పింప్రి, న్యూస్‌లైన్: పుణే నగర ప్రజలకు శుభవార్త. ఇకపై రెండుపూటలా నీటిని సరఫరా చేయాలని పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) నిర్ణయిచింది. ఇందుకు కారణం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లు నిండిపోవడమే. కొరత సమస్య కారణంగా పీఎంసీ ప్రస్తుతం నగర వాసులకు రోజుకు ఒక్కసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తోంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొరత సమస్యను అధిగమించేవిధంగా చేశాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లలో రెండు నెలలపాటు ఉదయం, సాయంత్రం మంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయించామని, ఆ తర్వాత అక్టోబర్‌లో జరిగే నీటి పారుదల విభాగం సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పీఎంసీ ఇంజనీర్ ప్రశాంత్ వాఘ్మారే తెలిపారు. కాగా కత్రజ్, జాంబుల్‌వాడి, ధనకావాడి, అప్పర్ ఇందిరానగర్, భారతీ విద్యాపీఠ్, కన్హే, ఆంబేగావ్ పఠార్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో రోజుకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతాలకు రెండు పూటలా నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఎనిమిదిన నీటి సరఫరా బంద్
రావేత్‌లోని నీటి సరఫరా కేంద్రంలో విద్యుద్దీకరణ పనులు చేపడుతుండడంతో వాఘోళి పరిసర ప్రాంతాలకు గురువారం నీటి సరఫరా నిలిపివేయనున్నారు. అయితే శుక్రవారం తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా చేస్తామని నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు వెల్లడించారు.
క్రమబద్ధీకరణ దిశగా...
తన పరిధిలోని అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించే దిశగా పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (పీసీఎంసీ) అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందించింది. నగరంలో దాదాపు పదివేల అక్రమ కనెక్షన్లు ఉన్నట్టు అధికారుల అధ్యయనంలో తేలింది. వాస్తవానికి అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పీసీఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆమ్నెస్టీ అనే ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకానికి నగరవాసులనుంచి ఆశించినమేర స్పందన రాలేదు. కేవలం 900 మంది మాత్రమే తమ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకున్నారు. క్రమబద్ధీకరణ ఫీజును రెట్టింపు చేయడంతో అనేకమంది వెనక్కితగ్గారు.
ఇదిలాఉండగా పీసీఎంసీకి 80 కోట్ల మేర నీటిబకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసుకునేందుకు కార్పొరేషన్ సన్నద్ధమవుతోంది. ఈ విషయమై పీసీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రవీణ్ లడ్కత్ మాట్లాడుతూ బకాయిదారులకు మరో అవకాశమిస్తామన్నారు. ఇక అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ కోసం గతంలో ప్రవేశపెట్టిన ఆమ్నెస్టీ పథకంలో ప్రస్తుతం కొన్నిమార్పులుచేర్పులు చేశామన్నారు. అక్రమ కనెక్షన్లు ఉన్నవారు అక్టోబర్, 30వ తేదీలోగా క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఆలోగా కొత్త కనెక్షన్లను అమర్చుకోవాలన్నారు.
రాబడి పెంపునకు చర్యలు
రాబడి పెంపుదిశగా పీసీఎంసీ అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల పన్ను (ఎల్‌బీటీ) అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు రూ. 150 కోట్ల మేర నష్టపోయిన కార్పొరేషన్ ఆస్తి పన్ను, నీటి పన్ను, భవన నిర్మాణ అనుమతుల విభాగాల రాబడి పెంచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పీసీఎంసీ కమిషనర్ శ్రీకర్ పరదేశి చెప్పారు. ఇప్పటిదాకా పన్ను చెల్లించని భవనాలను గుర్తించి, వాటి యజమానుల వద్ద వార్షిక పన్ను వసూలు చేస్తామన్నారు. ఇటువంటివి రెండు లక్షల భవనాలు ఉండొచ్చని తాము అంచనా వేస్తున్నామన్నారు. వీరందరి వద్ద పన్ను వసూలు చేస్తామన్నారు. తద్వారా రాబడి లోటును పూడుస్తామన్నారు.
2013-14 తొలిత్రైమాసికంలో ఎల్‌బీటీ కింద రూ. 221.78 కోట్లు వసూలయ్యాయన్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో అప్పట్లో అమలులో ఉన్న ఆక్ట్రాయ్ కింద రూ. 293 కోట్లు వసూలయ్యాయని ఆయన వివరించారు.
ఇకపై పుణేలో రెండు పూటలా నీటి సరఫరా
Published Tue, Aug 6 2013 10:46 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement