న్యూఢిల్లీ: రుణ వాయిదాల చెల్లింపుల విషయంలో ‘ఒక రోజు’ ఆలస్య ఘటనలు పెరుగుతుండటం పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి (వన్–డే డిఫాల్ట్) నిబంధనావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని బ్యాంకింగ్‌కు సూచించింది. రుణ చెల్లింపుల విషయంలో ‘ఒకరోజు కూడా ఆలస్యం జరగరాదు’ అన్న నిబంధనావళి కాకుండా ‘నెలలో ఏ రోజైనా రుణ చెల్లింపులు’ అన్న విధంగా నిబంధనావళిని మార్చాలని ప్రభుత్వం నుంచి సైతం ఒత్తిడి వస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. ‘బాండ్లకు సంబంధించి ఒక్కరోజు కూపన్ రేటు చెల్లింపులో ఆలస్యం జరిగినా మార్కెట్ భారీ జరిమానా విధిస్తుంది. రేటింగ్ పడిపోతుంది. ఆ భయాలతో బాండ్ల మార్కెట్‌కు సంబంధించి తగిన విధంగా వ్యవహరించే కార్పొరేట్లు, బ్యాంకు రుణాల విషయంలో ‘ఆలస్య’ విధానాన్ని ఎలా అనుసరిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ధోరణి సరికాదని స్పష్టం చేశారు. రుణ గ్రహీతలు చెల్లింపుల ‘ఒన్–డే డిఫాల్డ్ నిబంధన’ను పాటించని పక్షంలో దానిని ‘హెచ్చరిక సంకేతంగా’ తీసుకోవాల్సిందేనని ఆయన బ్యాంకింగ్‌కు స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (ఆర్‌బీఐ నిర్వహిస్తున్న)14వ స్నాతకోత్సవ కార్యక్రమంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్న విశ్వనాథన్ బుధవారం మాట్లాడారు.
నేపథ్యం ఇదీ...
బ్యాంకింగ్ రుణాల్లో మొండిబకాయిలు (ఎన్‌పీఏ) 10 శాతం దాటిపోవడంతో ఆర్‌బీఐ ఈ సమస్య పరిష్కారంలో పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన ఒక విధానాన్ని ఆవిష్కరించింది. దీనిప్రకారం– రుణ చెల్లింపుల్లో (వడ్డీసహా) కేవలం ఒక్కరోజు ఆలస్యం జరిగినా, సంబంధిత డిఫాల్ట్ వివరాలను సంబంధిత బ్యాంక్ వెల్లడించాల్సి ఉంటుంది. ఇలాంటి కేసులకు సంబంధించి 180 రోజుల్లో ఒక పరిష్కార మార్గం చూడాలి. లేదంటే, వెంటనే సంబంధిత డిఫాల్టింగ్ కంపెనీని ఇన్‌సాల్వెన్సీ కోర్టులకు నివేదించాలి. డిఫాల్టింగ్ విషయంలో ఈ విధానాన్నే బ్యాంకింగ్ అవలంభించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల వల్ల పలు కంపెనీలు ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమలపై సైతం ఒత్తిడి పెరుగుతుందని ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు సైతం ప్రతికూలమేనన్న విమర్శలూ వచ్చాయి.
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఏమన్నారంటే...
అనేకమంది రుణ గ్రహీతలు, ఇంకా చెప్పాలంటే, అధిక రేటింగ్ ఉన్న వారుసైతం ఒన్ డే డిఫాల్ట్ నిబంధనను పాటించడంలో విఫలం అవుతున్నారు. ఈ ధోరణి మారాలి. ఇలాంటి పరిణామాన్ని బ్యాంకులు హెచ్చరికపూర్వక సూచికగా భావించాలి. తగిన చర్యల తీసుకోవాలి. ఒక్క రోజు రుణ డిఫాల్ట్ జరిగినా, ఈ సమస్య పరిష్కారానికి సంబంధించిన వాచ్‌లిస్ట్‌లోకి వెళ్లిపోతారని తమ కస్టమర్లకు బ్యాంకులు స్పష్టం చేయాలి. ఇక రేటింగ్ ఏజెన్సీల పనితీరు మదింపునకు సంబంధించి తగిన ప్రమాణాలను ఆర్‌బీఐ తీసుకువస్తుంది. రేటింగ్ అభిప్రాయంలో విశ్వసనీయతకు ఇది అవసరం. కాగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధన కల్పన వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
ఒక్క రోజు ఆలస్యం అయినా చర్యలు!
Published Thu, Apr 19 2018 2:49 AM | Last Updated on Mon, Aug 13 2018 8:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment