‘లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్ ఎవరినైనా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చారు అనగానే... ఇక వారు తిరిగి మామూలు వ్యక్తిగా వెనక్కు రావడం అసాధ్యమనేది చాలామంది సాధారణ ప్రజల్లో ఉండే అ΄ోహ. కాసేపు కోలుకున్నట్లుగా కనిపించినా ఐసీయూలో చేర్చేవారిలో చాలామంది ఆరోగ్యం క్రమంగా విషమిస్తుందని అనుకుంటూ ఉండేవారి సంఖ్య ఎక్కువ. కేవలం కొందరు మాత్రమే కోలుకుంటారనే అభిప్రాయాలు చాలా మందిలో వినిపిస్తుంటాయి.
నిజానికి ఐసీయూలో గనక చేర్చకపోతేనే మరణావకాశాలు ఎక్కువ. అసలు ఐసీయూలో ఎలాంటి వసతులుంటాయి, అక్కడ అత్యంత ముప్పు ఉన్న బాధితుల విషయంలో డాక్టర్లు ఏం చేస్తారు, ఎలాంటి చికిత్స అందిస్తారు, ఏయే జాగ్రత్తలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకుందాం.
మానవ శరీరం అనేక ఖనిజ లవణాలతో ఎన్నో సంక్లిష్టమైన జీవరసాయన చర్యలు జరుగుతుండటం వల్లనే సజీవంగా ఉంటూ, ఆరోగ్యకరంగా పనిచేస్తుంటుంది. ఎవరైనా ఏదైనా తీవ్రమైన జబ్బుల బారిన పడ్డా లేదా ఏదైనా ప్రమాదంలో గాయపడ్డా ఈ జీవరసాయన క్రియల్లోనూ, శరీరంలోని ఇతర ఖనిజ, లవణాల వంటి రసాయనిక అంశాల్లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.
ఫలితంగా దేహంలోని ఎన్నెన్నో భాగాలు వేగంగా మార్పులకూ, వివిధ పరిణామాలకు లోనవుతూ ఉంటాయి. దాంతో చాలా దుష్పరిణామాలకు అవకాశాలెక్కువ. శరీరంలో ఉంటే సహజమైన సమతుల్యత (హోమియోస్టేసస్) కూడా దెబ్బతింటుంది. బాధితులకు వచ్చే ప్రమాదాలూ... అధిగమించే పద్ధతులు... ఐసీయూలో చేర్చాల్సి వచ్చిన బాధితుల్లో కనిపించే కొన్ని హటాత్పరిణామాలు ఇలా ఉండవచ్చు...
ఉదాహరణకు హటాత్తుగా గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, గుండె సరిగా పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తడం, మెదడులోగానీ, కడుపులోగాని రక్తస్రావం కావడం వంటి సమస్యలు ఒక్కోసారి శరీరం వెంటనే కోలుకునే అవకాశం లేకుండా చేయవచ్చు.
ఇలాంటి సమయాల్లో రోగి పరిస్థితి చాలా వేగంగా క్షీణించడం మొదలువుతుంది. కొందరిలో ఇది ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. ఇలాంటి హటాత్పరిణామాల్లో ఏది వస్తుందో, ఏది రాదో ముందే ఊహించడం సాధ్యం కాదు. అయితే క్రిటికల్ కండిషన్‌లో ఉన్న బాధితులు ఐసీయూలో గనక ఉన్నట్లయితే వారిలో ఆయా సమయాలకు వచ్చే అనర్థాలనూ, ప్రమాదాలనూ వెంటనే గుర్తించి, వెనువెంటనే స్పందించి, వచ్చిన సమస్యకు అనుగుణంగా అవసరమైన చికిత్సను తక్షణం అందించడం సాధ్యమవుతుంది.
ఉదాహరణకు ఊపిరి అందనప్పుడు ఐసీయూలోని వెంటిలేటర్లను ఉపయోగించడం, మూత్రపిండాలు పనిచేయకపోతే వెంటనే డయాలసిస్ వంటి ప్రాణరక్షణ యంత్రాన్ని వాడటం వంటివి చేసేందుకు వెసులుబాటు ఉంటాయి. గుండె లయలో తేడా వచ్చినప్పుడు సరిచేయడానికి డిఫిబ్రిలేటర్లు ఉంటాయి.
క్రిటికల్ కేర్ నిపుణులతో తక్షణ వైద్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే క్రిటికల్ కేర్ వైద్యనిపుణులు శరీరంలో ఎప్పుడే మార్పు వచ్చినా దానికి అనుగుణంగా స్పందిస్తారు. ఉదాహరణకు గుండె ఆగి΄ోయినా తక్షణమే తిరిగి పనిచేయించడానికి సీపీఆర్ చేయడం, షాక్‌లు ఇచ్చి, బాధితులను విజయవంతంగా బతికించడం చేసిన కేసులే ఎక్కువ. కిడ్నీ పని చేయక΄ోతే రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ, కాలేయం పనిచేయకపోతే ఉపయోగించే మార్స్... ఇలా అందుబాటులో ఉండే ఉపకరణాలూ, పరికరాలతో చికిత్స అందిస్తారు.
మందుల్ని అనుకున్న మోతాదుల్లో పంపేందుకు ఇన్‌ఫ్యూజన్ పంపులు ఉంటాయి. ఇక బీపీని, నాడిని లోపలి నుంచి వచ్చే ప్రతి బీట్‌నూ కొలిచే వీలుంటుంది. ఇక బాధితులను చూసుకోడానికి ఏడాదిలో ప్రతిరోజూ 24 గంటలూ జాగ్రత్తగా చూసుకోడానికి నిపుణులైన ఫిజీషియన్లు, నర్సులు, శ్వాస అందేలా చూడటానికి రెస్పిరేటరీ టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు.
ఏ కొద్ది తేడా వచ్చినా వెంటనే పై నిపుణులంతా చురుగ్గా స్పందించడంతో తక్షణ వైద్యచికిత్సలు మొదలవుతాయి. ఇవన్నీ చాలా క్రిటికల్‌గా ఉండే బాధితులకు అవసరమైనవి. అప్పటికే పరిస్థితి బాగా విషమించి΄ోయిన సందర్భాల్లో తప్ప... నిజానికి ఇప్పుడు విజయవంతమైన చికిత్సతో ఐసీయూలోంచి బయటకు వచ్చేవారి సంఖ్యే ఎక్కువ.
ఐసీయూలో ఏం చేస్తారంటే...
బాధితులను ఐసీయూలో ఉంచినప్పుడు దేహంలో వచ్చే మార్పులనూ, అలాగే దేహంలోని అనేక కీలకమైన పనులు జరగడానికి తోడ్పడుతుండే జీవరసాయన చర్యలూ, వాటిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, జరిగిన ప్రతికూల మార్పులను మళ్లీ యథాస్థితికి (నార్మల్‌కు) తెచ్చేందుకూ, వాటిని క్రమబద్ధంగా జరిగేలా చూసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటారు. బాధితులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటారు కాబట్టీ, వాళ్లను నార్మలైజ్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటారు కాబట్టి... ఆ డాక్టర్లను ‘క్రిటికల్ కేర్’ నిపుణులుగా చెబుతారు.
ఐసీయూలోని సౌకర్యాలేమిటంటే...
శరీరం తాలూకు సహజ సమతౌల్య స్థితి (హోమియోస్టేసస్)తిరిగి పొందేందుకు అవసరమైన అన్ని చికిత్సల కోసం కావాల్సిన సౌకర్యాలన్నీ ఐసీయూలో ఉంటాయి. ఏదైనా వ్యాధికి లోనైన శరీర భాగాలు వాస్తవానికి తమను తాము రిపేర్ చేసుకునే స్వాభావికమైన (నేచురల్) గుణం... దాదాపుగా అన్ని అవయవాలకూ ఉంటుంది.
కానీ కీలకభాగాలైన మెదడు, గుండె, శ్వాసకోశ వ్యవస్థ, కాలేయం, కిడ్నీలు, రక్తం దెబ్బతింటే అవి నేచురల్‌గానే కోలుకోవాలంటే పట్టే సమయం అతడు బతికి కోలుకోవడం కోసం సరిపోదు. అవి వీలైనంత త్వరగా కోలుకునేలా చేయగలిగితేనే ఆ బాధితుడి మనుగడ (సర్వైవల్) సాధ్యమవుతుంది. ఆ వ్యవస్థలను వీలైనంత త్వరగా మామూలు స్థితికి తెచ్చే సౌకర్యాలన్నీ ఐసీయూలో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment