
కష్టాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు చెల్లు !
♦ వాటిని వీలైనంత త్వరగా అమ్మేయాల్సిందే...
♦ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్య
ముంబై: మొండి బకాయిల (ఎన్‌పీఏ) భారంతో కష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మేయాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సూచించారు. ‘‘భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్ర మొండిబకాయిల భారంలో ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’(ఐసీయూ)లో ఉన్నాయి. వీటిని ప్రైవేటు బ్యాంకులకు అమ్మివేయచ్చు. మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న ఆయా బ్యాంకులు ఇందుకు సంబంధించి తమ పరిస్థితిని మెరుగుపరచుకోడానికి, తాజా మూలధనం సమీకరించుకోడానికి సమయం మించిపోతుంది’’ అని అన్నారు. 8వ ఆర్‌కే తల్వార్ స్మారకోపన్యాసం చేసిన ఆయన ఈ సందర్భంగా ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుత్తేజం– అసంపూర్ణ అజెండా’ అన్న అంశంపై మాట్లాడారు. న్యూయార్క్ యూనివర్శిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ అయిన ఆచార్య ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
ప్రభుత్వ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత్‌కు ఒక ‘సుదర్శన చక్రం’ కావాల్సిందే. సామర్థ్యం పెంపునకు బ్యాంకులు చేపడుతున్న చర్యలు పూర్తి మందగమనంలో ఉన్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కరించడంలో కాలాతీతం అయిపోతోంది. దీనితో రుణాలకు అధికభాగం వీటిమీదే ఆధారపడుతున్న చిన్న తరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుద్ధరించడానికి ఉద్దేశించిన ఇంద్రధనుష్ కార్యక్రమం (నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా రూ.70,000 కోట్ల అందజేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్రం ప్రకటించింది) మంచిదే. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సత్వర సమస్య పరిష్కారానికి ఇంకా శక్తివంతమైన ‘సుదర్శన’ చక్రం వంటి ప్రణాళిక అవసరం.
‘ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రధానమైన అంశాలు ఏమిటంటే, ప్రైవేటు క్యాపిటల్ ప్రొవైడర్స్‌కు కష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మివేయవచ్చా? తద్వారా ఆయా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో అమలు జరుగుతున్న ‘తగిన దిద్దుబాటు చర్యల (పీఏసీ)’తో ఐసీయూలో నుంచి పటిష్ట వంతమైన వ్యవస్థలోకి మారే వీలుంటుందా? ఈ ప్రశ్నలకు తగిన సమాధానాన్ని చిన్న బ్యాంకులతో రాబట్టే వీలుంటుందా?’ అని ఆచార్య ఈ సందర్బంగా ప్రశ్నించారు.
బ్యాంకులకు రెండో విడత ‘దివాలా’ జాబితా
మొండిబకాయిల ఖాతాలకు సంబంధించి బ్యాంకులకు తాజాగా రెండో జాబితాను పంపించినట్టు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ధ్రువీకరించారు. దివాలా కోడ్‌లోని నిబంధనలను మార్చామని, మొండిబకాయిల విషయంలో వీటిని విస్తృతంగా వినియోగించుకోవాలని బ్యాంకులను కోరినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇతర ఖాతాలను పరిష్కరించుకోవాలని కూడా సూచించినట్టు తెలిపారు. ఒకవేళ నిర్దేశించిన సమయంలోపు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడంలో విఫలమైతే ఆయా కేసులను సైతం బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలకు సిఫారసు చేస్తామని విరాల్æ వివరించారు.
ఆర్‌బీఐ తొలిసారిగా 12 భారీ రుణ ఎగవేత కేసుల్లో ఐబీసీ కింద చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల మరో 40 కేసులతో రెండో జాబితాను బ్యాంకులకు పంపినట్టు వార్తలు వచ్చాయి. కానీ, విరాల్ ఆచార్య మాత్రం ఈ సంఖ్య గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఐబీసీ కింద కేసులు ఫైల్ చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులకు ఆదేశించడం వాణిజ్య నిర్ణయంలో భాగమేనన్నారు. నిరర్థక ఆస్తులను ఏరిపారేయడానికి బ్యాంకులు ఐబీసీని మరింతగా వాడుకోవాలన్నారు. దివాలా చర్యలను తమంతట తామే చేపట్టాలని, ఆర్‌బీఐ అనుమతి కోసం వేచి చూడరాదని సూచించారు. ఎన్‌పీఏలు రెండంకెలకు చేరడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉందని, రుణ వృద్ధి కూడా తగ్గుముఖం పట్టిందన్నారు.