినంత లిక్విడిటీ ఉందని, చెల్లింపు బాధ్య తలను నెరవేర్చగలదన్నారు. కస్టమర్‌కు చెందిన ప్రతీ రూపాయి భద్రంగా ఉన్నట్టు చెప్పారు. పెద్ద ఖాతా అయిన హెచ్‌డీఐఎల్ ఒక్కటే ప్రస్తుత సంక్షోభానికి కారణమని, ఆర్‌బీఐ ఆంక్షలకు దారితీసినట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్‌డీఐఎల్ ఖాతాకు సంబంధించి ఎన్‌పీఏలను తక్కువగా చూపించడమే సమస్యకు కారణమని వివరించారు. ‘‘మేము చూపించినదానికి, వాస్తవ గణాంకాలకు మధ్య అంతరం ఉంది. గత కొంత కాలం హెచ్‌డీఐఎల్ నుంచి చెల్లింపుల్లో జాప్యం నెలకొనడం సమస్యకు దారితీసింది.
హెచ్‌డీఐఎల్ తన ఆస్తులను విక్రయించే విషయంలో పురోగతిలో ఉంది. అందుకే సమస్య నుంచి త్వరలోనే బయటపడతామని చెబుతున్నాం’’అని థామస్ తెలిపారు. అయితే, హెచ్‌డీఐఎల్‌కు ఎంత రుణమిచ్చినదీ వెల్లడించలేదు. ఇతర రుణాలన్నీ పూర్తి సురక్షితంగానే ఉన్నాయని, కస్టమర్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘తగినంత లిక్విడిటీ ఉంది. ప్రతీ రుణానికి సెక్యూరిటీల హామీ ఉంది. కోపరేటివ్ బ్యాంకు అయిన పీఎంసీ అన్‌సెక్యూర్డ్ రుణాలను ఇవ్వడం లేదు’అని థామస్ వివరించారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోకు సంబం ధించి రూ.4,000 కోట్లు ఉన్నట్టు చెప్పారు. ప్రతీ ఖాతా నుంచి విత్‌డ్రా పరిమితిని రూ.15,000కు పెంచాలని ఆర్‌బీఐని కోరినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment