PMC
-
రివైండ్ 2020: ఢామ్.. జూమ్
2020... వస్తూవస్తూనే ‘కరోనా’ సునామీతో ప్రపంచానికి ‘మాస్క్‘ పడింది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజల జీవితాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా చెల్లాచెదురైంది. వివిధ దేశాల ఎకానమీలు మైనస్లలోకి జారిపోయి చరిత్రలో ఎన్నడూచూడని పతనాన్ని చవిచూశాయి. భారత్ జీడీపీ ఏకంగా 23.9 శాతం (క్యూ1లో) క్షీణించింది. కరోనా కల్లోలంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినప్పటికీ.. మళ్లీ అంతేవేగంగా కోలుకొని, ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. సెన్సెక్స్ మార్చిలో 25,638 పాయింట్ల కనిష్టానికి కుప్పకూలి... కొద్ది నెలల్లోనే కొత్త రికార్డులను బద్దలు కొట్టింది. మరోపక్క, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బంగారం భగ్గుమంది. భారత్‌లో తులం ధర రూ.55 వేల పైకి ఎగబాకింది. ముడి చమురు ధర చరిత్రలో తొలిసారిగా మైనస్‌లోకి జారిపోయింది. ఇక కరోనాతో దేశీయంగా పర్యాటకం, విమానయానం తదితర రంగాలు తీవ్రంగా దెబ్బతిని, భారీగా ఉద్యోగాల కోతకు దారితీసింది. అసలే మొండిబాకీలతో నెట్టుకొస్తున్న బ్యాంకింగ్ రంగం పరిస్థితి పెనంమీంచి పొయ్యిలో పడినట్లయింది. పీఎంసీ, లక్ష్మీ విలాస్ బ్యాంకులు కుప్పకూలాయి. లాక్డౌన్ల కారణంగా వాహన రంగంలో ఎన్నడూలేని విధంగా సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. మోదీ సర్కారు ‘ఆత్మనిర్భర్’ రూపంలో దాదాపు రూ. 29 లక్షల కోట్లకు పైగా ప్యాకేజీని ప్రకటించి ఎకానమీకి దన్నుగా నిలిచింది. ఆర్బీఐ కూడా వడ్డీరేట్లను అట్టడుగుకు దించేసింది. ఇంత కల్లోలంలోనూ ముకేశ్ అంబానీ నిధుల స్వారీ చేశారు. ఫేస్బుక్, గూగుల్, ఇంటెల్ ఇలా ఒకటేమిటి ప్రపంచాన్ని శాసిస్తున్న అనేక దిగ్గజ కంపెనీలన్నీ రిలయన్స్ జియో, రిటైల్‌లలో కోట్లాది డాలర్లు కుమ్మరించేందుకు క్యూ కట్టడం విశేషం. కరోనా పుణ్యమా అని సామాన్యుల నుంచి కార్పొరేట్ల దాకా అంతా డిజిటల్ బాట పట్టారు. వర్చువల్, ఆన్లైన్ అనేవి జీవితంలో భాగమైపోయాయి. ఇలా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగిన ఈ ‘కరోనా’నామ సంవత్సరంలో వ్యాపార రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై ‘సాక్షి బిజినెస్’ రివైండ్ ఇది... మార్కెట్ ఉద్దీపనల అండ! ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ ప్రయాణం కరోనా విసిరిన సవాళ్లను అధిగమించి కొత్త శిఖరాల అధిరోహణ లక్ష్యంగా సాగింది. ఏడాది ప్రారంభంలో ఆర్థిక మందగమనం, కోవిడ్ భయాలతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 24న రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ద్వితీయార్థంలో ఉద్దీపనల అండ, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కోవిడ్–19 వ్యాక్సిన్ ఆశలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సహకారం అందడంతో రికార్డుల ర్యాలీ చేస్తున్నాయి. మరోవైపు కోవిడ్–19 వైరస్.... స్ట్రెయిన్ వైరస్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలను భయపెడుతుండటం ఈక్విటీ మార్కెట్లకు ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది మొత్తం మీద సెన్సెక్స్ 6492 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 1814 పాయింట్లను ఆర్జించింది. లాక్డౌన్ విధింపు ప్రకటనతో మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాలంలోనే అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఇరు సూచీలు 10 శాతం పతనమవడంతో సర్క్యూట్ నిబంధల ప్రకారం ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపేశారు. తర్వాత ట్రేడింగ్ ప్రారంభమైనా అమ్మకాలు ఆగకపోవడంతో సెన్సెక్స్ 3,935 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్ల నష్టంతో ముగిశాయి. ఇక ఏప్రిల్ 7న సూచీలు ఒక్కరోజులో రికార్డు లాభాల్ని ఆర్జించాయి. ఈ ఒక్కరోజే సెన్సెక్స్ 2,476 పాయింట్లు, నిఫ్టీ 1,135 పాయింట్లను ఆర్జించాయి. సూచీ ఏడాది కనిష్టస్థాయి ఏడాది గరిష్టస్థాయి సెన్సెక్స్ 25,638 (మార్చి 24న) 47,807(డిసెంబర్ 30) నిఫ్టీ 7511 (మార్చి 24న) 13,997(డిసెంబర్ 30) ఎకానమీ మాంద్యం కోరలు... భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ గట్టి దెబ్బ కొట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లోకి వెళ్లింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు సడలింపుసహా ఎకానమీ కోలుకునేందుకు కేంద్రం, ఆర్బీఐలు తీసుకున్న ఉద్దీపన చర్యలతో రెండో త్రైమాసికానికి వ్యవస్థ కాస్త రికవరీని సాధించింది. క్షీణత మైనస్ 7.5 శాతానికి పరిమితమైంది. కేంద్రం అండ ఆత్మ నిర్భర్ అభియాన్ కరోనా కుదేలైన ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు భరోసానిస్తూ కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా అభయమిచ్చింది. కోవిడ్ సంక్షోభం నాటి నుంచి ఈ ఏడాదిలో కేంద్రం, ఆర్బీఐలు సంయుక్తంగా మొత్తం రూ.29.87 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాయి. జీడీపీలో 10 శాతం ఉంటుందని అంచనా. ల్యాండ్, లేబర్æ, లిక్విడిటీ, లా వీటిపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సూక్ష్మ, స్థూల, మధ్య తరగతి పరిశ్రమకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయడంలాంటి ఎన్నో బృహత్కర కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. బ్యాంకింగ్ కుదుపులు యస్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంకు, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్(పీఎంసీ) ఉదంతాలతో ఈ ఏడాది భారత బ్యాంకింగ్ రంగం భారీగా కుదుపులకు లోనైంది. లక్ష్మీవిలాస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో సింగపూర్‌కు చెందిన డీబీఎస్ బ్యాంకులో విలీనమైంది. హెచ్‌డీఐఎల్‌కు రుణాలను జారీ చేయడంలో అక్రమాలకు తెరతీయడంతో మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ ఆర్బీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే నిరర్థక ఆస్తులు పెరిగిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోయిన యస్ బ్యాంక్‌ను రక్షించేందుకు ఆర్బీఐ ఆ బ్యాంక్‌లోని 49 శాతం షేర్లను ‘ఎస్బీఐ’ చేత కొనుగోలు చేయించింది. ఇక బ్యాంకింగ్‌లో మొండి బకాయిల తీవ్రత కొనసాగుతోంది. ఆర్బీఐ పాలసీ భరోసా కరోనాతో కష్టాలపాలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఈ ఏడాదిలో ఆర్బీఐ ద్రవ్యపాలసీ కమిటీ వడ్డీరేట్లను గణనీయంగా తగ్గించింది. రెపోరేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4 శాతానికి పరిమితం చేసింది. అలాగే రివర్స్ రెపోరేటు 155 పాయింట్లను తగ్గించి 4.9 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ప్రతి ద్రవ్యపాలసీ సమీక్షలో సులభతరమైన విధానానికి కట్టుబడి ఉంటామని, ద్రవ్యోల్బణం దిగివస్తే, వడ్డీరేట్లపై మరింత కోత విధించేందుకు వెనకాడబోమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దన్నుగా నిలుస్తున్నాయి. విమానయానం కుదేలు కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో దేశీయ విమానయాన రంగం పూర్తిగా డీలాపడింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్రం మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. మార్చి 25 నుంచి దేశీయ విమానాలపై ఆంక్షలను విధించింది. సర్వీసులన్నీ ఒక్కసారి స్తంభించిపోవడంతో విమానయాన కంపెనీలకు పైసా ఆదాయం లేకుండా పోయింది. పైపెచ్చు ఆకస్మిక నిర్ణయంతో విమానయాన సంస్థలు ప్రయాణికులు బుక్ చేసుకున్న ముందస్తు టికెట్ల సొమ్మును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. దీంతో దేశీయ విమాన కంపెనీలు దివాలా దిశగా ప్రయాణించాయి. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా దేశీయ విమాన సర్వీసుల పునరుద్ధరణకు మే 25న అనుమతులు లభించాయి. అలాగే జూలై నుంచి ఆయా దేశాలతో పరస్పర ఒప్పందంతో కొన్ని దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. అయితే విమానయాన కంపెనీలకు అధిక ఆదాయాలను ఇచ్చే అంతర్జాతీయ సర్వీసులపైన ఆంక్షల పర్వం కొనసాగుతోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ రాకతో అన్ని సర్వీసులు పునరుద్ధరణ జరిగి విమానయాన రంగం తిరిగి గాడిలో పడుతుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆటోమొబైల్ కరోనా బ్రేకులు ఈ 2020 ఏడాదిలో ఆటో మొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. చరిత్రలోనే తొలిసారి ఒక నెల ఆటో అమ్మకాలు సున్నాగా నమోదయ్యాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఉత్పత్తి పూర్తిగా స్తంభించడం, విక్రయాలకు బ్రేక్‌పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఉద్దీపన ప్యాకేజీలో ఆటో పరిశ్రమకు పెద్దపీట వేయడం, భారత్‌లో ఉత్పాదక సామర్థ్యాలను, ఎగుమతులను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకంలో ఎక్కువగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమకు గరిష్టంగా రూ.57,042 కోట్ల ప్రోత్సాహకాలు లభించనుండటంతో చివరి రెండు క్వార్టర్ల నుంచి ఆటోపరిశ్రమ వీ–ఆకారపు రికవరీని సాధిస్తోంది. రికవరీ స్పీడ్‌పై ఈ రంగం ఆధారపడి ఉంది. ఫోన్లు స్మార్ట్...స్మార్ట్ స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ 2020 ఏడాది కలిసొచ్చింది. ఏడాది ప్రథమార్ధంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఆశించినస్థాయిలో నమోదుకాలేదు. అయితే చివరి రెండు క్వార్టర్ల నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 15 కోట్లను దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరిహద్దు వివాదాలు, కరోనా వైరస్ సృష్టికి కారణమైందనే వాదనల నేపథ్యంలో చైనా ఫోన్లపై బ్యాన్ నినాదంతో దేశంలో మొదటిసారి చైనా ఫోన్ల అమ్మకాలు రెండోస్థానానికి దిగివచ్చాయి. దీంతో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ అమ్మకాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్ అప్పు లేదు కరోనాతో ఎకానమీ కకావికలమైన తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ ఏడాదిలో వరుస పెట్టుబడులతో కలకలలాడింది. గూగుల్, ఫేస్బుక్, సిల్వర్‌లేక్ వంటి దిగ్గజ కంపెనీలకు జియో ప్లాట్ఫామ్లో 33 శాతం వాటాను విక్రయించి రూ.1.52 లక్షల కోట్లను చేకూర్చుకుంది. అలాగే రైట్స్ ఇష్యూ చేపట్టి అదనంగా రూ.53 వేల కోట్లను సమీకరించింది. తన మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌నూ 10 శాతం వాటాను విక్రయించి రూ.47 వేల కోట్లను సమకూర్చుకుంది. వాటా విక్రయాలు, ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులతో ఆర్ఐఎల్ రుణ రహిత కంపెనీగా అవతరించింది. కంపెనీలోకి వెల్లువలా పెట్టుబడులు రావడంతో కంపెనీ షేరు సైతం ఈ 2020లో 35 శాతం ర్యాలీ చేసింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ 16న రూ.2,369 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి ఒడిదుడుకులు భారత ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో వెల్లువెత్తినా ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి బలపడలేకపోయింది. స్టాక్ మార్కెట్ పతనం వేళలో ఆర్బీఐ స్పాట్ మార్కెట్ నుంచి అధిక మొత్తంలో డాలర్లను కొనుగోలు చేయడంతో రూపాయి విలువ బలహీనపడిందని అంచనా. అలాగే కరోనాతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది డాలర్ మారకంలో రూపాయి విలువ గరిష్ట స్థాయి 70.73 గానూ, కనిష్ట స్థాయి 76.92 గానూ నమోదైంది. వెరసి ఈ ఏడాదిలో రూపాయి విలువ 6 రూపాయల రేంజ్లో కదలాడింది. క్రూడాయిల్ మైనస్‌లోకి ఈ ఏడాది క్రూడాయిల్ ధరలు ఏకంగా మైనస్‌ల్లోకి వెళ్లిన సంఘటన జరిగింది. ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో క్రూడాయిల్‌కు డిమాండ్ అంతంతగానే ఉంది. మరోవైపు చమురు ధరలపై ఆధిపత్యం కోసం సౌదీ– రష్యా దేశాలు ఒప్పంద పరిమితికి మించి క్రూడాయిల్ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు క్రూడాయిల్ ధరలపై విరుచుకుపడింది. ఫలితంగా ఏప్రిల్ 21న నైమెక్స్ లైట్ స్వీట్ క్రూడ్ మే నెల ఫ్యూచర్ కాంట్రాక్ట్ బ్యారెల్ ధర తొలిసారి మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఒక దశలో మైనస్ 40.32 డాలర్లకు చేరుకుంది. చివరికి 208 డాలర్లు నష్టపోయి మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం @ రూ. 56,190 కరోనా వైరస్‌తో స్టాక్ మార్కెట్లు కుదేలవడం ఈ ఏడాది పసిడి ర్యాలీకి కలిసొచ్చింది. కోవిడ్–19 సంక్షోభ వేళ ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనమైన బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపారు. అలాగే ఆర్థికంగా చిన్నాభిన్నమైన వ్యవస్థను సరిదిద్దేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు సులభతర వడ్డీరేట్ల విధానానికి తెరతీయడం కూడా బంగారం ర్యాలీకి కలిసొచ్చింది. ప్రపంచమార్కెట్లో ఆగస్ట్ 7న ఔన్స్ పసిడి ధర అత్యధికంగా 2,089 డాలర్ల స్థాయిని అందుకుంది. ఇదే ఆగస్ట్ 8న దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.56,190 చేరుకుంది. మొత్తంగా పసిడి ధరలు ఏడాదిలో 20 శాతం పెరిగాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రాక, ఆర్థిక వ్యవస్థ పురోగతి నేపథ్యంలో బంగారం ధరలు ఏడాది ముగింపు సమయానికి కొంత దిగివచ్చాయి. వచ్చే ఏడాదిలో పసిడి నుంచి పెద్ద ర్యాలీ ఆశించకపోవడం మంచిదని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
పీఎంసీ బ్యాంకుపై ఆంక్షల సడలింపు
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)పై తన ఆంక్షలను ఆర్బీఐ సడలించింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు లోగడ అవకాశం ఇవ్వగా, తాజాగా ఈ పరిమితిని రూ.10,000కు పెంచింది. దీంతో 60% మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్టయింది. ఎందుకంటే వీరి ఖాతాల్లో బ్యాలెన్స్ రూ. 10,000లోపే ఉంటుంది. వసూలు కాని మొండి బకాయిలు (ఎన్పీఏలు) అధికంగా ఉండడం, నిబంధనల ఉల్లంఘనను గుర్తించడంతో ఆరు నెలల పాటు ఈ బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలను విధిస్తూ మూడు రోజుల క్రితం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రతీ సేవింగ్స్ బ్యాంకు ఖాతా లేదా కరెంటు ఖాతా లేదా మరే ఇతర డిపాజిట్ అకౌంట్ నుంచి రూ.10,000కు మించకుండా ఉపసంహరణకు అనుమతించాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ గురువారం నాటి ఆదేశాల్లో పేర్కొంది. బ్యాంకుపై పోలీసు కేసు పీఎంసీ బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లకు వ్యతిరేకంగా కొందరు కస్టమర్లు గురువారం ముంబైలోని సియాన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులో ఆరోపించారు. పీఎంసీ బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు మొత్తం 14మంది పేర్లను వారు అందులో పేర్కొన్నారు. వీరిపై తగిన చర్య తీసుకోవాలని, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడం ద్వారా దేశం వీడిపోకుండా చూడాలని కోరారు. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు కొందరి నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని, పరిశీలన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు. ప్రతీ రూపాయి భద్రమే: జాయ్ థామస్ డిపాజిట్, ఖాతాదారుల ఆందోళనను సస్పెన్షన్‌లో ఉన్న పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్ థామస్ తొలగించే ప్రయత్నం చేశారు. బ్యాంకు వద్ద తగినంత లిక్విడిటీ ఉందని, చెల్లింపు బాధ్య తలను నెరవేర్చగలదన్నారు. కస్టమర్‌కు చెందిన ప్రతీ రూపాయి భద్రంగా ఉన్నట్టు చెప్పారు. పెద్ద ఖాతా అయిన హెచ్‌డీఐఎల్ ఒక్కటే ప్రస్తుత సంక్షోభానికి కారణమని, ఆర్బీఐ ఆంక్షలకు దారితీసినట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్‌డీఐఎల్ ఖాతాకు సంబంధించి ఎన్పీఏలను తక్కువగా చూపించడమే సమస్యకు కారణమని వివరించారు. ‘‘మేము చూపించినదానికి, వాస్తవ గణాంకాలకు మధ్య అంతరం ఉంది. గత కొంత కాలం హెచ్‌డీఐఎల్ నుంచి చెల్లింపుల్లో జాప్యం నెలకొనడం సమస్యకు దారితీసింది. హెచ్‌డీఐఎల్ తన ఆస్తులను విక్రయించే విషయంలో పురోగతిలో ఉంది. అందుకే సమస్య నుంచి త్వరలోనే బయటపడతామని చెబుతున్నాం’’అని థామస్ తెలిపారు. అయితే, హెచ్‌డీఐఎల్‌కు ఎంత రుణమిచ్చినదీ వెల్లడించలేదు. ఇతర రుణాలన్నీ పూర్తి సురక్షితంగానే ఉన్నాయని, కస్టమర్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘తగినంత లిక్విడిటీ ఉంది. ప్రతీ రుణానికి సెక్యూరిటీల హామీ ఉంది. కోపరేటివ్ బ్యాంకు అయిన పీఎంసీ అన్సెక్యూర్డ్ రుణాలను ఇవ్వడం లేదు’అని థామస్ వివరించారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోకు సంబం ధించి రూ.4,000 కోట్లు ఉన్నట్టు చెప్పారు. ప్రతీ ఖాతా నుంచి విత్‌డ్రా పరిమితిని రూ.15,000కు పెంచాలని ఆర్బీఐని కోరినట్టు వెల్లడించారు. -
నవంబరులో పెళ్లి : రూ.1000తో ఎలా?
సాక్షి, ముబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీంఎంసీ) సంక్షోభంపై ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని బ్యాంకు ఎండీ జాయ్ థామస్ హామీ ఇచ్చినప్పటికీ వినియోగదారుల ఆందోళన కొనసాగుతోంది. బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆరునెలల ఆంక్షలు ఖాతాదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) తక్కువగా చూపించడంతోపాటు పీఎంసీలో ఎన్నో నిబంధనల ఉల్లంఘనను ఆర్బీఐ గుర్తించి ఒక్కో కస్టమర్ కేవలం రూ.1,000 మాత్రమే (సేవింగ్స్/కరెంటు/డిపాజిట్ ఖాతా) అంటూ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయా ఖాతాలనుంచి వెయ్యి రూపాయలకు మించి నగదు పొందలేరన్న ఆర్బీఐ నిబంధన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముంబైలోని పీఎంసీ బ్యాంకు కార్యాలయం ముందు కస్టమర్లు గురువారం ఆందోళనకు దిగారు. గత 20 ఏళ్లుగా ఈ బ్యాంకులో ఖాతానుకొనసాగిస్తున్నానని గురు చరణ్‌సింగ్ తల్వార్ అనే ఖాతాదారుడు వాపోయాడు. బిడ్డ పెళ్లి కోసమని డబ్బులు కూడబెట్టాను. నవంబరులో పెళ్లి నిశ్చయించుకున్నాం. ఇపుడీ వెయ్యి రూపాయలతో ఎలా మేనేజ్ చేయలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ. నెలకు రూ. 5 వేలు సంపాదించుకునే మహిళ, ఏం జరుగుతోందో అర్థంకాక కన్నీరు మున్నీరయ్యారు. Heart breaking.. She earns 5000 per month.. One lakh might be her life long savings.. pic.twitter.com/pOkfmlkZD7 — Renjith Thomas (@TowardsLiberti) September 25, 2019 మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన హెచ్‌డీఐఎల్, పీఎంసీ బ్యాంకు మేనేజ్మెంట్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు సంజయ్‌నిరుపమ్, మరో బీజేపీ నేత డిమాండ్ చేశారు. అలాగే నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు. వెయ్యి లక్షరూపాయలకు లిమిట్‌ను పెంచాల్సిందిగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ను కోరినట్టు బీజేపీ నేత తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ పీఎంసీ కుంభకోణంతో బీజేపీనుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే సర్దార్ తారా సింగ్ కుమారుడు, బ్యాంకు కో డైరెక్టర్లలో ఒకరైన రజనీత్ సింగ్‌కు సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని ఆయన కొట్టి పారేశాడు. గత 13ఏళ్లనుంచి మూడవసారి డైరెక్టర్‌గా కొనసాగుతున్నానని, బ్యాంకునకు సంబంధించిన రోజువారీ కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం ఉండవని వివరణ ఇచ్చారు. విత్ డ్రా పరిమితిని పెంచాల్సిందిగా ఆర్బీఐని కోరినట్టు తెలిపారు. చదవండి : పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ కొరడా! చదవండి : ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్ -
పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ కొరడా!
