గృహ, వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మంగళవారం కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామరాజన్ పరపతి విధానంపై సమీక్ష అనంతరం ఈ వివరాలను ప్రకటించారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలుచేసే వడ్డీరేటు) ను పావుశాతం తగ్గించింది.
నగదు. నిల్వల నిష్పత్తి ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంటాయని ప్రకటించింది. ఫలితంగా గృహరుణాలపై ఈఎంఐ తగ్గే అవకాశం ఉంది. ఈసందర్భంగా పెట్టుబడులు ఇంకా బాగా పెరగాలని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్తంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.. ఆర్థికరంగం ఇంకా కోలుకునే దశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు మంగళవారం ఆర్బీఐ ప్రకనటతో స్టాక్మార్కెట్లు నెగిటివ్గా స్పందించాయి. దాదాపు 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
రెపో రేటును తగ్గించి ఆ ప్రయోజనాన్ని రుణాలపై వడ్డీరేట్లు తగ్గించటం ద్వారా ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని ఆర్బీఐ ఆకాంక్షించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ద్రవ్యోల్బణం కట్టడిచేసేందుకు, రెపో రేటును తగ్గించాలని, అభివృద్ధికి ఊతం ఇవ్వాలని కేంద్రం గతంలో ఆర్బీయైకి సూచించింది. ప్రస్తుతమున్న 7.5 శాతం వడ్డీరేటు తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరాయి. కాగా గత జనవరి, మార్చిలో కూడా రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది.
ప్రధానంగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడులకు ఊతమిచ్చి తద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత జోరందుకునేలా చేయడంపై ఆర్‌బీఐ దృష్టిపెట్టింది. ద్రవ్యోల్భణం జనవరి 2016 నాటికి6శాతంగా ఉండవచ్చని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి కట్టడి చేయడం కూడా ఆర్‌బిఐ తన పాలసీ విధానంలో టార్గెట్ పెట్టుకుంది.