ముంబై: ముంబై కేంద్రంగా, పలు రాష్ట్రాల్లోని పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహించే.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) తక్కువగా చూపించడంతోపాటు పీఎంసీలో ఎన్నో నిబంధనల ఉల్లంఘనను ఆర్బీఐ గుర్తించి ఈ చర్యలకు దిగింది. వచ్చే ఆరు నెలల పాటు ఒక్కో కస్టమర్ కేవలం రూ.1,000 మాత్రమే తన ఖాతా నుంచి (సేవింగ్స్/కరెంటు/డిపాజిట్ ఖాతా) ఉపసంహరించుకోవడానికి(విత్‌డ్రా) అనుమతిం చింది. తన అనుమతి లేకుండా కొత్తగా రుణాలను మంజూరు చేయడం కానీ, ప్రస్తుత రుణాలను పునరుద్ధరించడం కాని చేయరాదని ఆంక్షలు పెట్టింది. అలాగే, కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా, ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించకుండా, తన ఆస్తులను విక్రయించకుండా ఆర్బీఐ నిషేధించింది. ప్రస్తుత బోర్డును ఆర్బీఐ రద్దు చేయడంతోపాటు తన అధికారుల బృందంతో మంగళవారం నుంచి బ్యాంకు పుస్తకాల తనిఖీని కూడా చేపట్టింది. తన చర్యలను బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడంగా పరిగణించొద్దని ఆర్బీఐ కోరింది. ఎన్పీఏలు డబుల్ డిజిట్ స్థాయిలో ఉన్నా కానీ, పీఎంసీ చాలా తక్కువగా వాటిని చూపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంటుంది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో... పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షల వెనుక ప్రధాన కారణం బ్యాంకు పుస్తకాల్లో ఎన్పీఏలు అధికంగా ఉండడం వల్లేనని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల ద్వారా తెలుస్తోంది. బ్యాంకు యాజమాన్యమే పుస్తకాల ప్రక్షాళనకు ముందుకు వచ్చిందని, దీంతో బ్యాంకు కార్యకలాపాలు సాఫీగా నడిచేందుకు ఆర్బీఐ ఆంక్షలను విధించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసిన ఆరి్థక సంవత్సరంలో పీఎంసీ నికర లాభం కేవలం 1.20 శాతమే తగ్గి రూ.99.69 కోట్లుగా ఉంది. నికర ఎన్పీఏలు మాత్రం మొత్తం రుణాల్లో 1.05 శాతం నుంచి 2.19 శాతానికి పెరిగాయి. స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 3.76 శాతంగా ఉన్నాయి. ఇది అధికారికంగా చూపించింది. కానీ, ఇంతకంటే ఎక్కువే ఎన్పీఏలు ఉన్నాయన్నది తాజా సమాచారం. పట్టణ కోఆపరేటివ్ బ్యాంకు అయిన పీఎంసీ వద్ద 2019 మార్చి నాటికి రూ.11,167 కోట్ల ప్రజల డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకు మంజూరు చేసిన రుణాలు రూ.8,383.33 కోట్లు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణాల్లో మొత్తం 137 శాఖలు ఈ బ్యాంకు పరిధిలో ఉన్నాయి. పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలను ఆరు నెలల తర్వాత ఆర్బీఐ తిరిగి సమీక్షిస్తుందని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. నాది బాధ్యత... పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్ థామస్ ఖాతాదారులు, డిపాజిట్‌దారులకు ఓ సందేశం పంపించారు. ‘‘బ్యాంకు ఎండీగా నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఈ అవకతవకలను ఆర్బీఐ ఆంక్షల గడువు ముగిసే ఆరు నెలల్లోపే చక్కదిద్దడం జరుగుతుందని డిపాజిట్ దారులకు భరోసా ఇస్తున్నాను. అక్రమాలను సరిదిద్దటం ద్వారా ఆంక్షలను తొలగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ ఇది కష్ట కాలమని నాకు తెలుసు. ఏ క్షమాపణ అయినా మీరు పడుతున్న ప్రస్తుత బాధను తొలగించలేకపోవచ్చు’’ అంటూ జాయ్ థామస్ తన సందేశంలో పేర్కొన్నారు. ఖాతాదారుల ఆందోళన ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పీఎంసీ ఖాతాదారుల్లో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. పలు బ్యాంకు శాఖల వద్ద ఖాతాదారులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ముంబైలోని సియాన్, మరోల్ శాఖల వద్ద దర్శనమిచ్చాయి. ముంబైలోని బంధూప్‌లో బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్దకు వందలాది కస్టమర్లు చేరుకున్నారు. తమ డిపాజిట్లను వెనక్కి తీసుకునేందుకు ఎక్కువ మంది బ్యాంకు శాఖలకు తరలివచ్చారు. కానీ, రూ.1,000 మించి తీసుకునేందుకు అనుమతించకపోవడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఖాతాదారులు, చిన్న వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, పెన్షనర్లు వీరిలో ఎక్కువగా ఉన్నారు. బ్యాంకు లాకర్లలో ఉన్న వాటిని మాత్రం తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది అనుమతించడం గమనార్హం. వివాహాల వంటి ప్రత్యేక అవసరాల కోసం డిపాజిట్ చేసిన వారి పరిస్థితి అయోమయంగా మారింది. ‘‘నా రూ.60 లక్షలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. రెండు రోజుల క్రితమే కొత్తగా రూ.2లక్షలను డిపాజిట్ చేశాను. నెల, రెండు నెలలు, ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెప్పారు. నా డబ్బులను వెనక్కి తీసుకోగలిగితే అది అద్భుతమే’’ అని గత 20 ఏళ్లుగా పీఎంసీ బ్యాంకు ఖాతాదారునిగా ఉన్న 44 ఏళ్ల మారుతి పాటిక్ అనే ఖాతాదారుడు తెలిపారు. ఓ ఆటో డ్రైవర్ తన రూ.10,000 డిపాజిట్ గురించి ఆందోళన చెందితే, మరో చిన్న వ్యాపారస్తుడు బ్యాంకు నుంచి ప్రతీ నెలా జరగాల్సిన రూ.60,000 ఈఎంఐ గురించి ఆందోళన చెందా డు. ఖాతాదారుల ఆందోళన హింసాత్మకం దాల్చకుండా పోలీసులు రక్షణ కలి్పంచారు. మరో యువ మహిళ తన ఖాతా నుంచి రూ.1,000 వెనక్కి తీసుకోగా, మళ్లీ ఆరు నెలల తర్వాతే ఉపసంహరణకు అవకాశం ఉంటుందని చెప్పడం గమనార్హం. పీఎంసీ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో బ్యాంకు డిపాజిట్ దారుల ప్రయోజనాల పరిరక్షణపై అఖిలభారత బ్యాంకు డిపాజిటర్ల అసోసియేషన్ ఆందో ళన వ్యక్తం చేసింది. అదే సమయంలో డిపాజిట్ల విలువ హరించుకుపోకుండా ఆర్బీఐ వెంటనే పరిరక్షణ చర్యలు చేపట్టడాన్ని స్వాగతించింది. -
పీఎంసీకి రికార్డు స్థాయిలో రాబడి
పింప్రి, న్యూస్‌లైన్: వివిధ పన్నుల రూపంలో పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి రికార్డుస్థాయిలో రాబడి వచ్చింది. గత నాలుగేళ్ల కాలంలో మొత్తం రూ.196 కోట్ల ఆదాయం వచ్చింది. 2009-10లో రూ.11.15 లక్షలు, 2010-11లో రూ.62.83, అదేవిధంగా 2011-12 మధ్యకాలంలో రూ.72 లక్షలు, 2012-13లో ఇప్పటిదాకా రూ.45.38 లక్షలు వసూల య్యాయి. ఇదిలా వుండగా పుణే నగర విస్తీర్ణం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీని పరిధిలో ఉద్యో గ, వాణిజ్య నగర ప్రజల ఆవాసాలుకూడా బాగా పెరిగాయి. దీంతో 2009 నుంచి కార్పొరేషన్ క్యాపిటేషన్ ఫీజును వసూలు చేస్తోంది. ఇందులో ఫైర్ సెస్, భవన నిర్మాణ, వాణిజ్య, ఉద్యోగ రంగాల వారికి నిరభ్యంతర పత్రాలు, ఫైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చార్జీలు, అగ్నిమాపక సేవాపన్ను తదితరాలను వసూలు చేస్తోంది. ఈ పన్నులన్నింటినీ కార్పొరేషన్ స్థాయీసమితి పన్నుల విభాగం నిర్ణయిస్తుంది. పల్లకీ మార్గాల్లో స్థలసేకరణ సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం పల్లకీలు వెళ్లే మార్గాల్లో భక్తులకు వసతి కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నడుంబిగించింది. ఇందులోభాగంగా ఆయా మార్గాల్లో స్థలసేకరణ దిశగా అడుగు లు వేస్తోంది. ఈ ప్రతిపాదన గత కొద్దిసంవత్సరాలుగా చర్చలకే పరిమితమైన సంగతి విదితమే. స్థలసేకరణకు సంబంధించి డివిజినల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇటీవల ఓ సమావేశం కూడా జరిగిం ది. స్థలసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ సమావేశంలో సంబంధిత అధికారులు నిర్ణయించారు. పల్లకీలను రాత్రిపూట ఆపే ప్రాంతాల్లో వర్కారీ భక్తులు స్నానాదులు ముగించుకుని నిద్రకు ఉపక్రమించేందుకు అనువుగా బసలను నిర్మించనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. స్థలసేకరణ తర్వాత అక్కడ అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరగకుండా అడ్డుకునేందుకు వాటిచుట్టూ కంచెలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాలోని దేహులో బహిరంగ మరుగుదొడ్లను కూడా నిర్మించాలని నిర్ణయించింది. నిధుల కేటాయింపు దేహు, అలండి, పండరీపూర్లలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 750 కోట్ల నిధులను కేటాయించింది. అదేవిధంగా దేహులో మరుగుదొడ్ల నిర్మాణానికికూడా అనుమతి ఇచ్చింది. దేహుతోపాటు అలండి, పండరీపూర్లలోనూ త్వరలో వీటిని నిర్మించనున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో రహదారులను సైతం అభివృద్ధి చేయనున్నారు. -
ఇకపై పుణేలో రెండు పూటలా నీటి సరఫరా
పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగర ప్రజలకు శుభవార్త. ఇకపై రెండుపూటలా నీటిని సరఫరా చేయాలని పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నిర్ణయిచింది. ఇందుకు కారణం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లు నిండిపోవడమే. కొరత సమస్య కారణంగా పీఎంసీ ప్రస్తుతం నగర వాసులకు రోజుకు ఒక్కసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొరత సమస్యను అధిగమించేవిధంగా చేశాయి. ఆగస్టు, సెప్టెంబర్లలో రెండు నెలలపాటు ఉదయం, సాయంత్రం మంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించామని, ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగే నీటి పారుదల విభాగం సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పీఎంసీ ఇంజనీర్ ప్రశాంత్ వాఘ్మారే తెలిపారు. కాగా కత్రజ్, జాంబుల్వాడి, ధనకావాడి, అప్పర్ ఇందిరానగర్, భారతీ విద్యాపీఠ్, కన్హే, ఆంబేగావ్ పఠార్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో రోజుకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతాలకు రెండు పూటలా నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిదిన నీటి సరఫరా బంద్ రావేత్లోని నీటి సరఫరా కేంద్రంలో విద్యుద్దీకరణ పనులు చేపడుతుండడంతో వాఘోళి పరిసర ప్రాంతాలకు గురువారం నీటి సరఫరా నిలిపివేయనున్నారు. అయితే శుక్రవారం తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా చేస్తామని నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు వెల్లడించారు. క్రమబద్ధీకరణ దిశగా... తన పరిధిలోని అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించే దిశగా పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందించింది. నగరంలో దాదాపు పదివేల అక్రమ కనెక్షన్లు ఉన్నట్టు అధికారుల అధ్యయనంలో తేలింది. వాస్తవానికి అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పీసీఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆమ్నెస్టీ అనే ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకానికి నగరవాసులనుంచి ఆశించినమేర స్పందన రాలేదు. కేవలం 900 మంది మాత్రమే తమ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకున్నారు. క్రమబద్ధీకరణ ఫీజును రెట్టింపు చేయడంతో అనేకమంది వెనక్కితగ్గారు. ఇదిలాఉండగా పీసీఎంసీకి 80 కోట్ల మేర నీటిబకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసుకునేందుకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఈ విషయమై పీసీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రవీణ్ లడ్కత్ మాట్లాడుతూ బకాయిదారులకు మరో అవకాశమిస్తామన్నారు. ఇక అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ కోసం గతంలో ప్రవేశపెట్టిన ఆమ్నెస్టీ పథకంలో ప్రస్తుతం కొన్నిమార్పులుచేర్పులు చేశామన్నారు. అక్రమ కనెక్షన్లు ఉన్నవారు అక్టోబర్, 30వ తేదీలోగా క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఆలోగా కొత్త కనెక్షన్లను అమర్చుకోవాలన్నారు. రాబడి పెంపునకు చర్యలు రాబడి పెంపుదిశగా పీసీఎంసీ అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల పన్ను (ఎల్బీటీ) అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు రూ. 150 కోట్ల మేర నష్టపోయిన కార్పొరేషన్ ఆస్తి పన్ను, నీటి పన్ను, భవన నిర్మాణ అనుమతుల విభాగాల రాబడి పెంచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పీసీఎంసీ కమిషనర్ శ్రీకర్ పరదేశి చెప్పారు. ఇప్పటిదాకా పన్ను చెల్లించని భవనాలను గుర్తించి, వాటి యజమానుల వద్ద వార్షిక పన్ను వసూలు చేస్తామన్నారు. ఇటువంటివి రెండు లక్షల భవనాలు ఉండొచ్చని తాము అంచనా వేస్తున్నామన్నారు. వీరందరి వద్ద పన్ను వసూలు చేస్తామన్నారు. తద్వారా రాబడి లోటును పూడుస్తామన్నారు. 2013-14 తొలిత్రైమాసికంలో ఎల్బీటీ కింద రూ. 221.78 కోట్లు వసూలయ్యాయన్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో అప్పట్లో అమలులో ఉన్న ఆక్ట్రాయ్ కింద రూ. 293 కోట్లు వసూలయ్యాయని ఆయన వివరించారు.